మహారాష్ట్రలో జనాభా కంటే ఓటర్లే ఎక్కువ.. లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్​ గాంధీ విమర్శలు

మహారాష్ట్రలో జనాభా కంటే ఓటర్లే ఎక్కువ.. లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్​ గాంధీ విమర్శలు
  • ఓటరు లిస్ట్​ ఇచ్చేందుకు ఈసీ నిరాకరణ
  • ఏదో తప్పు జరిగింది కాబట్టే ఇవ్వడం లేదన్న కాంగ్రెస్ ఎంపీ
  • ఈసీ స్పందించకుంటే న్యాయ వ్యవస్థను ఆశ్రయిస్తామని వార్నింగ్​

న్యూఢిల్లీ: మహారాష్ట్ర ఎన్నికల్లో  అవకతవకలు జరిగాయని కాంగ్రెస్​, శివసేన (యూబీటీ), ఎన్సీపీఎస్ఎస్​ ఆరోపించాయి. ప్రతిపక్షాలకు చెందిన పార్టీలు ఒక బృందాన్ని ఏర్పాటు చేసుకొని ఓటర్ల సంఖ్యపై అధ్యయనం చేస్తున్నట్టు తెలిపాయి. ఈమేరకు ప్రతిపక్ష పార్టీల తరఫున కాంగ్రెస్​ ఎంపీ, లోక్​సభ ప్రతిపక్ష నేత రాహుల్​గాంధీ శుక్రవారం మీడియాతో మాట్లాడారు. మహారాష్ట్రలో కొత్తగా చేరిన ఓటర్ల సంఖ్య హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర జనాభాతో సమానమని, తమకు ఓటరు జాబితా అందించి దీనిపై స్పష్టత ఇవ్వాలని కోరారు. 

ప్రతిపక్ష పార్టీలు తమ ఓట్ల శాతాన్ని కాపాడుకోవడంతో బీజేపీకి అనుకూలంగా ఉండే ఓటర్లు ఎక్కువగా యాడ్ అయ్యారని ఆరోపించారు. గవర్నమెంట్​ డేటా ప్రకారం మహారాష్ట్ర జనాభా 9.54 కోట్లు అయితే.. ఓటర్లు 9.7 కోట్లు అని తెలిపారు. రాష్ట్రంలోని మొత్తం వయోజన జనాభా కంటే మహారాష్ట్రలో ఎక్కువ మంది ఓటర్లు 
ఉన్నారని రాహుల్ గాంధీ ఆరోపించారు.

5 నెలల్లోనే 39 లక్షల మంది చేరిక

2019-– 2024 వరకు ఐదేండ్లలో ఓటరు లిస్ట్​లో చేరిన వారి సంఖ్య కేవలం 32 లక్షలు మాత్రమే. అయితే.. లోక్​సభ ఎన్నికల తర్వాత కేవలం 5 నెలల్లోనే 39 లక్షల మంది కొత్తగా ఓటర్ లిస్ట్ లో చేరారని రాహుల్​గాంధీ అన్నారు. అట్టడుగు వర్గాలకు చెందిన ఎందరో ప్రజల ఓట్లను ఓటర్ లిస్ట్ నుంచి తొలగించారని, కొన్ని ప్రాంతాల్లో  పోలింగ్‌‌ బూత్‌‌లు ఉన్నా అక్కడి ఓటర్లను మరో కేంద్రానికి మార్చారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ, లోక్‌‌సభ ఎన్నికలకు సంబంధించిన ఓటర్​ లిస్ట్​ను తమకు ఇవ్వాలని ఈసీని కోరామని చెప్పారు. దీనిద్వారా కొత్తగా చేరిన ఓటర్లు ఎవరనేది కచ్చితంగా తెలిసిపోతుందన్నారు. అలాగే, ఎంతమంది ఓటర్లను తొలగించారో, ఒక బూత్‌‌నుంచి మరొక బూత్‌‌కు ఎందుకు మార్చారో తెలుస్తుందని పేర్కొన్నారు. 

అయితే, ఈ విషయంపై ఈసీ నుంచి ఎలాంటి స్పందన రాలేదని తెలిపారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా లేదు గనకే ఓటర్ల జాబితాను తమకిచ్చేందుకు ఈసీ ఆసక్తి చూపడంలేదని రాహుల్‌‌ ఆరోపించారు. ఒకవేళ, ఎలక్షన్​ కమిషన్ తమకు ఓటరు జాబితా ఇవ్వకుంటే.. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతపై తీవ్ర అనుమానాలు కలుగుతాయని చెప్పారు. తాము ఈ అంశంపై న్యాయవ్యవస్థను ఆశ్రయిస్తామని హెచ్చరించారు.