ముంబై: మహారాష్ట్ర కేబినెట్ విస్తరణపై నెలకొన్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. మంత్రి పదవుల పంపకాలపై నెలకొన్న చిక్కుముడి వీడటంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన 10 రోజుల తర్వాత ఆదివారం (డిసెంబర్ 15) మహారాష్ట్ర కేబినెట్ విస్తరణ జరిగింది. మహాయుతి కూటమిలోని బీజేపీకి 19, శివసేన (షిండే) 12, ఎన్సీపీ (అజిత్)కి 9 మంత్రి పదవులు దక్కాయి. నాగ్‌పూర్‌లోని రాజ్‌భవన్‌లో కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారోత్స కార్యక్రమం జరిగింది. మహారాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ కేబినెట్ మంత్రుల చేత ప్రమాణం స్వీకారం చేయించారు.
దత్తాత్రే విఠోబా భర్నే, ఆశిష్ షెలార్, శివసేన ఎమ్మెల్యే శంభురాజ్ దేశాయ్, అశోక్ ఉయికే, అతుల్ సేవ్, పంకజా ముండే, జైకుమార్ రావల్, ఉదయ్ సమంత్, మంగళ్ ప్రభాత్ లోధా, ధనంజయ్ ముండే, సంజయ్ రాథోడ్, దాదా భూసే, గణేష్ నాయక్, గులాబ్రావ్ పాటిల్, గిరీష్ మహాజన్, చంద్రకాంత్ పాటిల్, హసన్ ముష్రీఫ్, రాధాకృష్ణ విఖే పాటిల్, చంద్రశేఖర్ బవాన్‌కులే, జయకుమార్ రావల్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. మంత్రుల ప్రమాణ స్వీకారోత్స కార్యక్రమానికి సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, డిప్యూటీ సీఎంలు అజిత్ పవార్, ఏక్ నాథ్, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ హాజరయ్యారు.
ALSO READ | జమిలీపై పీఛేముడ్.?.. బిల్లులపై వెనక్కి తగ్గిన ఎన్డీయే సర్కార్
కాగా, 2024, నవంబర్‌లో జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేృత్వత్వంలోని మహాయుతి కూటమి ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. 288 సీట్లకు గానూ 230 స్థానాల్లో మహాయుతి కూటమి గెలుపొంది అధికారాన్ని నిలబెట్టుకుంది. కూటమి విజయంతో సీఎం పదవి కోసం మహాయుతి కూటమిలో భారీగా పోటీ నెలకొంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి కుర్చీ కోసం దేవేంద్ర ఫడ్నవీస్, ఏక్ నాథ్ షిండే పోటీ పడ్డారు.
కూటమి సమీకరణాల్లో భాగంగా సీఎం పోస్ట్ చివరకు దేవేంద్ర ఫడ్నవీస్ కు దక్కగా.. ఏక్ నాథ్ షిండే, అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రులుగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం మంత్రి పదవుల పంకాలపై కూటమి నేతలు లోతుగా చర్చలు జరిపి ఏకాభిప్రాయానికి వచ్చారు. దీంతో కేబినెట్ విస్తరణ కొలిక్కి వచ్చింది. బీజేపీకి 19, శివసేన (షిండే) 12, ఎన్సీపీ (అజిత్)కి 9 మంత్రి పదవులు కేటాయించారు. మహారాష్ట్ర కేబినెట్లో సీఎంతో కలిపి మొత్తం 44 పదవులు ఉండగా.. 40 స్థానాలను భర్తీ చేసి.. మరో 4 ఫోర్ట్ ఫోలియోలను పెండింగ్‌లో ఉంచారు.