నవంబర్ 20న మహారాష్ట్ర ఎన్నికలు

నవంబర్ 20న మహారాష్ట్ర ఎన్నికలు
  • అదే నెల 13, 20వ తేదీల్లో జార్ఖండ్​లో పోలింగ్​
  • షెడ్యూల్ రిలీజ్ చేసిన సీఈసీ రాజీవ్ కుమార్
  • దేశవ్యాప్తంగా 48 అసెంబ్లీ, రెండు లోక్​సభ స్థానాలకు 
  • బై ఎలక్షన్లు.. నవంబర్ 23న ఫలితాల వెల్లడి
  • ఈవీఎంలను ఎవరూ ట్యాంపరింగ్ చేయలేరు
  • ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు నమ్మి ఈసీపై నిందలు సరికావు
  • ఈవీఎంలన్నీ వంద శాతం కరెక్ట్​గా ఉన్నాయని వ్యాఖ్య

న్యూఢిల్లీ: మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్​ను కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం రిలీజ్ చేసింది. మహారాష్ట్రలో ఒకే ఫేజ్​లో, జార్ఖండ్​లో రెండు దఫాల్లో ఎలక్షన్లు నిర్వహిస్తామని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (సీఈసీ) రాజీవ్​కుమార్ ప్రకటించారు. నవంబర్ 20న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ నిర్వహిస్తామన్నారు. నవంబర్ 13, 20వ తేదీల్లో జార్ఖండ్ అసెంబ్లీకి ఎలక్షన్లు నిర్వహిస్తున్నట్లు వివరించారు. రెండు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను నవంబర్ 23న వెల్లడిస్తామని చెప్పారు. ఈమేరకు ఎన్నికల వివరాలను ఆయన మీడియాకు వెల్లడించారు. ‘‘పలు రాష్ట్రాల్లోని 48 అసెంబ్లీ, రెండు లోక్​సభ స్థానాలకు కూడా ఉప ఎన్నికలు నిర్వహిస్తున్నాం. 

రాహుల్ గాంధీ రాజీనామాతో కేరళలోని వయనాడ్ స్థానం ఖాళీ అయింది. ఈ సెగ్మెంట్​తో పాటు వేర్వేరు రాష్ట్రాల్లోని 47 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 13న బై పోల్ నిర్వహిస్తున్నాం. మహారాష్ట్రలోని నాందేడ్ లోక్​సభ సెగ్మెంట్ నుంచి కాంగ్రెస్ తరఫున గెలిచిన వసంత్ రావు బల్వంత్ రావు చౌహాన్ ఆగస్టులో చనిపోయారు. దీంతో నాందేడ్ ఎంపీ స్థానంతో పాటు కేదార్​నాథ్ అసెంబ్లీ సెగ్మెంట్​కు నవంబర్ 20న ఉప ఎన్నిక నిర్వహిస్తున్నాం. రెండు లోక్​సభ, 48 అసెంబ్లీ ఉప ఎన్నికల ఫలితాలను కూడా నవంబర్ 23న ప్రకటిస్తాం’’ అని రాజీవ్ కుమార్ తెలిపారు. కాగా, మహారాష్ట్ర ప్రస్తుత అసెంబ్లీకి ఈ ఏడాది నవంబర్ 26తో గడువు ముగియనున్నది. అలాగే, 81 స్థానాలు ఉన్న జార్ఖండ్ అసెంబ్లీ గడువు వచ్చే ఏడాది జనవరి 5వ తేదీతో కంప్లీట్ కానున్నది.

