మహారాష్ట్రలో మరో మంత్రికి కరోనా పాజిటివ్‌

మహారాష్ట్రలో మరో మంత్రి కరోనా బారినపడ్డారు. ఆ రాష్ట్ర అర్బన్‌ డెవలప్‌మెంట్, పబ్లిక్ వర్క్స్‌ శాఖల మంత్రి ఏక్‌నాథ్ షిండేకు కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆయన తన ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. కరోనా టెస్టులో పాజిటివ్ అని తేలిందని, ప్రస్తుతం ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నానని పేర్కొన్నారు. గత కొన్ని రోజులుగా తనతో కాంటాక్ట్ అయిన వాళ్లంతా జాగ్రత్తగా ఉండాలని, ఏవైనా లక్షణాలు కనిపిస్తే టెస్టు చేయించుకోవాలని సూచించారు. ప్రజల ప్రార్థనలతో తాను తర్వగా కోలుకుని మళ్లీ ప్రజా సేవలోకి వస్తానని చెప్పారు. 

ఇప్పటికే 10 మంది మంత్రులకు కరోనా

కాగా, మహారాష్ట్రలో ఇప్పటికే 10 మంది మంత్రులు, 20 మంది ఎమ్మెల్యేలకు కరోనా సోకినట్లు రెండ్రోజుల క్రితం ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ తెలిపారు. ఆ రాష్ట్రంలో కరోనా కేసులు, ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి తీవ్రంగా ఉంది. సోమవారం ఒక్క రోజే ఆ రాష్ట్రంలో 11,877 కొత్త కరోనా కేసులు వచ్చాయి. అంతకు ముందు రోజు 8,063 కేసులు రాగా.. సోమవారం 27 శాతం కేసులు పెరిగాయి. ఇక మహారాష్ట్రలో దేశంలోనే అత్యధిక ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు 578 ఒమిక్రాన్ కేసులు వచ్చాయి. ఇక ఢిల్లీలో 382 ఒమిక్రాన్ బాధితులు ఉన్నారు. కేరళలో 185, రాజస్థాన్ 174, గుజరాత్ లో 152 కొత్త వేరియంట్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. మొత్తం 1,892 ఒమిక్రాన్ కేసులు నమోదు అయితే.. అందులో 799 మంది కోలుకున్నట్లు తెలిపారు  అధికారులు. 23 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఒమిక్రాన్ వ్యాపించింది.