‘సావర్కర్ గౌరవ్ యాత్ర’లో మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే
థానె(మహారాష్ట్ర) : ఫ్రీడం ఫైటర్ వీడీ సావర్కర్‌ను కొందరు అవమానిస్తున్నారని, ఇది మంచి పద్ధతి కాదని మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే అన్నారు. సావర్కర్‌ను ఉద్దేశిస్తూ రాహుల్ చేసిన కామెంట్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సావర్కర్‌ను కించపర్చేలా మాట్లాడం అంటే.. ప్రతీ ఇండియన్‌ను, దేశాన్ని అవమానించినట్టే అని ఫైర్ అయ్యారు. షిండే హోంటౌన్ థానెలో ఆదివారం ‘సావర్కర్ గౌరవ్ యాత్ర’ ప్రారంభించారు. దీనికి ముందు సిటీలోని రామ్ గణేష్ గడ్కరి రంగయతన్ ఆడిటోరియంలో సావర్కర్ ఫొటోకు పూలమాల వేసి నివాళులర్పించారు. తర్వాత యాత్రలో షిండే మాట్లాడారు. మహారాష్ట్రలోని ప్రతీ జిల్లాలో ‘సావర్కర్ గౌరవ్ యాత్ర’ నిర్వహిస్తామన్నారు. ‘‘కొందరు వీడీ సావర్కర్‌ను అవమానిస్తున్నారు. వారిపై ప్రజలు కోపంగా ఉన్నారు. సావర్కర్‌ను విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు. రాహుల్ గాంధీ లాంటి వ్యక్తులు సావర్కర్‌ను ఉద్దేశిస్తూ చేసిన కామెంట్లను తీవ్రంగా ఖండిస్తున్నాం” అన్నారు.
ఉద్ధవ్ ఠాక్రేపై విమర్శలు
‘‘మణిశంకర్ అయ్యర్ ఒకప్పుడు సావర్కర్‌ను అవమానించారు. అప్పుడు బాలా సాహెబ్ ఠాక్రేకు కోపం వచ్చింది. అయ్యర్ దిష్టిబొమ్మపై ఆయన కొట్టారు. కానీ, ఇప్పుడు సావర్కర్‌ను అవమానించిన వారితోనే బాలాసాహెబ్ ఠాక్రే వారసత్వం తిరుగుతున్నది” అని ఉద్ధవ్ ఠాక్రేను ఉద్దేశిస్తూ షిండే పరోక్షంగా విమర్శించారు. హిందుత్వం ఏ మతానికి వ్యతిరేకం కాదని, కొందరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారని అన్నారు. ముంబైలోని మరికొన్ని ప్రాంతాల్లోనూ సావర్కర్ గౌరవ్ యాత్ర నిర్వహించారు.