మహారాష్ట్ర ఎవరిది?: పోటీలో రెండు కూటములు

మహారాష్ట్రలో  గెలుపుపై  రెండు కూటములు ధీమాతో ఉన్నాయి. చిన్న చిన్న ఇబ్బందులున్నా  మళ్లీ  పవర్ లోకి వచ్చేది తామే అని బీజేపీ– శివసేన అలయన్స్ అంటోంది. అయితే అదంతా ఈజీ కాదంటున్నారు కాంగ్రెస్, ఎన్సీపీ నాయకులు. దేవేంద్ర ఫడ్నవీస్ సర్కార్ పై వ్యతిరేకత తమకు కలిసొస్తుందని భావిస్తున్నారు.  మెట్రో కారిడార్ తమకు ఓట్ల వర్షం కురిపిస్తుందని బీజేపీ – శివసేన లీడర్లు లెక్కలు వేసుకుంటున్నారు.

మహారాష్ట్ర అసెంబ్లీకి సోమవారం  పోలింగ్ జరగబోతోంది. పోలింగ్ కు టైమ్ దగ్గర పడుతున్నకొద్దీ ఎవరు గెలుస్తారన్న దానిపై  రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. బీజేపీ– శివసేన కూటమి మళ్లీ అధికారంలోకి వస్తుందా ? లేక కాంగ్రెస్– ఎన్సీపీ అలయన్స్ పవర్ లోకి వస్తుందా అనే ఊహాగానాలు జోరందుకున్నాయి. ఈ పరిస్థితుల్లో  రెండు కూటముల ప్లస్, మైనస్ పాయింట్లు లేటెస్ట్ గా చర్చకు వస్తున్నాయి. మహారాష్ట్రలో ఈనెల 21న మొత్తం 288 అసెంబ్లీ సెగ్మెంట్లకు పోలింగ్ జరగబోతోంది. 8.9 కోట్ల మందికి పైగా ఓటర్లు ఓటు హక్కు ఉపయోగించుకోబోతున్నారు. వీరికోసం 95 వేలకు పైగా పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు.

మళ్లీ పవర్ పై బీజేపీ-శివసేన కూటమి ధీమా

ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ – శివసేన కూటమి మళ్లీ అధికారంలోకి వస్తామన్న ధీమాతో ఉంది. కిందటిసారి ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేసిన రెండు పార్టీలు ఈసారి అలయన్స్ గా ఏర్పడి బరిలోకి దిగాయి. ‘మహా–యుతి’ అలయన్స్ గా పాపులర్ అయిన బీజేపీ – శివసేన కూటమితో ‘మహా –అగాధి’ గా పిలుస్తున్న  కాంగ్రెస్– ఎన్సీపీ కూటమి ఢీ కొట్టడానికి రెడీ అయింది. రెండు కూటములతో పాటు రాజ్ ఠాక్రే నాయకత్వాన గల మహారాష్ట్ర నవనిర్మాణ సేన ( ఎంఎన్ ఎస్), ప్రకాశ్​ అంబేడ్కర్ నాయకత్వాన గల ‘వంచిత్ బహుజన్ అగాధి’, అసదుద్దీన్ ఒవైసీ పార్టీ ఎంఐఎం కూడా ఎన్నికల బరిలో ఉన్నాయి.  శివసేన యువ లీడర్ ఆదిత్య ఠాక్రే పోటీ చేయడం ఓ స్పెషాలిటీ.

బీజేపీ లోకో…శివసేన లోకో…..

ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ, ప్రతిపక్షాల నుంచి చాలా మంది పెద్ద నాయకులు బీజేపీ లేదా శివసేన లోకి జంపయ్యారు. రాష్ట్రంలోని దాదాపుగా అన్ని నియోజకవర్గాల్లో ఈ జంపింగులు జరిగాయి. ఈ పరిణామం ప్రతిపక్షాల కేడర్ ను కలవరపరుస్తోంది. ఈ ఫిరాయింపుల ప్రభావం, పోలింగ్ రోజు కనిపిస్తుందని చాలా మంది భావిస్తున్నారు. మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో ఇటీవల పెద్ద ఎత్తున వరదలు వచ్చాయి. ఈ వరదలను ప్రభుత్వం హ్యాండిల్ చేసిన తీరు కూడా ఎన్నికల్లో ఒక పాయింట్  అవుతుందంటున్నారు.

