న్యూఢిల్లీ : మహారాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్రకాంత్ పాటిల్.. ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలేపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. రాజకీయాలు అర్థం కాకుంటే ఇంటికెళ్లి వంట చేసుకోవాలంటూ సుప్రియను ఉద్దేశిస్తూ పాటిల్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. మహారాష్ట్రలో ఉద్యోగాలు, విద్యాలయాల్లో ఓబీసీ రిజర్వేషన్లు అమలు చేయాలంటూ బీజేపీ ఆందోళనలు చేపట్టింది. దీంతో బీజేపీ, ఎన్సీపీల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. ఈ క్రమంలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న సుప్రియా సూలే.. మధ్యప్రదేశ్లో ఓబీసీ కోటా అమలుకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని, ఆ రాష్ట్ర సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఢిల్లీలో ఎవరినో కలిసిన రెండు రోజులకే రిజర్వేషన్లకు కేంద్రం ఓకే చెప్పిందని ఆరోపించారు.
సుప్రియా సూలే వ్యాఖ్యలపై మహారాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్రకాంత్ పాటిల్ ఘాటుగా స్పందించారు. ఆమెకు రాజకీయాలు తెలియవని, అసలు రాజకీయాల్లో ఎలా కొనసాగుతుందోనని అన్నారు. ఇంటికెళ్లి వంట చేసుకోవాలని సూచించారు. సుప్రియను పార్లమెంటు మెంబర్ అయినప్పటికీ ఆమెకు సీఎంను ఎలా కలవాలో తెలియదని విమర్శిచారు. పాటిల్ కామెంట్లపై సుప్రియ భర్త సదానంద సూలే రియాక్ట్ అయ్యారు. చంద్రకాంత్ స్త్రీ ద్వేషి అని ట్విట్టర్లో ట్వీట్ చేశారు. గృహిణిగా, తల్లిగా, విజయవంతమైన రాజకీయవేత్తగా తన భార్యను చూసి గర్వపడుతున్నానని పోస్ట్ చేశారు. పాటిల్ చేసిన వ్యాఖ్యలు మహిళా సమాజాన్ని అవమానించడమేనని అభిప్రాయపడ్డారు.
I am proud of my wife who is a homemaker, mother and a SUCCESSFUL politician, one amongst many other hardworking and talented women in India….this is an insult to all women….
— sadanandsule (@sadanandsule) May 25, 2022