బీజేపీ అధ్యక్షుడి కొడుకు కారు అర్థరాత్రి చేసిన బీభత్సం ఇది.. వీడియో వైరల్..

బీజేపీ అధ్యక్షుడి కొడుకు కారు అర్థరాత్రి చేసిన బీభత్సం ఇది.. వీడియో వైరల్..

ముంబై: మహారాష్ట్రలో బీజేపీ అధ్యక్షుడి కొడుకు ఆడి(Audi) కారుతో బీభత్సం సృష్టించాడు. సోమవారం అర్థరాత్రి ఒంటి గంట సమయంలో నాగ్పూర్ రోడ్లపై మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రశేఖర్ బవాన్కులే కుమారుడు సంకేత్ బవాన్కులే నానా రచ్చ చేశాడు. నాగ్పూర్లోని రాందాస్పేత్ ప్రాంతంలో సంకేత్ కారు పలు వాహనాలను ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు యువకులకు గాయాలయ్యాయి.

కారును ఢీ కొట్టి.. అంత బీభత్సం సృష్టించి అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యేందుకు సంకేత్ ప్రయత్నించాడు. ఛేజ్ చేసి మరీ మంకాపూర్ బ్రిడ్జ్ దగ్గర సంకేత్ కారును అడ్డుకున్నారు. కారులో బీజేపీ అధ్యక్షుడి కుమారుడితో పాటు కారు డ్రైవర్ అర్జున్ హౌరే, రోణిత్ అనే మరో యువకుడు ఉన్నారు. ర్యాష్ డ్రైవింగ్ ఈ ఘటనకు కారణంగా పోలీసులు తేల్చారు. కారు నడిపింది ఎవరో స్పష్టత లేదు గానీ పోలీసులు కారు డ్రైవర్పై కేసు నమోదు చేయడం గమనార్హం.

బీజేపీ అధ్యక్షుడి కుమారుడిని ఈ కేసు నుంచి తప్పించేందుకే డ్రైవర్పై కేసు నమోదు చేశారని ప్రత్యర్థి పార్టీలు ఆరోపించాయి. ధరమ్పేత్లోని ఒక బార్ నుంచి ఈ ఆడి కారు తిరిగొస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ ఘటనపై మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రశేఖర్ బవాన్కులే స్పందించారు. చట్టం దృష్టిలో అందరూ సమానమేనని, పోలీసులు నిష్పాక్షికంగా విచారణ జరపాలని చెప్పారు. తన కొడుకు తప్పు చేసినట్టు తేలితే తగిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. తాను ఈ ఘటనపై పోలీసులతో ఎలాంటి సంప్రదింపులు జరపలేదని ఆయన చెప్పుకొచ్చారు. ఈ కారు బీభత్సానికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ కావడంతో సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.