మహారాష్ట్రలో నవంబర్ 20న పోలింగ్

మహారాష్ట్రలో  నవంబర్ 20న పోలింగ్
  • ముగిసిన ఎన్నికల ప్రచారం
  • హామీలు, ఆరోపణలు, తిట్లతో హోరెత్తించిన నేతలు
  • ఆరు ప్రధాన పార్టీలతో కలగూర గంపలా పొలిటికల్ సీన్​

ముంబై: హోరాహోరీగా సాగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సోమవారం సాయంత్రంతో ముగిసింది. పార్టీలు, వాటి కూటములు హామీలు, విమర్శలు, ఆరోపణలు, తిట్లతో హోరెత్తించాయి. ప్రధాన పార్టీల్లో చీలికలతో రాష్ట్రంలోని రాజకీయాలు గందరగోళంగా మారాయి. చరిత్రలో ఎన్నడూ లేనటువంటి కలగూరగంప లాంటి పొలిటికల్ సీన్ నెలకొంది. శివసేన, ఎన్సీపీ చీలికలు, కాంగ్రెస్, బీజేపీ ఇలా రాష్ట్రంలో ప్రధాన పార్టీల సంఖ్యనే అరడజనుకు చేరడం ఓటర్లకు పరీక్షలా మారింది. మహా యుతి కూటమి అధికారాన్ని నిలబెట్టుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నది. మళ్లీ అధికారంలోకి రావడం కోసం మహా వికాస్ అఘాడి (ఎంవీఏ) కూటమి బలంగా పోరాడుతున్నది. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారంలో నరేంద్ర మోదీ, అమిత్ షా, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ  వంటి ప్రముఖ నేతలు తమ పార్టీల అభ్యర్థుల గెలుపుకోసం రాష్ట్రంలో విస్తృతంగా పర్యటించారు. మహారాష్ట్రతో పాటు జార్ఖండ్​లో ఈ నెల 20న (బుధవారం) పోలింగ్ జరగనుంది.  

చివరి రోజు ప్రచారం ఇలా

ప్రచారం చివరి రోజు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్​లో మీడియా సమావేశం నిర్వహించారు. బీజేపీ సారథ్యంలోని రాష్ట్ర ప్రభుత్వం మహారాష్ట్ర సంపదను కొందరు బిలియనీర్లకు దోచిపెడ్తున్నదని ఆరోపించారు. మహారాష్ట్ర సీఎం, ఏక్‌‌నాథ్ షిండే థానే, చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రచారం చేశారు. అజిత్ పవార్ బారామతితో సహా ఐదు చోట్ల ర్యాలీల్లో పాల్గొన్నారు. జేపీ నడ్డా అక్కల్​కోట్, బేలాపూర్ సభల్లో పాల్గొన్నారు. శరద్ పవార్ బారామతి సహా మూడు చోట్ల ర్యాలీ నిర్వహించారు. దేవేంద్ర ఫడ్నవీస్ నాగ్‌‌పూర్ నైరుతి నియోజకవర్గంలో ప్రచారం చేశారు.

ప్రచారంలో ప్రధానాంశాలు

ఎన్నికలకు కొద్ది రోజుల ముందు మహా యుతి కూటమి ప్రభుత్వం మహిళలకు ప్రతినెలా డబ్బులు ఇచ్చే ‘మాఝీ లాడ్కీ బహిన్’ పథకం తీసుకొచ్చింది. ఇది ఎన్నికల్లో తమకు చాలా మెరుగైన ఫలితాలు ఇస్తుందని నమ్ముతున్నది. ఎంవీఏ కూటమి కులగణన అస్త్రాన్ని ఎదుర్కొనేందుకు.. బీజేపీ  ‘బాటేంగే తో కాటేంగే’ , ‘ఏక్ హై తో సేఫ్ హై’ వంటి నినాదాలను ఎత్తుకుంది. అయితే బీజేపీ ఇచ్చిన ఈ నినాదాలకు మహాయుతి కూటమిలోని ఇతర పక్షాలు మద్దతు ఇవ్వకపోవడం గమనార్హం. ఇది అధికార కూటమిలో కొంత గందరగోళానికి దారితీసింది. కులాల వారీగా జనాభా లెక్కింపు, సామాజిక న్యాయం, రాజ్యాంగాన్ని పరిరక్షించడం వంటి అంశాలను ప్రధానంగా ప్రస్తావిస్తూ ఎంవీఏ కూటమి ప్రచారం చేసింది.

రెండు కూటముల ప్రకటనల పోరు

మహాయుతి, ఎంవీఏ సోమవారం ఒక కూటమి టార్గెట్​గా మరో కూటమి న్యూస్​పేపర్లలో ప్రకటనలు ఇచ్చాయి. మహా యుతి కూటమి ఇచ్చిన ప్రకటనల్లో కాంగ్రెస్​కు నో చెప్పండి అని పేర్కొంది. కర్నాటకలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఎన్నికల హామీలేవి అధికారంలోకి వచ్చాక అమలు చేయడం లేదని ఆ ప్రకటనల్లో ఆరోపించింది. అలాగే గతంలో ముంబై టెర్రరిస్టు దాడులు, పాల్ఘర్​ వద్ద సాధువుల హత్య తదితర ఘటనలను ప్రస్తావించింది. మహాయుతి వైఫల్యాలు, రైతు ఆత్మహత్యలు, నెరవేర్చని హామీలు, రోడ్ల దుస్థితి, ఖాళీ పోస్టులు, నిరుద్యోగం, పెరుగుతున్న నేరాలు, మహిళల అభద్రతపై ఎంవీఏ కూటమి సైతం ప్రకటనలు ఇచ్చింది.