ముంబై: సరిగ్గా ఐదేండ్ల క్రితం మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. బీజేపీ–శివసేన కూటమి అధికారంలోకి వచ్చింది. అప్పటికే సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ అసెంబ్లీలో ప్రమాణం చేశారు. అయితే, ముఖ్యమంత్రి పదవి విషయంలో బీజేపీ, శివసేన మధ్య విభేదాలు రావడంతో ఎన్డీఏ కూటమి నుంచి ఉద్ధవ్ థాక్రే నేతృత్వంలోని శివసేన బయటకు వచ్చింది. కాంగ్రెస్, ఎన్సీపీతో చేతులు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
దీంతో దేవేంద్ర దిగిపోవాల్సి వచ్చింది. ఆ సమయంలో అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ ‘‘వెనక్కి తగ్గానని అనుకోవద్దు. నేను సముద్రం లాంటి వాడిని. నీళ్లు తగ్గాయని తీరంలో ఇల్లు కడితే, కొట్టుకుపోతుంది. ఇప్పుడు సీఎంగా నేను దిగిపోతున్నా. మళ్లీ వస్తా” అని వ్యాఖ్యానించారు. సరిగ్గా రెండున్నరేండ్ల తర్వాత మహావికాస్ అఘాడీ ప్రభుత్వం పడిపోయింది. బీజేపీ, ఏక్ నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ కూటమిగా ఏర్పడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి.
తాజా అసెంబ్లీ ఎన్నికల్లోనూ మహాయుతి కూటమి అఖండ విజయం సాధించింది. 2019లో అసెంబ్లీలో దేవేంద్ర మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్ గా మారాయి. నాడు ఆయన చేసిన వ్యాఖ్యలను పలువురు ప్రస్తావిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ‘‘మనమంతా ఒక్కటి గా ఉంటే, సేఫ్ గా ఉంటాం. మోదీ ఉంటే సాధ్యమే. రెండు పార్టీల నడ్డి విరిచి వచ్చాను” అని దేవేంద్ర ‘ఎక్స్’ లో ట్వీట్ చేశారు.