
- డిప్యూటీ సీఎం పదవి నుంచి తప్పించాలని పార్టీకి రిక్వెస్ట్!
ముంబై: మహారాష్ట్రలో బీజేపీ లోక్సభ స్థానాల సంఖ్య 23 నుంచి 9కి పడిపోవడంతో.. దానికి బాధ్యత వహిస్తూ ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తన పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు. అలాగే, త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పార్టీ కార్యక్రమాలపై దృష్టి పెట్టడానికి తనకు అవకాశం ఇవ్వాలని ఆయన పార్టీ అధిష్టానాన్ని కలవనున్నట్టు చెప్పారు.
ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో మహారాష్ట్రలోని 48 ఎంపీ సీట్లలో మహాయుతి కూటమి 17 స్థానాలు (బీజేపీ–9, శివసేన (ఏక్నాథ్ షిండే వర్గం–7), ఎన్సీపీ (అజిత్ పవార్ వర్గం–1) గెలుచుకోగా.. మహా వికాస్ అఘాడీ 30 సీట్లు (కాంగ్రెస్–13, శివసేన (యూబీటీ వర్గం)–9, ఎన్సీపీ (శరద్పవార్)–8 సీట్లు సాధించింది. అయితే, బీజేపీ ఫలితాలకు పూర్తి బాధ్యత తనదేనని, ఎక్కడో పొరపాటు జరిగిందని తాను అంగీకరిస్తున్నానని ఫడ్నవీస్ తెలిపారు.
ఈ లోపాన్ని అధిగమించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తానని.. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ కోసం పూర్తి సమయం పనిచేసేందుకు తనను ప్రభుత్వ బాధ్యతల నుంచి తప్పించాలని పార్టీ నాయకత్వాన్ని అభ్యర్థిస్తున్నానని బుధవారం ఆయన మీడియాకు తెలిపారు. త్వరలో బీజేపీ సీనియర్ నేతలను కలుస్తానని, వారు ఏం చెప్తే అది చేస్తానని ఆయన తెలిపారు. కాగా, మహారాష్ట్రలో మరో ఆరు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.