మహారాష్ట్రలో కమలం .. జార్ఖండ్​లో జేఎంఎం

మహారాష్ట్రలో కమలం .. జార్ఖండ్​లో జేఎంఎం
  • అధికార పార్టీలకే మళ్లీ పట్టం
  • ‘మహా’ పోరులో 235 సీట్లు మహాయుతి కూటమివే.. 
  • అందులో బీజేపీకే 132 స్థానాలు.. 90%  స్ట్రైక్​ రేట్​తో రికార్డ్​
  • ఉద్దవ్​ సేనను దెబ్బకొట్టిన షిండే సేన..  శరద్​ పవార్​కు అజిత్​ పవార్​ షాక్​
  • 49 సీట్లకే ఎంవీఏ పరిమితం.. అందులో ఏ పార్టీకీ దక్కని ప్రతిపక్ష హోదా!
  • జార్ఖండ్​లో జేఎంఎం దూకుడు.. కాంగ్రెస్​తో కలిసి మళ్లీ పవర్​లోకి..
  • 14 రాష్ట్రాల అసెంబ్లీ ఉప ఎన్నికల్లోనూ అధికార పార్టీలదే పైచేయి

న్యూఢిల్లీ: రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పార్టీలకే జనం మళ్లీ జైకొట్టారు. మహారాష్ట్రలో బీజేపీ నేతృత్వంలోని మహాయుతికి.. జార్ఖండ్​లో జేఎంఎం ఆధ్వర్యంలోని ఇండియా కూటమికి ఓటర్లు పట్టం కట్టారు. దేశంలో అత్యధిక జనాభా కలిగిన రెండో రాష్ట్రం మహారాష్ట్రలో బీజేపీ ఏకంగా 132 సీట్లు కైవసం చేసుకుంది. ఇక్కడ మొత్తం 288 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. బీజేపీ 149 చోట్ల పోటీ చేసి అందులో దాదాపు 90 శాతం సీట్లను గెలుచుకొని రికార్డు సృష్టించింది. 

కమలం పార్టీ నేతృత్వంలోని మహాయుతి కూటమి మ్యాజిక్​ ఫిగర్​ (145)ను దాటి 235 చోట్ల జయకేతనం ఎగుర వేసింది. కాంగ్రెస్​ నేతృత్వంలోని మహావికాస్​ అఘాడి చతికిలపడింది. ఆ కూటమిలోని ఏ పార్టీ కూడా ప్రతిపక్ష హోదాకు సరిపోయే సీట్లను సాధించలేకపోయింది. ఇక, జార్ఖండ్​లో మొత్తం 81 సీట్లు ఉండగా.. జేఎంఎం, కాంగ్రెస్  పార్టీల ‘ఇండియా’ కూటమి మ్యాజిక్​ ఫిగర్​(41)ను దాటి  56 చోట్ల విజయం సాధించింది. 

అక్కడ బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీయే కూటమి 24 సీట్లతో సరిపెట్టుకుంది. మహారాష్ట్ర, జార్ఖండ్​రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతోపాటు మహారాష్ట్రలోని నాందేడ్, కేరళలోని వయనాడ్​ లోక్​సభ స్థానాలకు.. 14 రాష్ట్రాల్లోని 48 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగగా ఫలితాలు శనివారం వెలువడ్డాయి.

వయనాడ్​లో కాంగ్రెస్​ ఉపాధ్యక్షురాలు ప్రియాంక గాంధీ భారీ మెజార్టీతో గెలిచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి గ్రాండ్​ ఎంట్రీ ఇచ్చారు. నాందేడ్​ స్థానాన్ని కాంగ్రెస్​ కైవసం చేసుకుంది. అసెంబ్లీ సీట్లకు బైపోల్స్​ జరిగిన రాష్ట్రాల్లో అక్కడి అధికార పార్టీల జోరు కనిపించింది. 

