దేవీ నవరాత్రులలో మహానవమి అత్యంత ముఖ్యమైనది. నవరాత్రుల్లో తొమ్మిదవ రోజును మహానవమి అంటారు. ఈ రోజునే అమ్మవారికి మహానవమి పూజ కూడా నిర్వహిస్తారు. తొమ్మిది రోజుల పండుగ సందర్భంగా భక్తులు దుర్గా దేవిని తొమ్మిది రూపాల్లో కొలుస్తారు. నవమి నాడు దుర్గామాతను...మహిషాసురమర్దినిగా పూజిస్తారు. మహార్నవమి రోజున ఎర్రచీరను దుర్గాదేవికి అలంకరిస్తారు. కొందరు మహర్నవమి పర్వదినాన ముక్తేశ్వరీ దేవిని ఆరాధిస్తారు. దశ మహావిద్య పూజ, సప్తమాతృక, అష్టమాతృక పూజలు నిర్వహిస్తారు. నవదుర్గ శాక్తేయ సాంప్రదాయులు సిద్ధిధాత్రీ పూజ చేస్తారు.
ఒక్క రోజు చేసే పూజతో ఫలం..
మహా నవమిని అశ్వినీ నక్షత్రంలో శుక్ల పక్షం తొమ్మిదవ రోజున జరుపుకుంటారు. ఇది విజయదశమి ముందురోజు..దుర్గాష్టమికి తర్వాతి రోజు జరుపుకుంటారు. తొమ్మిదిరోజులు పూజలు చేయలేని వారు..సప్తమి నుండి మూడు రోజులు పూజలు చేయవచ్చు. అలా కూడా కుదరని పక్షంలో ఈ మహా నవమి రోజైనా తప్పక అమ్మవారిని పూజించాలి. ఈ ఒక్కరోజు పూజ నిర్వహిస్తే నవరాత్రుల పుణ్య ఫలం దక్కుతుంది. నవరాత్రులలో అష్టమి, నవమి తిథి చాలా ముఖ్యమైనవిగా పరిగణించబడతాయి. శాస్త్రాల ప్రకారం ఈ రెండు రోజుల్లో అమ్మవారిని పూజిస్తే కలిగే ఫలితం నవరాత్రులంతా ఉపవాసం చేసినట్లే.
ఆయుధ పూజ
మహానవమి నాడు.. మహాశక్తిని పూజిస్తే శత్రుభయం ఉండదు. అన్ని అవతారాల్లోనూ ఆదిపరాశక్తి, దుష్ట రాక్షసులను ఆశ్వయుజ శుద్ధ నవమి నాడే సంహరించింది. ఏడాదిలో ఉండే ఇరవైనాలుగు నవమి తిథుల్లోనూ మహానవమి గొప్పది. ఈ పర్వదినాన.. ఆయుధ పూజ నిర్వహిస్తారు.
ఆడబిడ్డలను పూజించడం..
మహానవమి రోజున ఆడబిడ్డలను పూజించడం మరో సంప్రదాయం. మహానవమి రోజున తొమ్మిది మంది అమ్మాయిలకు భోజనాన్ని వడ్డించాలి. భోజనం తర్వాత వారికి బట్టలు, బహుమతులు సమర్పించాలి. నవరాత్రులంతా పూజించిన తర్వాత ఆడపిల్లలకు కానుకలు ఇస్తే రెట్టింపు ఫలితం లభిస్తుందని చెబుతారు. నవరాత్రుల నవమి నాడు హోమం చేయాలనే నియమం కూడా ఉంది. ఇందులో సహస్రనామాలను పఠిస్తూ అమ్మవారికి నైవేద్యాలు సమర్పిస్తారు. మహార్నవమి రోజున అమ్మవారికి పిండివంటలతో పాటు చెరుకుగడలు నైవేద్యంగా సమర్పిస్తారు.
మహానవమి చేసే పూజలు ముఖ్యంగా ఫలవంతమైనవిగా పరిగణించబడతాయి. అందుకే నవమి రోజున చిత్తశుద్ధితో దుర్గాదేవిని పూజించడం ద్వారా సకల కార్యాలు సిద్ధిస్తాయని నమ్మకం. దుర్గాదేవి అనుగ్రహం పొందడానికి మహానవమి రోజు చాలా ముఖ్యమైనది. ఈ రోజు చేసే పూజలతో అన్ని కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు.