Maharashtra Elections 2024: ఇంపోర్టెడ్ మాల్ అంటూ మహిళా అభ్యర్థిపై అనుచిత వ్యాఖ్యలు.. శివసేన యుబీటీ ఎంపీపై కేసు..

Maharashtra Elections 2024: ఇంపోర్టెడ్ మాల్ అంటూ మహిళా అభ్యర్థిపై అనుచిత వ్యాఖ్యలు.. శివసేన యుబీటీ  ఎంపీపై కేసు..

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో పొలిటికల్ హీట్ పీక్స్ కి చేరింది. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీల నేతలంతా ముమ్మరంగా ప్రచారంలో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో శివసేన యుబీటీ ఎంపీ అరవింద్ సావంత్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన అభ్యర్థి షైన ఎన్‌సిని ఉద్దేశించి ఇంపోర్టెడ్ మాల్ అంటూ వ్యాఖ్యానించారు అరవింద్ సావంత్. 

ఎంపీ అరవింద్ సావంత్‌ వ్యాఖ్యలపై షైన ఎన్‌సీ ఫిర్యాదు చేయడంతో పోలీసులు భారతీయ న్యాయ్ సంహితలోని సెక్షన్‌లు 79, 356(2) ప్రకారం ఆయనపై కేసు నమోదు చేశారు. షైనా ఎన్‌సిని ఉద్దేశించి ఎంపి సావంత్ చేసిన వ్యాఖ్యలు కొత్త వివాదానికి దారి తీశాయి. ముంబాదేవి అసెంబ్లీ నియోజకవర్గం ముంబై దక్షిణ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. ఎంవీయే సిట్టింగ్ ఎమ్మెల్యే కాంగ్రెస్‌కు చెందిన అమీన్ పటేల్‌ను ఈ స్థానం నుండి పోటీకి దింపగా సావంత్ అతని తరఫున ప్రచారంలో పాల్గొన్నారు.

అరవింద్ సావంత్ వ్యాఖ్యలు ఇంటర్నెట్ లో వైరల్ గా మారాయి. "ఇంపోర్టెడ్ మాల్ ఇక్కడ చెల్లదని.. మాదంతా ఒరిజినల్ మాల్ అంటూ సావంత్ షైనాను ఉద్దేశించి వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.షైనా ఎన్‌సి ఈ వ్యాఖ్యలను 'సెక్సిస్ట్ స్లర్' అంటూ అభివర్ణించారు. ఇది అరవింద్ సావంత్, అతని పార్టీ మనస్తత్వాన్ని వెల్లడిస్తుందని ఆమె అన్నారు. ముంబాదేవిలోని ప్రతి మహిళను అతను మాల్ గా చూస్తాడా అంటూ ప్రశ్నించారు షైనా.  అతను మహిళల పట్ల గౌరవం చూపడు, రాజకీయాల్లో సమర్థుడైన మహిళను అభివర్ణించడానికి అలాంటి పదాలను ఉపయోగిస్తాడు. ఇప్పుడు, అతను మహిళను 'మాల్' అని పిలిచే పరిణామాలను ఎదుర్కొంటాడు," అని షైనా స్పందించారు.