మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతూనే ఉంది. బుధవారం ఒక్క రోజులోనే 2,250 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసులు 39,297కి చేరాయని మహారాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. అలాగే గడిచిన 24 గంటల్లో 65 మంది మరణించగా.. మొత్తం మృతుల సంఖ్య 1390కి చేరినట్లు తెలిపింది. ఇవాళ 679 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారని, వీరితో కలిపి ఇప్పటి వరకు మొత్తం 10,318 మంది డిశ్చార్జ్ అయ్యారని చెప్పింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా వేర్వేరు ఆస్పత్రుల్లో 27,581 మంది చికిత్స పొందుతున్నారని వెల్లడించింది.
ముంబై సిటీలోనే అత్యధిక కేసులు
మహారాష్ట్రలో నమోదైన కరోనా కేసుల్లో ముంబై సిటీ పరిధిలోనే ఎక్కువగా ఉన్నాయి. రాష్ట్రం మొత్తంలో 39,297 మంది వైరస్ బారినపడగా.. ఒక్క ముంబైలోనే 24,118 మందికి కరోనా సోకింది. గడిచిన 24 గంట్లలో రాష్ట్రంలో నమోదైన కేసుల్లో సగానికి పైగా సిటీలోనివే. ముంబైలో బుధవారం ఒక్క రోజులో 1372 కరోనా పాజిటివ్ కేసులు వచ్చాయి. అలాగే ఇవాళ మొత్తం 65 మరణాలు సంభవించగా.. అందులో 41 మంది ముంబైలోనే చనిపోయారు. దీంతో సిటీలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 841కి చేరింది.