- మహారాష్ట్రలో కొత్త వ్యాధి .. జీబీఎస్‌తో ఒకరు మృతి
- ఇప్పటి వరకు రాష్ట్రంలో 101 కేసులు
- ప్రజలు ఆందోళన చెందొద్దు: మహారాష్ట్ర మంత్రి
- గిలైన్ బారి సిండ్రోమ్ నివారణకు చర్యలు
- సర్కార్ ఆసుపత్రులలో ఫ్రీ ట్రీట్మెంట్ అందిస్తున్నామని వెల్లడి
పుణె: మహారాష్ట్రలో గిలైన్ బారె సిండ్రోమ్ (జీబీఎస్) కలకలం సృష్టిస్తున్నది. సోలాపూర్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి (40) ఆ వ్యాధి బారినపడి చనిపోయాడు. జీబీఎస్ లక్షణాలతోనే అతను మృతి చెందాడని అధికారులు తెలిపారు. అతను పుణెకు వచ్చినపుడు జీబీఎస్ బారినపడ్డాడు. తిరిగి తన సొంతూరికి వెళ్లిన తర్వాత డయేరియా, ఆయాసం, తిమ్మిరితో బాధపడ్డాడు. ఊపిరితిత్తులు బలహీనపడడంతో బాధితుడిని కుటుంబ సభ్యులు ఈ నెల 18న ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. పరిస్థితి విషమించడంతో ఆదివారం అతను చనిపోయాడు. ఈ విషయాన్ని సోలాపూర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీ డీన్ డాక్టర్ సంజీవ్ ఠాకూర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. అతడి మరణంతో ఈ కేసును సోలాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి రెఫర్ చేశారని సంజీవ్ వెల్లడించారు. ‘‘మృతుడు జీబీఎస్ బారినపడినట్లు ప్రైమరీ రిపోర్టులో తేలింది. అతని మరణానికి కచ్చితమైన కారణాన్ని తెలుసుకునేందుకు క్లినికల్ ఆటాప్సీ కూడా నిర్వహించాం. జీబీఎస్ లక్షణాలతోనే అతను చనిపోయినట్లు రిపోర్టులో వచ్చింది. తదుపరి పరీక్షల కోసం అతని బ్లడ్ శాంపిల్స్ ను నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపించాం’’ అని సంజీవ్ పేర్కొన్నారు. కాగా, జీబీఎస్ కేసులు పుణెలో 101కి చేరాయి. ఇందులో 16 మందిని వెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందిస్తున్నామని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఒక బృందాన్ని సోమవారం పుణెకు పంపించింది.
ఏంటీ జీబీఎస్?
మన శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థ (ఇమ్యూన్ సిస్టం) పొరపాటుగా నాడీ వ్యవస్థపై దాడి చేయడం వల్ల వచ్చే అరుదైన వ్యాధే గిలైన్ బారీ సిండ్రోమ్(జీబీఎస్). సాధారణంగా బ్యాక్టీరియా, వైరల్ ఇన్ఫెక్షన్లు జీబీఎస్ కు దారి తీస్తాయని డాక్టర్లు చెప్తున్నారు. కానీ దీనికి కచ్చితమైన కారణం ఏమిటో తెలియదు. ప్రస్తుతం మహారాష్ట్రలో కలుషిత నీరు లేదా ఆహారం వల్ల ఈ వ్యాధి వ్యాపిస్తుండవచ్చని భావిస్తున్నారు. కాగా, ఈ వ్యాధి వచ్చినవారిలో కండరాలు, అవయవాలు బలహీనమై, పక్షవాతానికి దారితీయొచ్చు.