ఫడ్నవీస్​ ఫైనల్​!..మహారాష్ట్ర సీఎంగా ఖరారు చేసిన బీజేపీ హైకమాండ్​

ఫడ్నవీస్​ ఫైనల్​!..మహారాష్ట్ర సీఎంగా ఖరారు చేసిన బీజేపీ హైకమాండ్​
  • ఒకట్రెండు రోజుల్లో బీజేఎల్పీ సమావేశంఆ తర్వాతే అధికారిక ప్రకటన
  • మీడియాకు వెల్లడించిన పార్టీ సీనియర్ లీడర్
  • ఈ నెల 5న ప్రమాణం

ముంబై : మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవిస్ పేరును బీజేపీ అధిష్టానం ఫైనల్ చేసినట్టు ఆ పార్టీ సీనియర్ లీడర్ ఒకరు ఆదివారం మీడియాకు వెల్లడించారు. సోమవారం లేదంటే మంగళవారం పార్టీ ఎమ్మెల్యేలతో శాసనసభాపక్ష సమావేశం నిర్వహిస్తామన్నారు. అందులో దేవేంద్ర ఫడ్నవిస్​ను బీజేపీ శాసన సభాపక్ష నేతగా ఎన్నుకుంటారని స్పష్టం చేశారు. మహాయుతి కూటమిలోని శివసేన, ఎన్సీపీ తరఫున శాసనసభా పక్ష నేతల ఎంపిక ముగిసిందన్నారు. ఆ రెండు పార్టీల కీలక నేతలతో చర్చించిన తరువాతే ఫడ్నవిస్ పేరును అధిష్టానం ఖరారు చేసిందని వివరించారు. 

డిసెంబర్ 5న సౌత్ ముంబైలోని ఆజాద్ మైదాన్​లో ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమిత్ షాతో పాటు పలువురు కేంద్ర మంత్రులు కూడా హాజరవుతారని వివరించారు. ఎన్డీఏ అధికారంలో ఉన్న ఆయా రాష్ట్రాల సీఎంలను కూడా ప్రమాణ స్వీకారోత్సవానికి ఆహ్వానిస్తామన్నారు. ఆజాద్ మైదాన్​లో కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయని వివరించారు. సీఎంతో పాటు ఇద్దరు డిప్యూటీ సీఎంలతో ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం నిర్వహించేందుకు మహాయుతి కూటమిలోని పార్టీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు.

ప్రభుత్వానికి నా మద్దతు ఉంటది : ఏక్​నాథ్​​ షిండే

మహారాష్ట్ర సీఎం ఎవరనేది బీజేపీ ఫైనల్ చేస్తదని కేర్​టేకర్ సీఎం ఏక్​నాథ్ షిండే తెలిపారు. సీఎంగా ఎవరిని ఎన్నుకున్నా.. తన ఫుల్ సపోర్టు ఉంటదని స్పష్టంచేశారు. ప్రభుత్వ ఏర్పాటు విషయంలో మహాయుతి కూటమిలో ఎలాంటి బేధాభిప్రాయాలు లేవని తేల్చి చెప్పారు. సొంతూరైన సతారా జిల్లా దారే గ్రామంలో ఆదివారం షిండే మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ ఏర్పాటుపై కూటమి నేతలంతా చర్చించుకుంటున్నామని తెలిపారు. ఎలాంటి నిర్ణయమైనా.. మహాయుతి కూటమిలోని శివసేన, బీజేపీ, ఎన్సీపీ కలిసే తీసుకుంటాయన్నారు. ‘‘దారే.. మా సొంతూరు. తరుచూ మా ఊరికి వస్తుంటాను. 

సీఎంగా ఉన్నప్పుడు కూడా వచ్చాను. ఈసారి వచ్చినందుకు కొందరు ప్రజల్లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారు. సీఎం పదవి విషయంలో నా వైఖరేంటో పోయిన వారమే చెప్పేశాను. సీఎంను ఫైనల్ చేసేది బీజేపీనే.. ఈ విషయంలో ఎలాంటి అనుమానాలు అక్కర్లేదు. సీఎం పోస్టు విషయమై నేను అసంతృప్తిగా ఉన్నట్లు కొందరు పుకార్లు పుట్టిస్తున్నారు. ప్రభుత్వ ఏర్పాటులో నా వంతు పాత్ర పోషిస్తా’’ అని ఏక్​నాథ్ షిండే స్పష్టం చేశారు. 

ప్రజా తీర్పుతో మా బాధ్యత పెరిగింది

ప్రజలు ఆశించిన విధంగా తమ ప్రభుత్వం పాలన అందించేందుకు మరోసారి సిద్ధంగా ఉన్నదని ఏక్​నాథ్ షిండే తెలిపారు. ‘‘ప్రజలు ఇచ్చిన తీర్పుతో మా బాధ్యత మరింత పెరిగింది. త్వరలోనే మహారాష్ట్రలో మహాయుతి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తది. ఎన్నికల సందర్భంగా కూటమి ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు కృషి చేస్తాం.  నా హెల్త్ కండీషన్ సరిగా లేదు. జ్వరంతో బాధడుతున్న. అందుకే సొంతూరికి వచ్చిన. ఇప్పుడు ఆరోగ్యం కుదటపడింది’’ అని షిండే తెలిపారు.

కొడుకు, ఎంపీ శ్రీకాంత్ షిండే సీఎం లేదంటే డిప్యూటీ సీఎం అవుతారా? అని మీడియా ప్రశ్నించగా.. ‘‘చర్చలు కొనసాగుతున్నాయి’’అని ఏక్​నాథ్ షిండే జవాబిచ్చారు. ‘‘పోయిన వారం ఢిల్లీలో అమిత్ షాతో  సమావేశం అయ్యాం. సీఎం ఎవరనేదానిపై మూడు పార్టీల నేతలు కలిసి నిర్ణయం తీసుకుంటారు.