మహారాష్ట్రలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. అమరావతి జిల్లా అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ACP) తన సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకున్నారు. అంతకంటే ముందు తన భార్య, మేనల్లుడిని కూడా హత్య చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది.
ప్రస్తుత సమాచారం ప్రకారం ACP భరత్ గైక్వాడ్ తన భార్య మోని (44), మేనల్లుడు దీపక్ (35)లను తుపాకీతో కాల్చి చంపాడు. పూణెలో ఈ ఘటన జరిగింది. ఆ తర్వాత అతడు కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జులై 24 తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. గైక్వాడ్ భార్య తమ ఇద్దరు పిల్లలతో కలిసి పూణేలో ఉంటున్నాడు. గైక్వాడ్ అమరావతి ఏసీపీగా విధులు నిర్వహించి ఇంటికి వచ్చారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించి.. ఆ ముగ్గురినీ జూపిటర్ ఆస్పత్రికి తరలించారు. అనంతరం వారు చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు.
కాగా, ఈ ఘటనకు గల కారణాలు ఇంకా తెలియరాకపోవడంతో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. గైక్వాడ్ తన లైసెన్స్ రివాల్వర్‌ను ఉపయోగించాడా లేదా సర్వీస్ రివాల్వర్‌ని ఉపయోగించాడా అనే దానిపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు.