ఉత్కంఠకు తెర.. మహారాష్ట్ర సీఎం పేరు ఖరారు చేసిన బీజేపీ హైకమాండ్ !

ఉత్కంఠకు తెర.. మహారాష్ట్ర సీఎం పేరు ఖరారు చేసిన బీజేపీ హైకమాండ్ !

ముంబై: మహారాష్ట్ర సీఎం పీఠాన్ని అధిష్టించేది ఎవరనే ఉత్కంఠకు తెర పడింది. దేవేంద్ర ఫడ్నవీస్ పేరును మహారాష్ట్రకు కాబోయే ముఖ్యమంత్రిగా బీజేపీ హైకమాండ్ ఫైనలైజ్ చేసింది. ఈ విషయాన్ని బీజేపీ సీనియర్ నేత ఒకరు జాతీయ మీడియాకు అనధికారికంగా ధ్రువీకరించారు. డిసెంబర్ 2న గానీ, 3న గానీ ఎమ్మెల్యేలతో జరిగే సమావేశంలో ఫడ్నవీస్ను బీజేపీ శాసనసభా పక్ష నేతగా ఎన్నుకుంటారని ఆ సీనియర్ నేత ఆదివారం రాత్రి వెల్లడించారు. ముఖ్యమంత్రి పేరును అధికారికంగా ప్రకటించనప్పటికీ డిసెంబర్ 5న ప్రమాణ స్వీకారానికి ముంబైలోని ఆజాద్ మైదాన్లో ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ముందు నుంచీ మహారాష్ట్ర బీజేపీలో కీలకంగా ఉన్న ఫడ్నవీస్ పేరే సీఎం రేసులో ప్రముఖంగా వినిపించింది.

మహాయుతి కూటమిలో కీలకంగా వ్యవహరించిన ఏక్నాథ్ షిండే (శివసేన) రేసులో ఉన్నట్లు వార్తలొచ్చాయి. ముఖ్యమంత్రి పదవి రేసులో ఉన్నట్టు గానీ, లేనట్టు గానీ షిండే స్పష్టత ఇవ్వకపోవడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. అయితే.. అమిత్ షాతో భేటీ అనంతరం షిండే మెత్తబడినట్లు సమాచారం. ముఖ్యమంత్రి పదవిపై ఆశలు వదులుకున్నప్పటికీ ప్రభుత్వంలో కీలక మంత్రిత్వ శాఖలను షిండే ఆశిస్తున్నట్లు తెలిసింది. ఏదేమైనా.. మహాయుతి కూటమి ఘన విజయం సాధించిన ఇన్ని రోజుల తర్వాత మహారాష్ట్రలో నెలకొన్న సస్పెన్స్కు తెర దించినట్లయింది. ఫడ్నవీస్ పేరును మహారాష్ట్ర సీఎంగా అధికారికంగా ప్రకటించడం మాత్రమే మిగిలి ఉంది.

ALSO READ | డిసెంబర్ 2న అంతా తెలిసిపోతుంది: ఎట్టకేలకు నోరు విప్పిన ఏక్ నాథ్ షిండే

ఇదిలా ఉండగా.. శివసేన శిబిరంలోని షిండే వర్గం సీఎం పదవి ఆయనకే ఇవ్వాలని పట్టుబడుతోంది.  బీహార్లో బీజేపీకి ఎక్కువ సీట్లు వచ్చినా.. జేడీయూ నేత నితీశ్కే సీఎంగా చాన్స్ ఇచ్చారని.. మహారాష్ట్రలో కూడా అదే ఫార్ములా పాటించాలని షిండే మద్దతుదారులు పట్టుబడుతున్న పరిస్థితి ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబయితో  కూడుకున్న మహారాష్ట్ర  దేశంలోనే కీలక రాష్ట్రం. అందుకే.. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎవరు బాధ్యతలు చేపడతారనే అంశంపై దేశవ్యాప్తంగా చర్చ జరిగింది.