
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల వేళ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) చీఫ్, మాజీ సీఎం శరద్ పవార్‌కు సుప్రీంకోర్టులో బిగ్ షాక్ తగిలింది. ఎన్సీపీ పార్టీ చిహ్నాం గడియారం గుర్తుపై దేశ అత్యున్నత న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించింది. గడియారం గుర్తును అజిత్ పవార్ వర్గం ఉపయోగించుకోవచ్చని గురువారం (అక్టోబర్ 24) సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దీంతో అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయ చాణక్యుడు శరద్ పవార్‌కు భారీ ఎదురు దెబ్బ తగిలినట్లైంది.
కాగా, శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీని అతని మేనల్లుడు అజిత్ పవార్ రెండుగా చీల్చిన విషయం తెలిసిందే. ఎన్సీపీని రెండు ముక్కలు చేసిన అజిత్ పవార్.. తన వర్గం ఎమ్మెల్యేలతో అధికార మహాయతి కూటమిలో చేరి డిప్యూటీ సీఎం పదవి దక్కించుకున్నారు. ఈ క్రమంలో పార్టీ చిహ్నాంపై శరద్, అజిత్ పవార్ వర్గాల మధ్య పోటీ నెలకొంది. అసలైన ఎన్సీపీ మాదంటే మాదేనని రెండు వర్గాలు క్లెయిమ్ చేసుకున్నాయి. అయితే, మెజార్టీ ఎమ్మెల్యేలు అజిత్ పవార్ వెంట ఉండటంతో ఎన్సీపీ చిహ్నాం గడియారం గుర్తును నిబంధనల ప్రకారం ఎన్నికల సంఘం అజిత్ పవార్‌కు కేటాయించింది.
ఈసీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ శరద్ పవార్ వర్గం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అసలైన ఎన్సీపీ మాదేనని.. పార్టీ సింబల్ గడియారం గుర్తును తమకే కేటాయించేలా ఈసీకి ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై ఇవాళ విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. శరద్ పవార్ వర్గం అభ్యర్థనను తోసిపుచ్చి.. గడియారం గుర్తును అజిత్ పవార్ ఉపయోగించుకోవచ్చని స్పష్టం చేసింది.
ALSO READ | ‘మహా’ ఎలక్షన్స్: అసెంబ్లీ ఎన్నికల బరిలో రాజ్ కుమార్ థాక్రే కుమారుడు
కాగా, 2024, అక్టోబర్ 15వ తేదీన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన విషయం తెలిసిందే. మహారాష్ట్రలోని మొత్తం 288 అసెంబ్లీ సీట్లు ఉండగా.. 2024, నవంబర్ 20వ తేదీన సింగల్ ఫేజ్‌లో ఎన్నికలు నిర్వహిస్తామని ఎలక్షన్ కమిషన్ ప్రకటించింది. నవంబర్ 23వ తేదీన ఓట్ల లెక్కింపు, ఫలితాలు విడుదల కానున్నాయి.
మహారాష్ట్ర ఎన్నికల పూర్తి షెడ్యూల్:
- నోటిఫికేషన్ వెలువడు తేదీ: 22/10/ 2024
- నామినేషన్ల దాఖలకు చివరి తేదీ: 29/10/ 2024
- నామినేషన్ల పరిశీలన: 30/10/ 2024
- నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ: 04/11/ 2024
- పోలింగ్ జరుగు తేదీ: 20/11/ 2024
- కౌంటింగ్ తేదీ: 23/11/ 2024
మహారాష్ట్ర: 288 అసెంబ్లీ సీట్లు(జనరల్-234, ఎస్సీ-29, ఎస్టీ- 25)
- మొత్తం ఓటర్ల సంఖ్య: 9 కోట్ల 63 లక్షలు
- పురుష ఓటర్లు: 4 కోట్ల 97 లక్షలు
- మహిళా ఓటర్లు: 4 కోట్ల 66 లక్షలు
- యువత: 1.86 కోట్లు
- తొలిసారి ఓటు హక్కు: 20.93లక్షలు
- మొత్తం పోలింగ్ స్టేషన్లు: లక్షా 186
- ఒక్కో పోలింగ్ బూతుకు 960 మంది ఓటర్లు
- మోడల్ పోలింగ్ స్టేషన్ 530