జూన్ 7 నాటికి 3 వేలు దాటిన మరణాలు
మహారాష్ట్రలో 85,975 కేసులు నమోదు
దేశంలో 43% డెత్స్ ఇక్కడే
ముంబై: మన దేశంలో కరోనాకు కేంద్రంగా మారిపోయిన మహారాష్ట్ర ఏకంగా చైనాను దాటిపోయింది. ఆదివారం నాటికి చైనాలో 84,191 కరోనా కేసులు నమోదు కాగా, మన దేశంలో ఒక్క మహారాష్ట్ర లోనే కేసుల సంఖ్య 85,975కు చేరింది. చైనాలో అటు కేసులు, ఇటు మరణాలు నెమ్మదించగా, మహారాష్ట్రలో మాత్రం కేసులు, మరణాలు భారీగా పెరుగుతున్నాయి. మహారాష్ట్ర పబ్లిక్ హెల్త్ డిపార్ట్ మెంట్ లెక్కల ప్రకారం, జూన్ 7 నాటికి రాష్ట్రంలో కరోనా మరణాలు3 వేలు దాటాయి. రాబోయే రెండు నెలల్లో ఈ వైరస్ మరింతగా విజృంభించే చాన్స్ ఉందని నిపుణులు చెప్తున్నారు. మహారాష్ట్రలో మార్చి 9న మొదటి కరోనా కేసు రికార్డ్ అయింది. ఆ తర్వాత రెండు వారాలకు కేసులు100కు పెరిగాయి. మార్చి 31 నాటికి దేశంలో1400 కేసులే ఉండగా, మహారాష్ట్రలో 302 కేసులే కన్ఫమ్ అయ్యాయి. ఆ తర్వాత లాక్ డౌన్ గట్టిగా అమలుచేసినా వైరస్ విజృంభించింది. మహారాష్ట్రలో ఏప్రిల్ ఫస్ట్ వీక్ లో కేసుల సంఖ్య1000కి పెరిగింది. ఏప్రిల్ చివరినాటికి 10 వేల మార్కును దాటింది. ఆ తర్వాత కేవలం 9 రోజులకే కేసులు రెట్టింపు అయి, 20 వేలకు చేరాయి. మే 1 నాటికి రాష్ట్రంలో రోజూ యావరేజ్ గా కేసుల సంఖ్య వెయ్యికి చేరింది. మే నెల అంతటా కేవలం మూడు రోజులు తప్పిస్తే ప్రతిరోజూ వెయ్యికి పైగా కేసులు నమోదయ్యాయి. మే ఫస్ట్ వీక్ లో యావరేజ్ గా రోజూ 1,067 కేసులు వస్తుంటే, అదే నెల చివరినాటికి ఇది 2,500కు పెరిగింది. రాష్ట్రంలో కరోనా మొదలైనప్పటి నుంచీ జూన్ ఫస్ట్ వీక్ లోనే గ్రోత్ రేట్ 4 శాతం లోపు రికార్డ్ అయింది. ఇక కరోనా కేసుల్లో మన దేశం మే15వ తేదీనే చైనాను దాటింది. తాజాగా దేశంలో 2.56 లక్షల కేసులు కన్ఫమ్ అయ్యాయి. అమెరికా, బ్రెజిల్, రష్యా, స్పెయిన్, బ్రిటన్ తర్వాత ప్రపంచంలోనే కరోనా ఎక్కువగా వ్యాపించిన ఆరో దేశంగా ఇండియా నిలిచింది. మే 15 నుంచి జూన్ 7 నాటికి.. అంటే కేవలం 23 రోజుల్లోనే దేశంలో 1.70 లక్షల కేసులు పెరిగాయి.
57 శాతం కేసులు ముంబైలోనే..
మహారాష్ట్ర అంతటా కరోనా విజృంభిస్తున్నప్పటికీ, ఈ వైరస్ ముంబైలో మరింత తీవ్రంగా వ్యాపిస్తోంది. రాష్ట్రంలోని మొత్తం కేసుల్లో 57% కేసులు ముంబై సిటీలోనే నమోదయ్యాయి. మహారాష్ట్రలో కేసులతో పాటు మరణాలు కూడా భారీగానే సంభవిస్తున్నాయి. ఆదివారం నాటికి చైనాలో 4,638 మరణాలు నమోదు కాగా, మహారాష్ట్రలో ఆ సంఖ్య 3 వేలు దాటింది. చైనా చెప్తున్న లెక్కల్లో నిజమెంత? అన్నదానిపై అనేక అనుమానాలు ఉన్నప్పటికీ, ఆ దేశం అధికారికంగా చెప్తున్న కేసుల సంఖ్యతో పోలిస్తే మాత్రం.. మహారాష్ట్ర పరిస్థితి దారుణంగా ఉన్నట్లు తెలుస్తోంది. పుణె జిల్లా కూడా కరోనాకు హాట్ స్పాట్ గా మారిపోయింది. జులై లేదా ఆగస్టులో వైరస్ పీక్ స్టేజీకి చేరి, మరింత తీవ్రంగా విజృంభిస్తుందని, దానిని ఎదుర్కొనేందుకు సర్కారు రెడీగా ఉండాలని చెప్తున్నారు.
ముంబై సిటీయే పెద్ద సవాల్..
మహారాష్ట్రలో ప్రధానంగా ముంబై సిటీలోనే కరోనాను హ్యాండిల్ చేయడం అతిపెద్ద సవాలుగా మారింది. సిటీలో 45 శాతం మంది స్లమ్ ఏరియాల్లోనే నివసిస్తున్నారు. ఆసియాలోనే అతిపెద్ద స్లమ్ ధారావి కూడా ఇక్కడే ఉంది. దీంతో ఫిజికల్ డిస్టెన్స్ రూల్స్ అమలు చేయడం చాలా కష్టమవుతోంది.
For More News..