మహారాష్ట్రలో విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణకు నిరసనగా నేడు పలు కంపెనీలకు చెందిన విద్యుత్ ఉద్యోగులు 72 గంటల సమ్మెకు దిగారు. అర్థరాత్రి నుంచి ప్రారంభమైన ఈ సమ్మెలో వేలాది మంది సిబ్బంది పాల్గొంటున్నారని మహారాష్ట్ర విద్యుత్ కార్మికుల సమాఖ్య ప్రధాన కార్యదర్శి కృష్ణ బోయిర్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ఈ నిరసన శాంతియుతంగా జరుగుతుందన్న ఆయన.. ఉద్యోగులంతా తమ సంస్థల బయట ఏర్పాటు చేసిన దీక్షా శిబిరంలో ఆందోళన చేస్తున్నట్టు చెప్పారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం తమను సమావేశానికి పిలిచిందని, ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఉద్యోగుల సంఘాల యాక్షన్ కమిటీ సభ్యులతో సహ్యాద్రి గెస్ట్ హౌస్‌లో మధ్యాహ్నం 1 గంటలకు సమావేశమవుతారని భోయిర్ స్పష్టం చేశారు. దాంతో పాటు రాష్ట్రంలో సాధారణ విద్యుత్ సరఫరా జరిగేలా అన్ని చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.
మహారాష్ట్ర స్టేట్ ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (మహా వితరణ్), మహారాష్ట్ర రాష్ట్ర ఎలక్ట్రిసిటీ ట్రాన్స్‌మిషన్ కంపెనీ లిమిటెడ్ (మహాపరేషన్), మహారాష్ట్ర రాష్ట్ర విద్యుత్ ఉత్పత్తి కంపెనీ లిమిటెడ్ (మహానిర్మితి)లు ప్రభుత్వ విద్యుత్ కంపెనీలు. ఈ కంపెనీల ఉద్యోగులు గత మూడు వారాలుగా ఆందోళనలు నిర్వహిస్తున్నారు. అయితే అదానీ గ్రూప్ పవర్ అనుబంధ సంస్థకు 'సమాంతర పంపిణీ లైసెన్స్' జారీ చేయకూడదన్నది వారి ప్రధాన డిమాండ్ గా చెబుతున్నారు. గత ఏడాది నవంబర్‌లో, అదానీ గ్రూప్ కంపెనీ తన విద్యుత్ పంపిణీ వ్యాపారాన్ని ముంబైలోని మరిన్ని ప్రాంతాలకు విస్తరించడానికి లైసెన్స్ కోరింది. తమకు సొంత నెట్‌వర్క్ లేని ప్రాంతాల్లో విద్యుత్ పంపిణీకి ఎలాంటి ప్రైవేట్ కంపెనీలకు లైసెన్స్ ఇవ్వకూడదని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా అదానీ పవర్‌కు లైసెన్స్ మంజూరు చేయడం వల్ల ప్రభుత్వ కంపెనీలు ఆర్థికంగా నష్టపోతాయని కార్మికులు భయపడుతున్నారు.