ఇద్దరు కొడుకుల డెడ్​బాడీలను 15 కి.మీ. మోసుకెళ్లారు

  • అంబులెన్స్‌‌ లేక.. బురదలో నడుస్తూ ఇంటికి చేరిన దంపతులు 
  • మహారాష్ట్రలో హృదయవిదారక ఘటన

ముంబై:   జ్వరంతో బాధపడుతున్న తమ ఇద్దరు కొడుకులను ఆ దంపతులు ఆస్పత్రిలో చేర్చారు. సరైన వైద్యం అందక చిన్నారులిద్దరూ చనిపోయారు. వారి డెడ్‌‌‌‌‌‌‌‌ బాడీలను ఇంటికి తీసుకెళ్లేందుకు అంబులెన్స్ కూడా అందుబాటులో లేదు. దాంతో చేసేదేం లేక తన్నుకు వస్తున్న దుఃఖాన్ని దిగమింగుకున్న దంపతులు.. చెరొకరు తమ భుజాలపై ఇద్దరు కొడుకుల డెడ్‌‌‌‌‌‌‌‌బాడీలను వేసుకున్నారు. బురదలో అడవి గుండా ఆపసోపాలు పడుతూ 15 కిలోమీటర్లు నడిచారు. ఈ హృదయ విదారక ఘటన మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో జరిగింది. అహేరి తాలూకా పట్టిగావ్‌‌‌‌‌‌‌‌కు చెందిన ఓ జంట.. తమ చిన్నారుల డెడ్‌‌‌‌‌‌‌‌ బాడీలను భుజాలపై మోసుకెళ్తున్న వీడియోను కాంగ్రెస్ నేత విజయ్ వడెట్టివార్ గురువారం ఎక్స్(ట్విట్టర్)లో పోస్ట్ చేయగా.. ఈ వీడియో వైరల్ అయింది.

"పదేండ్లు కూడా నిండని ఇద్దరు అన్నదమ్ములు జ్వరం బారినపడ్డారు. కానీ వారికి సకాలంలో ట్రీట్మెంట్ అందలేదు. దాంతో ఆరోగ్యం మరింత క్షీణించి ఇద్దరూ చనిపోయారు. చివరకు వారి మృతదేహాలను తరలించడానికి అంబులెన్స్ కూడా అందుబాటులో లేదు. చనిపోయిన పిల్లల్ని భుజాలపై మోసుకుంటూ ఇంటికి చేరుకోవడానికి.. ఆ తల్లిదండ్రులు బురద నేలలో అటవీ మార్గం గుండా15 కి.మీ. నడవాల్సి వచ్చింది. ఈ ఘటనతో గడ్చిరోలిలోని ఆరోగ్య వ్యవస్థ దుస్థితి మరోసారి వెలుగులోకి వచ్చింది" అని సీఎం ఏక్‌‌‌‌‌‌‌‌నాథ్ షిండే ప్రభుత్వంపై విజయ్ విమర్శలు చేశారు.

రాష్ట్రం అభివృద్ధి చెందుతున్నదంటూ బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్, ఎన్సీపీ నేత ధర్మారావ్ బాబా ఆత్రమ్ ప్రకటనలు చేస్తున్నారని, కానీ గ్రౌండ్ లెవల్‌‌‌‌‌‌‌‌కి వెళ్లి ప్రజల పరిస్థితులను గమనిస్తే వాస్తవాలు తెలుస్తాయన్నారు. కాగా, విదర్భ ప్రాంతంలో ఇటీవల అంబులెన్స్ ఆలస్యం కావడంతో ఒక గర్భిణి ఇంటివద్ద చనిపోయిన బిడ్డను ప్రసవించింది. నొప్పులు తట్టుకోలేక ఆ తల్లి కూడా చనిపోయింది. ఈ వరుస ఘటనలతో మహారాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.