- సీఎంపై వారి డెసిషన్ కు కట్టుబడి ఉంటా: ఏక్ నాథ్ షిండే
- ఎలాంటి అడ్డంకులు సృష్టించను
ముంబై: మహారాష్ట్ర కొత్త సీఎం ఎంపిక విషయంలో ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాదే తుది నిర్ణయమని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, శివసేన చీఫ్ఏక్ నాథ్ షిండే చెప్పారు. వాళ్లు ఏ నిర్ణయం తీసుకున్నా, కట్టుబడి ఉంటానని తెలిపారు. ఈ విషయంలో తాను ఎలాంటి అడ్డంకులు సృష్టించబోనని వెల్లడించారు. బుధవారం థానేలోని తన నివాసంలో మీడియాతో షిండే మాట్లాడారు. ‘‘నిన్న ప్రధాని మోదీ, అమిత్ షాతో ఫోన్ లో మాట్లాడాను. సీఎంను ఎంపిక చేయాలని కోరాను. వాళ్లు ఏ నిర్ణయం తీసుకున్నా, కట్టుబడి ఉంటానని చెప్పాను” అని షిండే తెలిపారు.
ప్రభుత్వ ఏర్పాటు అంశం నేడు ఫైనల్ అవుతుందని వెల్లడి
రెండోసారి సీఎం పదవి దక్కడం లేదని షిండే అసంతృప్తిగా ఉన్నారన్న వార్తలను ఆయన ఖండించారు. కొత్త కేబినెట్ లో డిప్యూటీ సీఎంలుగా ఎవరెవరు ఉంటారని ప్రశ్నించగా.. ‘‘రేపు (గురువారం) ఢిల్లీలో అమిత్ షాతో మీటింగ్ ఉంది. అక్కడే అన్ని నిర్ణయాలు తీసుకుంటాం. ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించి ఫైనల్ చేస్తాం’’ అని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల టైమ్ లో విస్తృతంగా ప్రచారం చేశానని ఏక్ నాథ్ షిండే తెలిపారు. ఎన్నికల్లో గెలుపు కోసం రోజుకు 2 నుంచి 3 గంటలే నిద్రపోతూ పని చేశానన్నారు.
సీఎంగా షిండేనే అర్హుడు: శివసేన
సీఎం అయ్యే అర్హత ఏక్ నాథ్ షిండేకే ఉన్నదని శివసేన లీడర్ సంజయ్ శిర్సాట్ అన్నారు. ‘‘షిండే పేరుతోనే మహాయుతి కూటమి ఎన్నికలకు వెళ్లింది. ఆయన వల్లనే ఘన విజయం దక్కింది. మళ్లీ సీఎం అయ్యే అర్హత షిండేకే ఉన్నది. ఆయన డిప్యూటీ సీఎం పదవిని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించరు. మా కోరిక మేరకు బీజేపీ హైకమాండ్ షిండేను సీఎం చేస్తే ప్రజల్లోకి మంచి మెసేజ్ వెళ్తుంది. భవిష్యత్తులో జరిగే ఎన్నికల్లోనూ కూటమికి లబ్ధి చేకూరుతుంది” అని చెప్పారు.
ఫడ్నవీస్ సీఎం అవుతారని, షిండే కేంద్రంలోకి వెళ్తారన్న కేంద్రమంత్రి రామ్ దాస్ అథవాలే వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ‘‘ఆయన కేంద్రమంత్రి. కేంద్ర రాజకీయాలు చూసుకుని, రాష్ట్ర రాజకీయాలు మాకు వదిలేస్తే మంచిది” అని అన్నారు. కాగా, గెలిస్తే షిండేనే సీఎంను చేస్తామని ఎన్నికలకు ముందు బీజేపీ హామీ ఇచ్చిందని, దాన్ని నిలబెట్టుకోవాలని శివసేన లీడర్లు డిమాండ్ చేస్తున్నారు.