ఆరు ప్రధాన రాజకీయ ప్రాంతాలు

కిందటిసారి ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఎన్నికలు భిన్నంగా ఉన్నాయి.2014 ఎన్నికల్లో బీజేపీ, శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ ఈ నాలుగు పార్టీలు విడివిడిగా పోటీ చేశాయి. ఈసారి రెండు అలయన్స్ లుగా ఈ పార్టీలు బరిలో నిలిచాయి.  రాజకీయంగా చూస్తే మహారాష్ట్ర ను ఆరు ప్రధాన ప్రాంతాలుగా విభజించవచ్చు. ఒక్కో ప్రాంతంలో ఒక్కో  విధమైన రాజకీయ పరిస్థితులు నెలకొన్నాయి.

నార్త్​ మహారాష్ట్ర

ఈ రీజియన్​లోని అసెంబ్లీ సెగ్మెంట్లు 36. ఇవి నందూర్​బర్​, ధూలే, జల్​గావ్​, మాలేగావ్, నాసిక్​, ఇగత్​పురి తదితర ప్రాంతాల పరిధిలో ఉన్నాయి. కిందటి (2014) ఎన్నికల్లో బీజేపీ 15 చోట్ల నెగ్గగా దాని మిత్రపక్షం శివసేన 7 స్థానాలను కైవసం చేసుకుంది. కాంగ్రెస్​ ఏడుగురిని, ఎన్​సీపీ ఐదుగురినే గెలిపించుకోగలిగాయి. 2009​తో పోల్చితే హస్తం పార్టీ ఒక సీటును, శరద్​ పవార్​ పార్టీ నాలుగు సెగ్మెంట్లను కోల్పోయాయి.

వెస్ట్​ మహారాష్ట్ర

ఈ ఏరియాలోని మొత్తం శాసన సభ స్థానాల సంఖ్య 66. ఇవి కొల్హాపూర్​, ఇచల్​కరంజి, సంగ్లి, సోలాపూర్, అహ్మద్​నగర్​ తదితర ప్రాంతాల పరిధిలో విస్తరించి ఉన్నాయి. ఈ రీజియన్​లో 2014 ఎలక్షన్​లో బీజేపీ ఎక్కువ సీట్లు సాధించింది. ఆ పార్టీ ఖాతాలోకి ఏకంగా 22 నియోజకవర్గాలు చేరాయి. ఈ ఎఫెక్ట్​ ఎన్​సీపీపైనే బాగా పడింది. ఆ పార్టీ బలం 18కే పరిమితమైంది. శివసేన 12, కాంగ్రెస్​ పది సీట్లు సొంతం చేసుకున్నాయి.

కొంకణ్

ఈ రీజియన్​లోని సీట్లు 18. బీజేపీది పోయినసారి 3 చోట్లే పైచేయి అయింది. కాంగ్రెస్​ 4, ఎన్​సీపీ 1 స్థానంలో విజయం సాధించాయి. ఈ మూడు పార్టీలతో పోల్చితే ఇక్కడ శివసేన ప్రతాం చూపింది. 8 నియోజకవర్గాల్లో తన అభ్యర్థులను గెలుపు బాట పట్టించింది. ఈ ప్రాంతం ఎప్పటినుంచో ఆ పార్టీకి పెట్టని కోట. మిగిలిన రెండు సెగ్మెంట్లను ‘పీజంట్​ అండ్ వర్కర్స్​ పార్టీ ఆఫ్​ ఇండియా’ క్యాండిడేట్లు దక్కించుకున్నారు.

ముంబై–థానే

ఈ సిటీల్లోని నియోజకవర్గాలు 60. ఇవి శివసేనకి పూర్తిగా పట్టున్న నగరాలు. ఆ పార్టీతో పొత్తు బీజేపీకి కలిసొచ్చింది. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్​, ఎన్​సీపీ పాపులారిటీ కోల్పోగా బీజేపీకి ప్లస్​ అయింది. ఆ పార్టీ 24 సీట్లను హస్తగతం చేసుకుంది. శివసేన కూడా 21 చోట్ల సక్సెస్​ సాధించింది.