ఉద్దవ్​కు షిండే షాక్​

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఉద్దవ్​ సేన, షిండే సేన హాట్​ టాపిక్​. తనదే రియల్ శివసేన పార్టీ అని, ఏక్​నాథ్​ షిండే శివసేన పార్టీ ‘ఫేక్​ సంతానం’ అంటూ జనంలోకి వెళ్లిన ఉద్దవ్​ థాక్రేకు పరాభవం ఎదురైంది. కాంగ్రెస్​, శరద్​పవార్​ ఎన్సీపీ, ఎస్పీతో కలిసి ‘మహావికాస్​ అఘాడి’గా బరిలోకి దిగిన ఉద్దవ్​ థాక్రే పార్టీ ఎస్​హెచ్​ఎస్​ (యూబీటీ)కు నిరాశే మిగిలింది. 95 చోట్ల ఎస్​హెచ్​ఎస్​ (యూబీటీ) పోటీ చేస్తే.. 20 స్థానాల్లోనే గెలిచింది. అదే ఏక్​నాథ్​ షిండే పార్టీ ఎస్​హెచ్​ఎస్​  మాత్రం 81 చోట్ల పోటీ చేసి  57 స్థానాలు గెలుచుకుంది. పైగా ప్రస్తుత సీఎం ఏక్​ నాథ్​ షిండే ఏకంగా ఎస్​హెచ్​ఎస్​ (యూబీటీ) అభ్యర్థిపై భారీ విజయం సాధించారు.

అజిత్​ పవార్​ విషయంలోనూ శరద్​ పవార్​కు ఉద్దవ్​ థాక్రే పరిస్థితే ఎదురైంది. అజిత్​ పవార్​ ఎన్సీపీ 41 స్థానాల్లో గెలువగా.. శరద్​ పవార్​ ఎన్సీపీ పది చోట్ల మాత్రమే గెలిచింది. మొత్తంగా మహారాష్ట్రలో బీజేపీ, షిండే శివసేన, అజిత్​ పవార్​ ఎన్సీపీ, మరో ఐదు ఇతర పార్టీలతో కూడిన ‘మహాయుతి’ కూటమి మరోసారి అధికారపగ్గాలు చేపట్టేందుకు రెడీ అయింది. 

ఇటీవల జరిగిన హర్యానా ఎన్నికల్లో హ్యాట్రిక్​ విజయం సొంతం చేసుకున్న బీజేపీకి ఇప్పుడు మహారాష్ట్ర ఫలితాలు మరింత బూస్టప్​ ఇచ్చాయి. ‘మహావికాస్​ అఘాడీ (ఎంవీఏ)’ కూటమి కనీస పోటీ ఇవ్వలేకపోయింది. కేవలం 49 స్థానాల వద్దే అఘాడీ గాడి ఆగిపోయింది. ఎంవీఏలోని కాంగ్రెస్​ పార్టీ 16 చోట్ల, ఎస్పీ 2 చోట్ల విజయం సాధించాయి. ఇక..  మాలేగావ్​ సెంట్రల్​ స్థానాన్ని  ఎంఐఎం కైవసం చేసుకుంది. 

జార్ఖండ్​లో జేఎంఎందే హవా

ఎగ్జిట్​ పోల్స్​ అంచనాలను తారుమారు చేస్తూ జార్ఖండ్​లో జేఎంఎం, కాంగ్రెస్​ కూటమి(ఇండియా) భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక్కడ ఎన్డీయే, ఇండియా కూటముల నడుమ నెక్ట్​కు నెక్​ ఫైట్​ ఉంటుందని ఎగ్జిట్​ పోల్స్​ భావించగా.. ఇండియా కూటమి 56 స్థానాలు గెలుచుకుంది.

ఇండియా కూటమిలోని జేఎంఎం 34 , కాంగ్రెస్​ 16, ఆర్జేడీ 4, సీపీఐ (ఎంఎల్​) (ఎల్​) 2 సీట్లు గెలుచుకున్నాయి. ఎన్డీయే కూటమిలోని బీజేపీ 21, జేడీయూ  1, ఎల్జేపీఆర్వీ 1, ఏజేఎస్​యూపీ 1 చొప్పున స్థానాలను సాధించాయి. మొత్తంగా ఎన్డీయే కూటమి 24 సీట్లకు పరిమితమైంది.