ఆదిలాబాద్, వెలుగు : మహారాష్ట్రలోని తిప్పేశ్వర్ ఫారెస్ట్ లోని పులులు ఆదిలాబాద్ జిల్లాలోని అడవులకు క్యూ కడుతున్నాయి. ఆదిలాబాద్ నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న తిప్పేశ్వర్ టైగర్ ఫారెస్టు నుంచి ఇటీవల నాలుగు పులులు జిల్లాలోకి ప్రవేశించడాన్ని కొందరు లారీ డ్రైవర్లు వీడియో తీసి సోషల్‌మీడియాలో పెట్టడంతో చర్చనీయాంశమైంది. తిప్పేశ్వర్ ఫారెస్ట్యవత్మాల్ జిల్లాలోని పాటన్ బోరీ, పార్వ రేంజ్ పరిధిలోకి వస్తుంది. ఈ అడవి 150 చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉంటుంది. ఇప్పటికే అక్కడ 30 పులుల వరకు ఉన్నాయి. ఆహారం కోసం ఆ పులుల మధ్య ఘర్షణ జరుగుతోంది. దీంతో ఉండడానికి అనువైన ప్రదేశం, ఆహారం, తాగునీరు దొరికే ఆదిలాబాద్ బాట పట్టినట్లు తెలుస్తోంది.
తిప్పేశ్వర్ అడవికి ఆనుకొని ఉన్న ఆదిలాబాద్ జిల్లాలోని తాంసి, భీంపూర్, తలమడుగు మండలాల మీదుగా పెన్ గంగా నది ప్రవహిస్తుండడంతో ఇటు వైపు మరలాయి. అయితే మొన్నటి పులులు భీంపూర్ మండలంలోని గొల్లగఢ్ తాంసి గ్రామ శివారులో ఉన్న నదిని దాటి వచ్చాయని అధికారులు చెబుతున్నారు. జిల్లాలో పెన్‌గంగా నిత్యం ప్రవహిస్తుండడం, చుక్కలదుప్పులు, జింకలు, కుందేళ్లు, మనువోతులు ఎక్కువగా తిరిగే అడవి కావడంతో పులులు ఈ చోటును ఎంచుకున్నాయి. అయితే ఆదిలాబాద్ జిల్లాలోని జనరల్ ఫారెస్ట్‌లో ఇప్పటికే నాలుగు పులులున్నాయి. ఇప్పుడు మరో నాలుగు రావడంతో వీటి సంఖ్య ఎనిమిదికి చేరింది.
భయం భయంగా..
ఆదిలాబాద్ జనరల్ ఫారెస్టు 4 లక్షల ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. ఈ అటవీ ప్రాంత పరిధిలో 300కు పైగా గ్రామాలు, 160 అటవీ శివారు గ్రామాలున్నాయి. ఈ పల్లెల్లో సుమారు 80 వేల జనాభా ఉంది. పులుల రాకతో వీరంతా భయపడుతున్నారు. మూడు రోజుల క్రితం బీంపూర్ మండలంలో పిప్పల్ కోటిలో ఆవుపై ఓ పులి దాడి చేసి గాయపరిచ్చింది. గతంలో కూడా భోథ్, బజారహత్నూర్, తలమడుగు, భీంపూర్ ప్రాంతాల్లో పశువులపై పులులు దాడులు చేసిన ఘటనలున్నాయి. మొన్న ఆసిఫాబాద్ లో కూడా ఓ రైతును పులి చంపిందన్న వార్త రావడంతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ప్రస్తుతం పొలాల్లో వ్యవసాయ పనులు జోరుగా సాగుతుండటంతో రైతులు, కూలీలు ఆందోళన చెందుతున్నారు.
ఇటీవల కనిపించినవి తల్లీ పిల్లలే
ఇటీవల పిప్పల్కోటి రిజర్వాయర్ ప్రాంతంలో కనిపించిన నాలుగు పులుల్లో ఒకటి తల్లి, మూడు పిల్లలని ఫారెస్ట్ అధికారులు చెబుతున్నారు. నెల రోజులుగా అక్కడక్కడా ఒక్కొక్కటిగా కనిపించిన పులులు ఇవే అని నిర్ధారించారు. రక్షణ చర్యల్లో భాగంగా ఇప్పటికే ఫారెస్ట్ ఆఫీసర్లు రెండు బేస్ క్యాంపులు ఏర్పాటు చేశారు. రాత్రి టైంలో 8 మంది సిబ్బందితో నలుగురు చొప్పున టాస్క్ ఫోర్స్, ర్యాపిడ్ ఫోర్స్ ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నారు. 40 కెమెరాలు బిగించి పులుల జాడను గుర్తించే పనిలో పడ్డారు. అటు ఎన్జీఓల సాయం కూడా తీసుకుంటున్నారు. పులులు ఇక్కడే తిరుగుతుండడంతో గ్రామాల ప్రజలు, రైతులు సాయంత్రం సమయంలో బయటకు వెళ్లకూడదని, వెళ్లినా గుంపులుగా తిరగాలని గ్రామాల్లో అవగాహన కల్పిస్తున్నారు.
జనాలు అలర్ట్‌గా ఉండాలి
తిప్పేశ్వర్ అభయరాణ్యానికి ఆదిలాబాద్ కు కేవలం పెన్ గంగ మాత్రమే అడ్డు ఉంది. అక్కడ పులుల సంఖ్య పెరగడంతోనే నది దాటి జిల్లాలోకి వస్తున్నాయి. ఇటీవల కనిపించిన పులులు తల్లీపిల్లలుగా గుర్తించాం. అడుగు జాడలు గుర్తించేందుకు కెమెరాలు ఏర్పాటు చేశాం. బేస్ క్యాంపులు పెట్టి పర్యవేక్షిస్తున్నాం. జనాలు అప్రమత్తంగా ఉండాలి.
– రాజశేఖర్, డీఎఫ్ఓ ఆదిలాబాద్