ఇవాళ( నవంబర్ 23) మహారాష్ట్ర ఎన్నికల రిజల్ట్​

ఇవాళ( నవంబర్ 23) మహారాష్ట్ర ఎన్నికల రిజల్ట్​
  • జార్ఖండ్ ఫలితాలు కూడా..ఫలితాలకు ముందే మహారాష్ట్రలో కుర్చీ కోసం లొల్లి
  • ఎంవీఏ, ఎన్డీయే.. రెండింట్లోనూ ఇదే పంచాది
  • ‘మహా’ సీఎం ఎవరనేదానిపై పెరిగిన ఉత్కంఠ
  • కూటములలో సీఎంగా తెరపైకి పలువురి పేర్లు
  • తమ నేతే సీఎం అంటూ కిందిస్థాయి లీడర్ల ప్రచారం
  • సీఎం అజిత్ పవార్ అంటూ వెలిసిన పోస్టర్లు
  • వయనాడ్​లో తేలనున్న ప్రియాంక భవితవ్యం


ముంబై: దేశం యావత్తు ఆసక్తిగా ఎదురుచూస్తున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితం నేడే తేలనున్నది. మహా పీఠాన్ని అధిరోహించేది మాహాయుతి సర్కారా? లేదా మహా వికాస్​ అగాఢీ (ఎంవీఏ)నా? అనే ఉత్కంఠ వీడనున్నది. శనివారం సాయంత్రంలోగా ఫలితాలు వెలవడనుండగా.. సీఎం ఎవరనేదానిపై సస్పెన్స్​ నెలకొన్నది. ఎన్నికల ముందునుంచి రెండు కూటములు కూడా సీఎం అభ్యర్థిని ప్రకటించలేదు.

 తమ కూటమి గెలిస్తే తమ పార్టీ నేతే సీఎం అంటూ రెండు కూటముల్లోని పార్టీల నాయకులు పలు పేర్లను తెరపైకి తీసుకొచ్చారు. కొన్నిచోట్ల వారిపేర్లతో ఫ్లెక్సీలను కూడా ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర పగ్గాలు చేపట్టబోయేది ఎవరనేదానిపై  సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. 288 స్థానాలున్న మహారాష్ట్ర అసెంబ్లీకి గత బుధవారం సాయంత్రం ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. 

గత ఎన్నికల కంటే ఈ సారి ఎక్కువగా 65 శాతం పోలింగ్​ నమోదైంది. శనివారం ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు  ఎన్నికల అధికారులు తెలిపారు. కాగా, బుధవారం సాయంత్రం పోలింగ్​ ముగిసిన తర్వాత వెలువడిన ఎగ్జిట్​ పోల్స్​ అన్నీ  బీజేపీ, శివసేన (షిండే), ఎన్సీపీ (అజిత్​పవార్​) తో కూడిని మహాయుతి కూటమికే మళ్లీ అధికారం దక్కుతుందని పేర్కొన్నాయి. 

మరోవైపు హర్యానాలో ఎగ్జిట్​పోల్స్​ ఫలితాలు తలకిందులైనట్టు ఇక్కడకూడా జరుగుతాయని, తమ కూటమే అధికారం చేపడుతుందని ఎంవీఏ ధీమా వ్యక్తం చేస్తున్నది.  అయితే, ఫలితాల ముందే అటు మహాయుతితోపాటు ఇటు ఎంవీఏలోనూ సీఎం అభ్యర్థి ఎవరనే చర్చ ఆసక్తికరంగా మారింది. 

నానా పటోలే ప్రకటనతో ఎంవీఏలో లుకలుకలు

బుధవారం పోలింగ్​ముగిసిన వెంటనే మహారాష్ట్ర కాంగ్రెస్​ చీఫ్​ నానా పటోలే మీడియాతో మాట్లాడారు. ఎంవీఏ కూటమిలోని కాంగ్రెస్​ అత్యధిక స్థానాలు గెలుచుకుంటుందని ట్రెండ్స్​ సూచిస్తున్నాయని అన్నారు. కాంగ్రెస్​ నాయకత్వంలోనే ఎంవీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. 