విదర్భ

ఈ ఏరియా నాగ్​పూర్​ చుట్టుపక్కల ఉంటుంది. ఇక్కడి మొత్తం సీట్లు 60. ఇది బీజేపీకి కంచుకోట. 2014లో ఆ పార్టీ ఏకంగా 42 చోట్ల గెలిచి తనేంటో నిరూపించుకుంది. శివసేనతో పొత్తు లేకుండానే ఇన్ని సీట్లు కైవసం చేసుకోవటం విశేషం. శివసేన నాలుగు చోట్లే నెగ్గింది. కాంగ్రెస్​ పది సెగ్మెంట్లలో, ఎన్​సీపీ ఒక నియోజకవర్గంలో మాత్రమే విజయం సాధించాయి.

మరాఠ్వాడా

ఈ రీజియన్​ని షుగర్​ బెల్ట్​గా చెప్పుకుంటారు. దేశంలోనే అతి కరువు ప్రాంతం ఇదే. ఇక్కడ 48 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. పోయినసారి బీజేపీ 16 స్థానాల్లో, శివసేన 11 చోట్ల గెలిచాయి. కాంగ్రెస్​, ఎన్​సీపీ తొమ్మిది చొప్పున కైవసం చేసుకున్నాయి. మూడు చోట్ల ఇతరులు విజయం సాధించారు. ఈ ప్రాంతంలో మరింత పట్టు పెంచుకోవాలని బీజేపీ–శివసేన నిర్ణయించాయి. ​

‘మెట్రో’పై వెనక్కి తగ్గని సర్కార్​

ముంబై మెట్రోరైల్​ కారిడార్​–3లో భాగంగా సిటీ లోని ఆరే మిల్క్ కాలనీలో డిపో కట్టాలని ప్రతిపాదించారు. దీనికోసం పెద్ద సంఖ్యలో చెట్లు కూల్చాలని ఆఫీసర్లు నిర్ణయించారు. ఈ ప్రపోజల్ ను సామాన్య ప్రజలతోపాటు అధికార బీజేపీకి మిత్రపక్షమైన శివసేన పార్టీ కూడా వ్యతిరేకించింది. అయినా దేవేంద్ర ఫడ్నవీస్ గవర్నమెంట్​ ఏమాత్రం వెనక్కి తగ్గలేదు.దీనిపై శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే మాత్రం సీరియస్ గా రియాక్టయ్యారు. అయితే ఉద్ధవ్ ఠాక్రేతో పర్సనల్ గా మంచి  సంబంధాలు ఉండటం వల్ల ఇష్యూ పెద్దది కాకుండా ఫడ్నవీస్  ఎలాగోలా నెట్టుకొచ్చారు.

ఇరుకున పెట్టిన పీఎంసీ కుంభకోణం

ఆరే కాలనీ ఇష్యూతో  రెండు పార్టీల మధ్య కొన్ని రోజులు గరంగరం వాతావరణం నడిచింది. ఈ వాడివేడి పరిస్థితులు చల్లబడుతుండగానే   ‘ పంజాబ్ అండ్ మహారాష్ట్ర  కో ఆపరేటివ్  ( పీఎంసీ) బ్యాంకు కుంభకోణం బయటపడింది. మహారాష్ట్ర సర్కార్ కు ఈ స్కాం ఓ తలనొప్పిలా మారింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్  వివరణతో పీఎంసీ బ్యాంకు కస్టమర్లు శాంతించారని బీజేపీ లెక్కలు వేసుకుంటోంది. ముంబైకే పరిమితమైన ఆరే కాలనీ, పీఎంసీ ఇష్యూలతోపాటు సిటీ బయట, రూరల్​, అర్బన్​ మహారాష్ట్రలో అధికార కూటమికి మరికొన్ని అంశాలు ఇబ్బంది పెడుతున్నట్లు ఎనలిస్టులు అంటున్నారు. గడచిన ఐదేళ్ల కాలంలో అనేక పల్లెల్లో వరుసగా నాలుగేళ్ల కరువొచ్చింది. చేతిలో పని లేక, పూట గడవక పేదలు నానా ఇబ్బందులు పడ్డారు.

