కాంగ్రెస్ మహారాష్ట్ర ఎన్నికల ఇన్‌చార్జ్ రమేశ్ చెన్నితాల
మహాయుతిలోనే గందరగోళం
తన మిత్రపక్షాలపైనే బీజేపీ పోటీ చేస్తున్నదని విమర్శ
ముంబై: వచ్చే నెలలో జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కోసం మహా వికాస్ అఘాడి ( ఎంవీఏ) కూటమి మొత్తం 288 స్థానాల్లో నామినేషన్లు వేసినట్లు కాంగ్రెస్ వెల్లడించింది. సీట్ల సర్దుబాటుపై తమ కూటమిలో ఎలాంటి గందరగోళం నెలకొనలేదని స్పష్టం చేసింది.
ఈ మేరకు బుధవారం నానా పటోలే (స్టేట్ కాంగ్రెస్ చీఫ్), పార్టీ సీనియర్ నేతలు వర్షా గైక్వాడ్, నసీమ్ ఖాన్‌లతో కలిసి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ఇన్‌చార్జ్ రమేశ్ చెన్నితాల మీడియాతో మాట్లాడారు.
మహా వికాస్ అఘాడీలో ఎలాంటి విభేదాల్లేవని.. కూటమిలోని పార్టీలు సీట్ల పంపకంపై సంతృప్తికరంగా ఉన్నాయని తెలిపారు. రాష్ట్రంలోని 288 స్థానాల్లో తమ కూటమి నామినేషన్స్ దాఖలు చేసిందని వెల్లడించారు.
"ఎంవీఏలో కాంగ్రెస్, శివసేన(ఉద్ధవ్ ఠాక్రే వర్గం), నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(శరద్ పవార్), సమాజ్‌వాదీ పార్టీలు ఉన్నాయి. మా నేతల మధ్య భేదాభిప్రాయాలు నిజమే. కానీ, మా పార్టీల మధ్య ఎటువంటి గందరగోళం లేదు.
ఎంవీఏలో అన్ని పార్టీలు సమానమే. సీట్ల సర్దుబాటులో అందరికీ సమానమైన గౌరవం ఇచ్చాం. మేం ఏ నియోజకవర్గంలోనూ ఫ్రెండ్లీ ఫైట్ కూడా చేయటం లేదు. ఒకరికొకరం పూర్తి మద్దతుగా ఉన్నాం. హర్యానాలో జరిగిన పొరపాట్లు ఇక్కడ జరగనివ్వం" అని రమేశ్ చెన్నితాల వెల్లడించారు.
మహాయుతిలో బీజేపీదే పైచేయి
మహాయుతి కూటమిలో బీజేపీదే పైచేయిగా ఉందని రమేశ్ చెన్నితాల విమర్శించారు. ఆ పార్టీ కూటమిలోని మిగతా పార్టీలపై పెత్తనం చెలాయిస్తున్నదని తెలిపారు. "మహాయుతి కూటమిలో బీజేపీ, శివసేన(షిండే), ఎన్‌సీపీ( అజిత్ పవార్) పార్టీలు ఉన్నాయి.
ఈ పార్టీల మధ్య చాలా విభేదాలు ఉన్నాయి.బీజేపీ తన మిత్రపక్షాల నుంచి సీట్లు లాక్కోవాలని ప్రయత్నిస్తున్నది. తద్వారా ఆ పార్టీలకు రాష్ట్రంలో ఉనికి లేకుండా చేయాలని భావిస్తున్నది. శివసేన(షిండే), ఎన్‌సీపీ(అజిత్ పవార్) పోటీ చేసే చోట బీజేపీ కూడా తన అభ్యర్థులను బరిలోకి దింపడమే అందుకు నిదర్శనం" అని రమేశ్ చెన్నితాల పేర్కొన్నారు.
ఎవరికి ఎన్ని సీట్లంటే..!
ఎంవీఏ విషయానికొస్తే కాంగ్రెస్ 103 మంది అభ్యర్థులను ప్రకటించింది. శివసేన(ఠాక్రే), ఎన్సీపీ(శరద్ పవార్) పార్టీలు 87 మంది చొప్పున అభ్యర్థులను ప్రకటించాయి. మిగిలిన 11 సీట్లలో కొన్ని చిన్న మిత్రపక్షాలతో పాటు సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థులను నిలబెట్టారు. ఇక మహాయుతి కూటమిలో.. బీజేపీ 152 మంది అభ్యర్థులను ప్రకటించింది.
ఎన్సీపీ(అజిత్ పవార్ )52, శివసేన(షిండే) 80స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించాయి. మిగిలిన 4 స్థానాల్లో బీజేపీ, శివసేనల నుంచి అభ్యర్థుల మధ్య ఫ్రెండ్లీ ఫైట్ కొనసాగనుంది.