
కోప్రీ పాచ్పాఖాడీ నుంచి అసెంబ్లీకి పోటీ
నామినేషన్‌కు ఇయ్యాల్నే ఆఖరు
థాణె: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు వివిధ పార్టీల ప్రముఖ నేతలు సోమవారం నామినేషన్ వేశారు. నామినేషన్‌కు మంగళవారం చివరి రోజు కావడంతో అభ్యర్థులు తమ కార్యకర్తలు, అభిమానులతో కలిసి ఉత్సాహంగా నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. వచ్చే నెల 20న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం సీఎం ఏక్ నాథ్ షిండే, డిప్యూటీ సీఎం అజిత్ పవార్ సోమవారం నామినేషన్ వేశారు. థాణె జిల్లాలోని కోప్రీ పాచ్ పాఖాడీ నుంచి సీఎం షిండే తన కుటుంబ సభ్యులతో కలిసి నామినేషన్ దాఖలు చేయగా.. పుణె జిల్లాలోని బారామతి నుంచి అజిత్ పవార్ నామినేషన్ వేశారు. నామినేషన్ వేసే ముందు షిండే తన రాజకీయ గురువు దివంగత ఆనంద్ దిఘేకు ఆనంద్ ఆశ్రమంలో నివాళి అర్పించారు.
అలాగే, సంత్ ఏక్ నాథ్ యోగిరాజ్ మమరాజ్ గోస్వామి ఆశీస్సులు కూడా తీసుకున్నారు. అనంతరం తన అభిమానులు, పార్టీ కార్యకర్తల మధ్య ఆయన భారీ రోడ్ షో నిర్వహించారు. కార్యకర్తలు, నేతలు నినాదాలు చేస్తూ ర్యాలీలో పాల్గొన్నారు. శివసేన, ఎన్సీపీ నేతలతో పాటు కేంద్ర మంత్రి రామ్ దాస్ అథవాలే కూడా ర్యాలీలో పాల్గొన్నారు. దత్త మందిర్ నుంచి ప్రారంభమైన ర్యాలీ థాణె వీధుల గుండా సాగింది. మధ్యాహ్నం 1.30 గంటలకు షిండే తన నామినేషన్ పత్రాలను సమర్పించారు. అనంతరం మీడియాతో సీఎం షిండే మాట్లాడారు. వికాసానికి, వినాశనానికి మధ్య జరుగుతున్న ఈ ఎన్నికల్లో మహాయుతి కూటమే విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
బారామతి నుంచి అజిత్ పవార్..
డిప్యూటీ సీఎం, ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్.. బారామతి నుంచి నామినేషన్ వేశారు. కుటుంబ సభ్యులతో కలిసి నామినేషన్ పేపర్లను సమర్పించారు. అజిత్ పై శరద్ పవార్ మనుమడు, ఎన్సీపీ–ఎస్పీ అభ్యర్థి యుగేంద్ర పవార్ పోటీచేస్తున్నారు. అలాగే.. యుగేంద్ర పవార్, మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నేత విజయ్ వాడెట్టివర్ (బ్రహ్మపురి నుంచి), కాంగ్రెస్ అభ్యర్థి పృథ్వీరాజ్ చవాన్ (కారాడ్ సౌత్), ఎన్సీపీ–ఎస్పీ లీడర్ రోహిత్ పవార్ (కర్జాత్ జాంఖేడ్), బీజేపీ అభ్యర్థి నితీశ్ రాణె (కంకావళి) కూడా నామినేషన్ వేశారు.