మహారాష్ట్ర ను వాటర్ ట్యాంకర్  ఫ్రీ స్టేట్ గా మార్చాలనేది జలయుక్త్​ శివర్​ ప్రోగ్రాం టార్గెట్. ఫడ్నవీస్ ఈ కార్యక్రమంపై  బోలెడన్ని ఆశలు పెట్టుకున్నారు. అయితే ఇది ఆశించిన స్థాయిలో  సక్సెస్ కాలేదన్న  విమర్శలు వస్తున్నాయి. ఐదేళ్ల పాటు ప్రభుత్వంలో ఉంటే అంతో ఇంతో వ్యతిరేకత ఉండటం సహజమేనంటున్నారు బీజేపీ –శివసేన లీడర్లు. ఈ యాంటీ ఇన్ కంబెన్సీకి  కేండిడేట్ల గెలుపోటములు ప్రభావితం చేసే శక్తి ఉండదన్నది వీరి వాదన.  ముంబైలో మెట్రో కారిడార్ కోసం తాము చేస్తున్న కృషిని ప్రజలు గమనించారన్నారు. ఇదొక్కటే కాదు జమ్మూ కాశ్మీర్ కు కొన్నేళ్ల పాటు  ప్రత్యేక అధికారాలు కల్పించిన ఆర్టికల్ 370 రద్దు తర్వాత జరుగుతున్న ఎన్నికలు కావడంతో ఆ ప్రభావం అసెంబ్లీ ఎన్నికలపై  తప్పకుండా ఉంటుందంటున్నారు.

కలిసొచ్చిన రిజర్వేషన్లు

టోటల్​గా చూస్తే కాంగ్రెస్​ కూటమిలో ఆ పార్టీ కంటే మిత్రపక్షంగా ఉన్న ఎన్​సీపీ పరిస్థితే బెటర్​గా ఉందని అంటున్నారు. మరాఠా రిజర్వేషన్లు బీజేపీ–శివసేన కూట మికి ప్లస్​ పాయింట్​గా మారిందనేది ఎనలిస్టుల అభిప్రాయం.

ఆ మూడు సెగ్మెంట్లు

మహారాష్ట్రలో మొత్తం  అసెంబ్లీ సీట్లు 288. వీటిలో మూడు సెగ్మెంట్లు ఇప్పుడు అందరి దృష్టిని ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ పోటీ చేస్తున్న నాగ్ పూర్ సౌత్ వెస్ట్, శివసేన యూత్ లీడర్ ఆదిత్య  ఠాక్రే బరిలో నిలిచిన వర్లి, ఎన్సీపీ సీనియర్ లీడర్ అజిత్ పవార్ పోటీలో ఉన్న బారామతి పై అందరి దృష్టి పడింది.

నాగ్పూర్ సౌత్ వెస్ట్ నుంచి..

సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ నాగ్ పూర్ సౌత్ వెస్ట్ నుంచి పోటీలో ఉన్నారు. నాగ్ పూర్ జిల్లాలోని ఈ సెగ్మెంట్​లో  మొదటి నుంచి బీజేపీదే హవా. ఆరెస్సెస్ హెడ్ క్వార్టర్ ఉన్నది ఈ సిటీలోనే. దేవేంద్ర ఫడ్నవీస్ సిట్టింగ్ ఎమ్మెల్యే. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ కేండిడేట్ వికాస్ పాండురంగ్ ఠాక్రేను ఫడ్నవీస్ ఓడించారు.

కాంగ్రెస్ కేండిడేట్ గా ఆశీష్  దేశ్ ముఖ్

ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ కేండిడేట్ గా ఆశీష్  దేశ్ ముఖ్ పోటీ చేస్తున్నారు.  విదర్భను ప్రత్యేక రాష్ట్రం చేయాలంటూ జరిగిన ఉద్యమంలో  ఆశీష్ మేజర్  రోల్ పోషించారు. ఆశీష్ తండ్రి రంజిత్ దేశ్ ముఖ్ గతంలో పీసీసీ చీఫ్ గా, మంత్రిగా చేశారు. 2004 అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడే కాంగ్రెస్ కేండిడేట్​గా రంజిత్ దేశ్ ముఖ్ పోటీ చేసి దేవేంద్ర ఫడ్నవీస్ చేతిలో ఓడిపోయారు. అయితే ఆశీష్ దేశ్ ముఖ్ కు బీజేపీతో పాత అనుబంధం ఉంది. ఆయన కొంతకాలం బీజేపీలో ఉన్నారు. 2014 ఎన్నికల్లో బీజేపీ టికెట్ పై పోటీ చేసి కటోల్ సీటు నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. కొన్ని కారణాలతో కిందటేడాది అక్టోబరులో బీజేపీకి రాజీనామా చేసి ఆశీష్​  కాంగ్రెస్ లో చేరారు.

