మహారాష్ట్ర మంత్రి ధనంజయ్ రాజీనామా.. సర్పంచ్ హత్య కేసులో అనుచరుడి అరెస్ట్తో నిర్ణయం

మహారాష్ట్ర మంత్రి ధనంజయ్  రాజీనామా.. సర్పంచ్ హత్య కేసులో అనుచరుడి అరెస్ట్తో నిర్ణయం
  • ప్రతిపక్షాల డిమాండ్ తో కేబినెట్ నుంచి వైదొలిగిన నేత
  • అంతరాత్మ సూచన మేరకు రిజైన్  చేశానని వెల్లడి
  • రాజీనామాకు సీఎం ఫడ్నవీస్  ఆమోదం

ముంబై: మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో సర్పంచ్  సంతోష్  దేశ్ ముఖ్‌‌  దారుణ హత్య కేసు మహాయుతి కూటమి ప్రభుత్వంలో తీవ్ర ప్రకంపనలు రేపుతోంది. ఈ హత్యలో తన అనుచరుడు వాల్మీక్ కరాద్  ప్రమేయం ఉన్నట్లు తేలడంతో మహారాష్ట్ర మంత్రి, ఎన్సీపీ (అజిత్ పవార్ వర్గం) లీడర్ ధనంజయ్  ముండే మంగళవారం (మార్చి 4) కేబినెట్​కు రాజీనామా చేశారు. రాజీనామా లేఖను ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కు సమర్పించగా.. సీఎం దానిని ఆమోదించారు. 

అనంతరం ఆ రాజీనామా లేఖను గవర్నర్  సీపీ రాధాకృష్ణన్ కు పంపామని సీఎం ఫడ్నవీస్  తెలిపారు. కాగా.. బీడ్  జిల్లాలోని మస్సాజోగ్  గ్రామ సర్పంచ్  సంతోష్​ దేశ్ ముఖ్  నిరుడు డిసెంబరు 9న దారుణ హత్యకు గురయ్యారు. అంతకుముందు బీడ్  జిల్లాలోని ఓ ఇంధన కంపెనీని టార్గెట్ చేసుకుని స్థానిక గ్యాంగ్  డబ్బులు ఇవ్వాలని డిమాండ్  చేయగా.. సంతోష్  అడ్డుకున్నారు. 

దీంతో గ్యాంగ్  సభ్యులు ఆయనను కిడ్నాప్  చేసి దారుణంగా హింసించి చంపేశారు. ఈ కేసును దర్యాప్తు చేసిన రాష్ట్ర క్రైం ఇన్వెస్టిగేషన్  డిపార్ట్ మెంట్(సీఐడీ).. గత నెల 27న బీడ్  జిల్లాలోని ఓ కోర్టులో 1200 పేజీలతో చార్జిషీటు దాఖలు చేసింది. సీఐడీ పోలీసులు మూడు కేసులు నమోదు చేశారు. సర్పంచ్  హత్య, అవాడా కంపెనీని బెదిరించి దోపిడీకి యత్నించడం, ఆ కంపెనీ సెక్యూరిటీ గార్డు మీద దాడికి పాల్పడడం వంటివి చేశారని నిందితులపై కేసులు పెట్టారు. అలాగే.. ఈ కేసుల్లో నిందితులపై అత్యంత కఠినమైన మహారాష్ట్ర కంట్రోల్  ఆఫ్​ ఆర్గనైజ్డ్  క్రైం యాక్ట్ (ఎంసీఓసీఏ) కూడా ప్రయోగించారు. 

ఈ కేసుల్లో మాస్టర్ మైండ్  వాల్మీక్  కరాద్  సహా సుదర్శన్  ఘులే, విష్ణు చాటే, జైరాం చాటే, మహేశ్  కేదార్, సిద్ధార్థ్  సోనావనే, సధీర్  సంగాలే, ప్రతీక్  ఘులేను అరెస్టు చేసి ఎంసీఓసీఏ కింద కేసులు నమోదు చేశారు. మరో నిందితుడు కృష్ణా అంధాలే పరారీలో ఉన్నాడని, అతడి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. ఇదిలా ఉండగా.. సర్పంచ్ ను ముఠా సభ్యులు హింసిస్తున్న ఫొటోలు వైరల్ గా మారాయి. 

అలాగే ఈ మర్డర్  కేసులో మంత్రి ధనంజయ్  ముండే అనుచరుడు వాల్మీక్  కరాద్  అరెస్టు కావడంతో ముండే రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్  చేశాయి. దీంతో డిప్యూటీ సీఎం, ఎన్సీపీ చీఫ్  అజిత్  పవార్ తో పాటు ఎన్సీపీ నేతలతో సీఎం ఫడ్నవీస్  సోమవారం అర్ధరాత్రి హుటాహుటిన సమావేశం నిర్వహించారు. దరిమిలా ధనంజయ్ ముండే మంగళవారం కేబినెట్​కు రాజీనామా చేశారు.