ఎగ్జిట్​ పోల్స్​కు శాస్త్రీయత లేదు: సీఈసీ

ఈవీఎంల పనితీరుపై ఎలాంటి సందేహాలు అక్కర్లేదని సీఈసీ రాజీవ్ కుమార్ స్పష్టం చేశారు. పేపర్ బ్యాలెట్​తో ఎన్నికలు నిర్వహించాలంటూ కొందరు నేతలు డిమాండ్ చేస్తున్నారన్నారు. ‘‘పేపర్ బ్యాలెట్ తో ఓటింగ్ నిర్వహించడం అంటే.. దేశాన్ని మళ్లీ వెనక్కి తీసుకెళ్లడమే.. ఎన్నిసార్లు అనుమానాలు లేవనెత్తితే.. అన్నిసార్లు మేము వాళ్లకు సమాధానం చెప్తాం. ఎగ్జిట్​పోల్స్ అంచనాలకు అనుగుణంగా ఫలితాలు రాకపోతే ఈవీఎంలపై ఆరోపణలు చేస్తున్నారు. ఎగ్జిట్​పోల్స్​కు ఎలాంటి శాస్త్రీయత లేదు. అవి కేవలం అంచనాలు మాత్రమే. ఉదయం 9.30 కంటే ముందే ఇచ్చే ఫలితాలన్నీ బోగస్. ఎగ్జిట్​పోల్స్ నమ్మి ఈసీపై నిందలు వేయడం సరికాదు. ఈవీఎంలలో ఉపయోగించేవి రీ ఛార్జ్‎బుల్ బ్యాటరీలు కావు.. వాటిని ఒకేసారి యూజ్ చేస్తాం. ఈవీఎంలన్నీ వంద శాతం పూల్ ప్రూఫ్​గా ఉన్నాయి. ఎవరూ ట్యాంపరింగ్ చేయలేరు. ఆరు నెలల ముందే ఈవీఎంలను పరిశీలించి వినియోగిస్తాం. పార్టీల ఏజెంట్ల సమక్షంలోనే ఓపెన్ చేస్తాం. నేతల ప్రశ్నలకు ప్రజలే సమాధానాలు చెప్తారు’’ అని రాజీవ్  కుమార్  చెప్పారు.

మహారాష్ట్రలో 288 అసెంబ్లీ స్థానాలు

బెంగాల్​లోని బసిర్హత్, ఉత్తరప్రదేశ్​లోని మిల్కిపూర్ లోక్​సభ స్థానాల ఎన్నికల పిటిషన్లు పెండింగ్​లో ఉండటంతో ఉప ఎన్నిక షెడ్యూల్ ప్రకటించలేదని సీఈసీ రాజీవ్ కుమార్ తెలిపారు. మహారాష్ట్రలో మొత్తం 36 జిల్లాల్లో 288 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. వీటిలో 234 జనరల్‌‌‌‌‌‌‌‌ సీట్లు కాగా.. 25 ఎస్టీ, 29 ఎస్సీ స్థానాలు ఉన్నాయి. ఎన్నికల కోసం మొత్తం 1,00,186 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం. 2024, అక్టోబర్‌‌‌‌ 15 నాటికి మొత్తంగా 9.63 కోట్ల మంది ఓటర్లు ఉండగా.. వీరిలో 4.97 కోట్ల మంది పురుషులు, 4.66 కోట్ల మంది మహిళా ఓటర్లు ఉన్నారు. 1.85 కోట్ల మంది యువ ఓటర్లు ఉన్నారు. 20.93 లక్షల మంది ఫస్ట్ టైమ్ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.

జార్ఖండ్​లో 81 అసెంబ్లీ సెగ్మెంట్లు

జార్ఖండ్‌‌‌‌లో మొత్తం 24 జిల్లాల్లో 81 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయని సీఈసీ రాజీవ్ కుమార్​ తెలిపారు. వీటిలో జనరల్‌‌‌‌ 44 సీట్లు కాగా, ఎస్టీ 28, ఎస్సీ 9 చొప్పున ఉన్నట్లు చెప్పారు. మొత్తంగా 2.60 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 1.29 కోట్ల మంది మహిళా ఓటర్లు.. 1.31 కోట్ల మంది పురుషులు. 66.84 లక్షల మంది యువ ఓటర్లు, 11.84 లక్షల మంది తొలిసారి ఓటేయనున్నారు. 85 ఏండ్లు పైబడిన వారు 1.13 లక్షల మంది ఉన్నారు.

ఓట్ల లెక్కింపు, ఫలితాలు: నవంబర్‌‌‌‌ 23

మహారాష్ట్ర షెడ్యూల్‌‌‌‌

గెజిట్‌‌‌‌ నోటిఫికేషన్‌‌‌‌: అక్టోబర్‌‌‌‌ 22
నామినేషన్లకు గడువు: అక్టోబర్‌‌‌‌ 29
నామినేషన్ల పరిశీలన: అక్టోబర్‌‌‌‌ 30
ఉపసంహరణ గడువు: నవంబర్‌‌‌‌ 4
పోలింగ్‌‌‌‌ తేదీ: నవంబర్‌‌‌‌ 20

జార్ఖండ్ షెడ్యూల్‌‌‌‌

గెజిట్‌‌‌‌ నోటిఫికేషన్‌‌‌‌: అక్టోబర్‌‌‌‌ 18
నామినేషన్లకు గడువు: అక్టోబర్‌‌‌‌ 25
నామినేషన్ల పరిశీలన: అక్టోబర్‌‌‌‌ 28
ఉపసంహరణ గడువు: అక్టోబర్ 30
పోలింగ్‌‌‌‌ తేదీ: నవంబర్‌‌‌‌ 13, 20