ఆకట్టుకుంటున్న వర్లి సీటు

ఈ ఎన్నికల్లో వర్లి సీటు హాట్ టాపిక్​. శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే కొడుకు, ఆ పార్టీ యూత్ లీడర్ ఆదిత్య ఠాక్రే ఇక్కడ బరిలో ఉన్నారు. ఠాక్రే కుటుంబ సభ్యులు ఎన్నికల్లో పోటీ చేయడం ఇదే తొలిసారి. ఇప్పటివరకు తెరవెనక ఉండి రాజకీయాలను శాసించిన ఠాక్రే ఫ్యామిలీ నుంచి ఆదిత్య ఠాక్రే ఫస్ట్ టైమ్ ఎన్నికల బరిలో నిలుచున్నారు.

శివసేనకి సేఫ్ సీట్

ఈ సెగ్మెంట్​ని శివసేన సేఫ్ సీటుగా భావిస్తోంది. ఈ కారణంతోనే  ఎన్నికల్లో పోటీకి ఆదిత్య దీన్ని సెలెక్ట్ చేసుకున్నారంటున్నారు రాజకీయ పరిశీలకులు. 2014 ఎన్నికల్లో ఇక్కడి నుంచి ఎన్సీపీ టికెట్ పై పోటీ చేసి ఓడిపోయిన సచిన్ అహిర్ లేటెస్ట్ గా ఆ పార్టీకి రాజీనామా చేసి శివసేన లో చేరారు. దీంతో ఆదిత్య ఠాక్రే  విజయం పై  శివసేన నాయకులు ధీమాతో ఉన్నారు.

జనంలోకి ఆదిత్య ఠాక్రే

ఎన్నికల్లో పోటీ చేయడం ఇదే ఫస్ట్ టైమ్ అయినా చాలా కాలం నుంచి ఆదిత్య ఠాక్రే జనంలోనే ఉన్నారు. తాజా లోక్ సభ ఎన్నికల్లో పార్టీకి విజయం సాధించి పెట్టినందుకు ప్రజలకు థ్యాంక్స్ చెబుతూ ఈఏడాది ఆయన ‘జన్ ఆశీర్వాద్ యాత్ర’ చేశారు. ఈ యాత్ర సందర్భంగా మహారాష్ట్ర అంతా టూర్ చేసి, ప్రజలకు దగ్గరయ్యే  ప్రయత్నం చేశారు. ఈ యాత్ర ప్రభావం వర్లి సెగ్మెంట్ పై తప్పకుండా ఉంటుందని శివసేన లీడర్లు లెక్కలు వేసుకుంటున్నారు.

బారామతి నుంచి అజిత్ 

బారామతి నియోజకవర్గం మొదటినుంచి ‘నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ’ ( ఎన్సీపీ)కి పెట్టని కోట వంటిది. పూణే జిల్లాలోని ఈ నియోజకవర్గానికి  ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ అసెంబ్లీలో చాలా కాలం పాటు ప్రాతినిధ్యం వహించారు. 1967 నుంచి 1990 వరకు శరద్ పవారే ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. కేంద్ర మంత్రిగా అవకాశం రావడంతో 1991 లో ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. 1991లో జరిగిన బై పోల్ లో ఆయన దగ్గరి చుట్టంఅజిత్ పవార్ ఇక్కడి నుంచి పోటీ చేసి గెలిచారు. 1999 నుంచి 2014 వరకు అజిత్ పవారే అసెంబ్లీలో బారామతి కి రిప్రజెంట్ చేశారు. ఈ సారి ఎన్నికను ప్రెస్టేజియస్​గా తీసుకుని ప్రచారం చేస్తున్నారు.

