మహారాష్ట్ర అసెంబ్లీ బరిలో 7994 మంది

మహారాష్ట్ర అసెంబ్లీ బరిలో 7994 మంది
  • ఝార్ఖండ్ తొలిదశకు  685, రెండో దశకు 634 మంది

ముంబై/ రాంచీ: మహారాష్ట్ర అసెంబ్లీ, ఝార్ఖండ్ తొలిదశ అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగిసింది. మహారాష్ట్రలో 288 స్థానాలకు ఒకేదశలో ఎన్నికలు జరగనుండగా 7994 మంది అభ్యర్థులు బరిలో నిలిచినట్టుగా ఈసీ తెలిపింది. వారిలో 921 మంది నామినేషన్లను అధికారులు తిరస్కరించినట్లుగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వెల్లడించారు. అయితే నామినేషన్ల ఉపసంహరణకు నవంబర్ 4 వరకు గడువు ఉండటంతో ఎంతమంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలుస్తారో ఆరోజే తేలనుంది. కాగా నవంబర్ 20 మహారాష్ట్రలో ఎన్నికలు జరగనున్నాయి.

ఝార్ఖండ్ బరిలో..

మరోవైపు ఝార్ఖండ్ అసెంబ్లీ జరిగే తొలిదశ ఎన్నికలకు సంబంధించి 685 మంది అభ్యర్థులు బరిలో నిలిచినట్టు ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. తొలిదశలో 43 స్థానాలకు నవంబర్ 13న ఎన్నికలు జరగనున్నాయి. ఇక రెండోదశ ఎన్నికల బరిలో 634 మంది అభ్యర్థులు బరిలో ఉన్నట్టు ఈసీ తెలిపింది. కాగా రెండోదశలో 38 స్థానాలకు నవంబర్ 20న ఎన్నికలు జరగనున్నాయని జార్ఖండ్ ప్రధాన ఎన్నికల అధికారి రవికుమార్ తెలిపారు.