మరో మూడు నెలల్లో జరిగే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ ఇప్పటినుంచే రెడీ అవుతోంది. ఈసారి ఎన్నికలను కమలం పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. ఇటీవలి జనరల్ ఎలక్షన్స్‌లో మహారాష్ట్రలోని 48 స్ఠానాలకుగాను, బీజేపీ 23 సీట్లు దక్కించుకుని టాప్‌లో నిలబడింది. దాని మిత్రపక్షమైన శివసేన 18 మంది ఎంపీలతో సెకండ్ ప్లేస్‌లో ఉంది. ప్రతిపక్షం నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) 4, కాంగ్రెస్ ఒకటి దక్కించుకుని నామమాత్రం పోటీలో ఉన్నాయి. దీంతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వరుస విజయం కోసం బీజేపీ ప్రయత్నిస్తోంది.
కాగా, మహారాష్ట్ర అసెంబ్లీలో మొత్తం సీట్ల సంఖ్య 288. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మేజిక్ ఫిగర్ 145. కిందటిసారి అసెంబ్లీ ఎన్నికలు 2014 అక్టోబరులో జరిగాయి. బీజేపీ, శివసేన విడివిడిగా పోటీ చేశాయి. ఆ ఎన్నికల్లో బీజేపీ 122 సీట్లు గెలుచుకోగా ఆ పార్టీ మిత్రపక్షమైన శివసేన 62 సీట్లలో విజయం సాధించింది. ఎన్నికల తర్వాత కూటమి గా ఏర్పడ్డాయి. మేజిక్ ఫిగర్ సాధించిన బీజేపీ, శివసేన కూటమి దేవేంద్ర ఫడ్నవీస్ నాయకత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
2014 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, శరద్ పవార్ నాయకత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) విడివిడిగా పోటీ చేశాయి. కాంగ్రెస్ కేవలం 42 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఎన్సీపీ 41 సీట్లు గెలుచుకుంది. అయితే ఈసారి ఎన్సీపీతో కలిసి పోటీ చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. దాదాపుగా 150 సీట్ల వరకు ఎవరు పోటీ చేయాలన్న ఇష్యూపై ఎలాంటి వివాదం లేదని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. 2009 నాటి ఎన్నికల్లో రెండు పార్టీల మధ్య కుదిరిన సీట్ల పంపకానికి అనుసరించిన విధానాన్నే ఈసారి కూడా ఫాలో అవుతామన్నారు కాంగ్రెస్ లీడర్లు. ఏ సీట్లో ఏ పార్టీకి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్న విషయమే ఈసారి సీట్ల పంపకానికి ప్రాతిపదిక అవుతుందన్నారు.
కాగా దళిత నాయకుడు, ‘వంచిత్ బహుజన్ అగాధి (వీబీఏ)’ చీఫ్ ప్రకాశ్ అంబేద్కర్ ఈసారి కాంగ్రెస్–ఎన్సీపీ కూటమితో కలిసే అవకాశాలు కనిపిస్తున్నట్లు ముంబై రాజకీయ వర్గాల కథనం. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి చర్చలకు రావలసిందిగా కాంగ్రెస్, ఎన్సీపీ కూటమి నాయకులు రాసిన లెటర్ కు ఆయన పాజిటివ్ గా స్పందించినట్లు తెలిసింది.
మరాఠాలది సెపరేట్ రూట్
ఇదిలా ఉంటే మొత్తం 288 సీట్లకు తాము పోటీ చేస్తామని మరాఠాల హక్కుల కోసం పోరాటం చేస్తున్నట్లు చెప్పుకుంటున్న ‘మరాఠా క్రాంతి థోక్ మోర్చా (ఎంకేటీఎం)’ లీడర్లు చెప్పారు. మరాఠా ప్రజల ప్రయోజనాలు కాపాడటానికి పుట్టిన అనేక చిన్న చిన్న సంస్థల అంబ్రెల్లా ఆర్గనైజేషనే మరాఠీ క్రాంతి థోక్ మోర్చా. ఎన్నికల్లో పోటీ చేయాలని ఈ సంస్థ నిర్ణయం తీసుకోవడం ఇదే తొలిసారి. మరాఠా కార్డు ఉపయోగించుకుని ఎన్నికల్లో గెలిచి పెద్ద పెద్ద పదవులు పొందిన చాలా మంది ఆ తర్వాత కార్డు పక్కనపడేశారని ఎంకేటీఎం నాయకులు ఆరోపిస్తుంటారు. అలాంటివారికి బుద్ధి చెప్పడానికే ఎన్నికల్లో పోటీ చేయాలని ఫస్ట్ టైమ్ నిర్ణయం తీసుకున్నట్లు ఈ సంస్థ నాయకుడు సునీల్ నాగ్నె చెప్పారు. అయితే ఎంకేటీఎంకు సంబంధించి ఇదే చివరి నిర్ణయమని చెప్పడం కరెక్ట్ కాదంటున్నారు రాజకీయ పండితులు. మొత్తం 288 సీట్లకు ఎంకేటీఎం పోటీ చేస్తే కాంగ్రెస్–ఎన్సీపీ కూటమి గెలుపు అవకాశాలపై ఆ ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయంటున్నారు పొలిటికల్ ఎనలిస్టులు.
సీఎం పోస్టు దగ్గరే అసలు పేచీ
కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్య పక్షాలుగా ఉన్న బీజేపీ, శివసేన ఈసారి కూడా కలిసి పోటీ చేయడంలో ఎలాంటి ఇబ్బందులు లేవు. మహారాష్ట్ర రాజకీయాల వరకు రెండు పార్టీలకు ఒకరి అవసరం మరొకరికి ఉంది. రెండు పార్టీలు సమాన సంఖ్యలో సీట్ల పంపకాలు చేసుకోవాలన్న ప్రతిపాదన ఇదివరకే తెరమీదకు వచ్చింది. దీనికి బీజేపీ నుంచి పెద్దగా అభ్యంతరాలు రాలేదు. అయితే ఎక్కువ సీట్లు గెలుచుకున్న పార్టీకే ముఖ్యమంత్రి పోస్టు దక్కాలని బీజేపీ భావిస్తోంది. దీనిని శివసేన వ్యతిరేకిస్తోంది. తమకు కూడా ముఖ్యమంత్రి పదవి చేపట్టే అవకాశం ఉండాలని శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే గట్టిగా పట్టుబడుతున్నట్లు ముంబై పొలిటికల్ వర్గాల టాక్. ఈ విషయంలో ఉద్ధవ్ ఠాక్రేను బీజేపీ లీడర్లు ఎలా కన్విన్స్ చేస్తారో చూడాల్సిందే.