బీజేపీ టికెట్​పై గోపీచంద్ పడాల్కర్

అజిత్ పవార్ పై ఈసారి గోపీచంద్ పడాల్కర్ ను బీజేపీ బరిలోకి దింపింది. 35 ఏళ్ల గోపీచంద్ ఆర్ ఎస్ పీతో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం బీజేపీలో కొనసాగుతున్నారు. కొంత కాలంగా సంగ్లీ ప్రాంతంలో యూత్​ ప్రోగ్రామ్స్​ నిర్వహిస్తున్నారు.  దీంతో యూత్​ లీడర్​గా పేరు తెచ్చుకున్నారు. ​ బారామతి సీటు తమదేనన్న ధీమాతో ఎన్సీపీ లీడర్లు ఉంటే ఈసారి ఎలాగైనా ఈ సెగ్మెంట్ ను కైవసం చేసుకోవాలన్న గట్టి పట్టుదలతో బీజేపీ ఉంది.

చప్పగా కాంగ్రెస్ ప్రచారం !

కిందటి అసెంబ్లీ ఎన్నికల్లో విడివిడిగా  పోటీ చేసి నష్టపోయిన కాంగ్రెస్, నేషనలిస్ట్​ కాంగ్రెస్​ పార్టీ ఇప్పుడు పొత్తు పెట్టుకున్నాయి. అలయన్స్ తో ఈసారి మరింత బలపడతామని లీడర్లు అంచనాలు వేస్తున్నారు. అయితే ప్రచారంలో మాత్రం ఆ ఊపు కనిపించట్లేదు. అపోజిషన్ తరఫున ఎన్​సీపీ చీఫ్​ శరద్ ​పవార్ ఒక్కరే పబ్లిక్​ని ఆకట్టుకునేలా ప్రసంగాలు చేస్తున్నారు. అధికార పక్షంపై పదునైన విమర్శలు చేస్తున్నారు. కాంగ్రెస్ – ఎన్సీపీ నేతలు గత రెండు నెలల నుంచి బీజేపీ–ఎన్​సీపీ కూటమిని టార్గెట్​ చేసుకొని విరుచుకుపడుతున్నా పవార్ మాదిరిగా ఎఫెక్ట్​ చూపలేకపోతున్నారు. కాంగ్రెస్​ తరఫున రాహుల్​గాంధీ తప్ప పెద్ద లీడర్లు ఎవరూ ప్రచారంలో పాల్గొనట్లేదు.

ప్రియాంకాగాంధీ కూడా ఎలక్షన్​ క్యాంపెయిన్​కి దూరంగానే  ఉన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ గత నెల 19నే ఎన్నికల ర్యాలీలో పాల్గొనగా రాహుల్​గాంధీ ఈ నెల 13 వరకు గానీ ప్రచారానికి రాలేదు. ఎన్నికల సభల్లో కాంగ్రెస్​ ప్రస్తావించిన అంశాల్లోనూ కొత్తదనం లేదు. రాహుల్​ మళ్లీ ‘రాఫెల్’నే​ లేవనెత్తారు.. మోడీ సర్కారు కొంత మంది వ్యాపారుల కోసమే పనిచేస్తోందన్నారు. లోక్​సభ ఎన్నికల ప్రచారంలో ఆయన చేసిన ఇవే విమర్శలు ఓటర్లను మెప్పించలేదు. అయినా రాహుల్​గాంధీ పదే పదే అవే విషయాల గురించి మాట్లాడటం జనానికి రుచించట్లేదు. దీనికితోడు అధికార పక్షం దేవేందర్​ ఫడ్నవీస్ ను మరోసారి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించింది. అపోజిషన్ ​ మాత్రం ఎవరి పేరునూ తెరపైకి తేలేదు. వీటన్నింటినిబట్టి చూస్తే ప్రతిపక్షం ఈ ఎన్నికల పట్ల అంత సీరియస్​గా లేనట్లు కనిపిస్తోందని ఎనలిస్టులు అంటున్నారు. కాంగ్రెస్​, ఎన్​సీపీల్లో అంతర్గత కుమ్ములాటలు కూడా తగ్గలేదు.