మహారాష్ట్ర కేబినెట్ విస్తరణ.. మంత్రులుగా 39 మంది ప్రమాణం

మహారాష్ట్ర కేబినెట్ విస్తరణ.. మంత్రులుగా 39 మంది ప్రమాణం

నాగ్​పూర్: మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కేబినెట్‎ను విస్తరించారు. మరో 39 మందిని మంత్రులుగా తీసుకున్నారు. వీరంతా ఆదివారం నాగ్​పూర్‎లోని రాజ్​భవన్‎లో గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ సమక్షంలో మంత్రులుగా ప్రమాణం చేశారు. కార్యక్రమానికి బీజేపీ శాసనసభా పక్ష నేత, సీఎం ఫడ్నవీస్ తోపాటు డిప్యూటీ సీఎంలు ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్, శివసేన చీఫ్ ఏక్ నాథ్ షిండే హాజరయ్యారు. మహారాష్ట్రలో బీజేపీ, శివసేన, ఎన్సీపీ ఆధ్వర్యంలోని మహాయుతి కూటమి రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ నెల 5న ఫడ్నవీస్ సీఎంగా, అజిత్ పవార్, షిండే డిప్యూటీ సీఎంలుగా ప్రమాణం చేశారు. అసెంబ్లీలోని సీట్ల సంఖ్యను బట్టి రాష్ట్ర కేబినెట్‎లో సీఎం సహా గరిష్టంగా 43 మంది మంత్రులు ఉండవచ్చు. 

ఫడ్నవీస్, అజిత్ పవార్, షిండే ఇదివరకే ప్రమాణం చేయగా.. తాజాగా మరో 39 మంది మంత్రివర్గంలో చేరారు. దీంతో కేబినెట్‎లో మొత్తం మంత్రుల సంఖ్య 42కు చేరగా.. మరో బెర్తు మాత్రమే ఖాళీగా ఉంది. కేబినెట్ విస్తరణలో బీజేపీకి19, శివసేనకు 11, ఎన్సీపీకి 9 బెర్తులు దక్కాయి. మొత్తం 33మంది కేబినెట్ మినిస్టర్లుగా, ఆరుగురు సహాయ మంత్రులుగా ప్రమాణం చేశారు. కాగా, మహారాష్ట్ర అసెంబ్లీ వింటర్ సెషన్ ఈ నెల 16 నుంచి 21 వరకు నాగ్​పూర్‎లో జరగనుంది. మరోవైపు, కేబినెట్‎లో బెర్త్ దక్కకపోవడంతో శివసేన (షిండే) ఎమ్మెల్యే నరేశ్​భోండేకర్ పార్టీకి రాజీనామా చేశారు. ఎన్నికల సమయంలో మంత్రి పదవి ఇస్తానని షిండే హామీ ఇచ్చారని, ఇప్పుడు నిలబెట్టుకోక పోవడంవల్లే రాజీనామా చేస్తున్నట్లు భోండేకర్ చెప్పారు.