ఎటు పోతోంది ఈ సమాజం.. కోడలు కావాల్సిన అమ్మాయిని పెళ్లాడిన వరుడి తండ్రి

కొడుకు పెళ్లి చేసుకోవాల్సిన అమ్మాయిని వరుడి తండ్రి పెళ్లాడటం.. బహుశా..! ఇటువంటి ఘటనలు సినిమా సన్నివేశాల్లో మాత్రమే కనిపిస్తుంటాయి.. అదీ సరదాకి. కానీ, ఇప్పటి కలికాలంలో అవి వాస్తవ రూపం దాలుస్తున్నాయి. కుమారుడు పెళ్లి చేసుకోవాలనుకున్న అమ్మాయిని అతని తండ్రి పెండ్లి చేసుకున్నాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని నాసిక్‌లో వెలుగు చూసింది. 

స్థానికుల కథనం ప్రకారం.. ఓ వ్యక్తి తన తండ్రితో కలిసి నివసిస్తున్నాడు. తాను పోతే.. కొడుకు ఒంటరివాడు అయిపోతాడని ఆలోచించిన తండ్రి కుమారుడికి పెళ్లి చేయాలని నిర్ణయించాడు. పనిలో పనిగా సంబంధాలు వెతకడం మొదలు పెట్టాడు. రెండు మూడు నెలలు శ్రమించాక.. ఎట్టకేలకు ఓ సంబంధం కుదిరింది. పెళ్లి తేదీ కూడా ఖరారవ్వడడంతో కుమారుడి మోహంలో ఆనందం చిగురించింది. ఇద్దరి ఇళ్లలో పెళ్లి పనులు మొదలయ్యాయి. అంతలోనే వరుడి తండ్రి షాకిచ్చాడు. 

కుటుంబసభ్యులకు చెప్పకుండా వరుడి తండ్రి ఇంటికి కోడలు కావాల్సిన అమ్మాయిని గుడిలో పెళ్లి చేసుకొని నేరుగా ఇంటికి తీసుకొచ్చాడు. పెళ్లి దుస్తుల్లో వచ్చిన ఆ కొత్త జంటను చూసి పెళ్లి కావాల్సిన వ్యక్తి నిర్ఘాంతపోయాడు. భార్య కావాల్సిన యువతి చేసిన మోసానికి, తండ్రి చేసిన ద్రోహానికి జీవితంపై విరక్తి పెంచుకున్నాడు. ఇక జీవితంలో పెళ్లి చేసుకోకని.. సన్యాసిగా మారుతానని భీష్మించుకుని కూర్చున్నాడు. అతని ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది.

మధ్యలో ఏం జరిగిందంటే..?

పెళ్లికి కొన్ని రోజుల ముందు వరుడి తండ్రి.. సదరు యువతి మధ్య ప్రేమ చిగురించిందట. వస్తూ పోతున్న సమయంలో కుమారుడి పట్ల ఆ తండ్రి తీసుకుంటున్న శ్రద్ధ చూసి.. వధువు ఆయనకు పడిపోయింది. ఆ విషయం ఆయనకు చెప్పగా.. ఒప్పుకున్నారు. ఇంకేముంది, పెళ్లి చూసుకున్నాక.. కుమారుడికి మరో అమ్మాయిని వెతకుదామని నిర్ణయించుకొని గుడిలో ఇద్దరూ ఒక్కటయ్యారు. కానీ తండ్రి, చేసుకోవాల్సిన అమ్మాయి ఇద్దరూ మోసం చేసేసరికి సదరు వ్యక్తి మానసికంగా కృంగిపోయాడు. సన్యాసి జీవితాన్ని ఎంచుకొని.. రోడ్ల వెంబడి తిరుగుతున్నాడు.