అలాగే, పటోలే సీఎం అవుతారని ఏఐసీసీ చీఫ్​ మల్లికార్జున ఖర్గే, అగ్రనేతలు రాహుల్​గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంకా గాంధీ ప్రకటించారని ఆ పార్టీ రాజ్యసభ ఎంపీ సంజయ్​ రౌత్​ అన్నారు. 

 ఈ ప్రకటనతో ఎంవీఏలో లుకలుకలు బయటపడ్డాయి. నానా పటోలే, సంజయ్​ రౌత్​ వ్యాఖ్యలను శివసేన (యూబీటీ​) ఖండించింది. ఎన్నికల్లో ఎంవీఏకు మెజార్టీ వస్తే కూటమిలోని పార్టీలన్నీ సంయుక్తంగా చర్చించి, సీఎం ఎవరనేదానిపై ఓ నిర్ణయానికి వస్తామని తెలిపింది. 

మహాయుతిలోనూ సీఎం పోరు

రిజల్ట్స్ రాకముందే మహాయుతి కూటమిలోనూ సీఎం పోరు నెలకొన్నది. తమ పార్టీ నేతే సీఎం అంటూ కూటమిలోని అన్ని పార్టీలు ఎవరికి వారే ధీమా వ్యక్తం చేస్తున్నాయి. కూటమిలోని శివసేన (షిండే) అధికార ప్రతినిధి సంజయ్​ షిర్సత్​ మాట్లాడుతూ.. ఏక్​నాథ్​ షిండే సీఎం అనే నినాదంతోనే ఎన్నికలను ఎదుర్కొన్నట్టు చెప్పారు.

 షిండేను చూసే మహారాష్ట్ర ప్రజలు మహాయుతి  కూటమికి ఓట్లేశారని అన్నారు. మహారాష్ట్రకు మళ్లీ  షిండే సీఎం అవుతారని తాను విశ్వసిస్తున్నట్టు చెప్పారు.  ఇదిలా ఉండగా.. డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్​సీఎం అవుతారని బీజేపీ నేత ప్రవీణ్​ దారేకర్​ అన్నారు. బీజేపీ నుంచి ఎవరైనా సీఎం పదవి చేపట్టాల్సి వస్తే అది దేవేంద్ర ఫడ్నవీసేనని స్పష్టం చేశారు. 

మరోవైపు ఎన్సీపీ చీఫ్​, డిప్యూటీ సీఎం అజిత్​ పవార్​ పేరును ఆ పార్టీ నేత అమోల్​ మిట్కారీ సీఎం రేసులోకి తీసుకొచ్చారు. రిజల్ట్స్​ ఎలా ఉన్నా.. ఈ ఎన్నికల్లో ఎన్సీపీ కింగ్​ మేకర్​ అవుతుందని చెప్పారు. కాగా, పుణెలో  డిప్యూటీ సీఎం అజిత్ పవార్‌ నెక్ట్స్ మహారాష్ట్ర సీఎం అంటూ పోస్టర్లు కూడా వెలిశాయి. ఈ పోస్టర్లను ఎన్సీపీ నేత సంతోష్ నంగారే ఏర్పాటు చేయగా.. నిమిషాల్లోనే వైరల్‎గా మారాయి.

 దీంతో మున్సిపల్ అధికారులు వెంటనే ఫ్లెక్సీలను తొలగించారు. కౌంటింగ్ కూడా మొదలు కాకుండానే అధికార మహాయుతి కూటమిలో సీఎం పదవిపై పోటీ నెలకొనడం మహా పాలిటిక్స్‎లో చర్చనీయాంశంగా మారింది. అయితే, కూటమిలోని నేతలమంతా కూర్చొని, సీఎం ఎవరనేది నిర్ణయిస్తామని దేవేంద్ర ఫడ్నవీస్ వెల్లడించారు.