మహారాష్ట్ర..కర్ణాటకలో సేమ్ గేమ్

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు 2018 మే నెలలో జరగ్గా హంగ్​ ఫలితాలు వచ్చాయి. బీజేపీ మెజారిటీ ఫిగర్​ (113)కి తొమ్మిది సీట్ల దూరంలో ఆగిపోయింది. ఎక్కువ స్థానాలు గెలిచిన పెద్ద పార్టీ కాబట్టి, ఫస్ట్​ ఛాన్స్​ బీజేపీకే గవర్నర్​ ఇచ్చారు. యడ్యూరప్ప ప్రమాణం చేసినా, మెజారిటీ సాధించడం కష్టమని తేలిపోవడంతో మూడు రోజులకే దిగిపోయారు. ఆ తర్వాత 37 సీట్లు గెలుచుకున్న జనతాదళ్​ (ఎస్​)కి 80 మంది ఎమ్మెల్యేలుగల కాంగ్రెస్ సపోర్ట్​ ఇచ్చి, కుమారస్వామిని ముఖ్యమంత్రి సీటులో కూర్చోబెట్టింది. ఈ ప్రభుత్వం 14 నెలల పాటు కొనసాగాక, 17 మంది కాంగ్రెస్​ సభ్యులు తిరుగుబాటు చేయడంతో వారిపై స్పీకర్​ రమేశ్​కుమార్​ అనర్హత వేటు వేశారు. కుమారస్వామి ప్రభుత్వం కుప్పకూలింది. 17 మంది ఎమ్మెల్యేలు తగ్గడంతో మెజారిటీ ఫిగర్​ 104కు పడిపోగా, ఒక ఇండిపెండెంట్​ మద్దతుతో మరోసారి యడ్యూరప్ప ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టారు.

ఇదే తరహాలో మహారాష్ట్ర రాజకీయాలుకూడా సాగాయి. అక్టోబర్​లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హంగ్​ ఫలితాలు వెలువడ్డాయి. 288 సీట్ల అసెంబ్లీలో మేజిక్​ ఫిగర్​ 145 మంది ఎమ్మెల్యేలు ఏ పార్టీకీ రాలేదు. బీజేపీకి 105, శివసేనకు 56, ఎన్సీపీకి 54, కాంగ్రెస్​కి 44 సీట్లు వచ్చాయి. నెల్లాళ్లపాటు హైడ్రామా సాగాక… అనుకోని రీతిలో శరద్​ పవార్​ అన్న కొడుకు అజిత్​ పవార్​ ప్లేట్​ ఫిరాయించడంతో దేవేంద్ర ఫడ్నవీస్​ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అజిత్​ డిప్యూటీ సీఎం పదవి చేపట్టారు. ఈ మొత్తం వ్యవహారం సుప్రీం కోర్టు తలుపు తట్టింది. గవర్నర్​ మెజారిటీ నిరూపణకు ఇచ్చిన వారం రోజుల గడువును సుప్రీం బాగా కుదించింది. బుధవారం సాయంత్రం 5 గంటలలోగా అసెంబ్లీలో బల నిరూపణ జరగాలని ఆదేశించింది. శరద్​ పవార్​ ఫ్యామిలీ సభ్యులు రంగంలోకి దిగి అజిత్​ మనసు మార్చేశారు. ఆయన డిప్యూటీ సీఎం పోస్టుకి రాజీనామా చేయడంతో మెజారిటీ అసాధ్యమని తేలిపోయి సీఎం దేవేంద్ర ఫడ్నవీస్​కూడా రిజైన్​ చేయాల్సి వచ్చింది.

మహారాష్ట్ర

బొంబాయి స్టేట్​ని 1960లో రెండుగా విడదీసి మహారాష్ట్ర గుజరాత్​లుగా ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ఇప్పటివరకు రెండుసార్లు హంగ్​ అసెంబ్లీ ఫలితాలు వెలువడ్డాయి. అయితే, పొలిటికల్​ ఈక్వేషన్లు మారడం, సీఎంలుగా అయిదేళ్లు కొనసాగకపోవడం అనేది మాత్రం చాలాసార్లు జరిగింది.

మొట్టమొదటసారిగా, 1978 అసెంబ్లీ ఎన్నికల్లో హంగ్​ ఫలితాలు వచ్చాయి. కాంగ్రెస్​ పార్టీ అప్పటికే రెండుగా చీలిపోయింది. 99 సీట్లు గెలుచుకున్న జనతా పార్టీకి ఛాన్స్​ దక్కకుండా, రెండు కాంగ్రెస్ పార్టీలు ఏకమై వసంతదాదా పాటిల్​ని సీఎం సీటులో కూర్చోబెట్టాయి. 4 నెలల 13 రోజులు గడిచాక, శరద్​ పవార్​ తిరుగుబాటు చేశారు.  ప్రోగ్రెసివ్​ డెమొక్రటిక్​ ఫ్రంట్​ పేరుతో ప్రత్యేక వర్గంగా ఏర్పడి జనతా పార్టీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేశారు. అప్పటికాయన వయసు 38 ఏళ్లే. అతి చిన్న వయసులో మహారాష్ట్ర సీఎం కాగలిగిన మొదటి వ్యక్తిగా రికార్డులకెక్కారు. శరద్​ పవార్​ నాలుగు సార్లు ముఖ్యమంత్రయినా, ఎప్పుడూ అయిదేళ్ల కాలం కొనసాగలేక పోయారు.

దేవేంద్ర ఫడ్నవీస్​ : 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు వేర్వేరుగా పోటీ చేస్తే, బీజేపీకి 122, శివసేనకి 63 సీట్లు వచ్చాయి. ఫలితాలు వచ్చాక పోస్ట్​–పోల్​ అలయెన్స్​ కుదుర్చుకున్నాయి. దేవేంద్ర ఫడ్నవీస్​ (బీజేపీ) ప్రభుత్వంలో శివసేనకూడా చేరింది. అప్పట్లో బీజేపీ 26, శివసేన 13, ఇతర మిత్రపక్షాలు 4 చొప్పున మంత్రి పదవుల్ని షేర్​ చేసుకున్నాయి. మహారాష్ట్రలో కేబినెట్​ 43 మందికి మించి ఉండడానికి వీల్లేదు.

2019 అక్టోబరులో జరిగిన ఎన్నికల్లో బీజేపీ–శివసేన ఒక టీమ్​గా, కాంగ్రెస్​–ఎన్సీపీ మరో టీమ్​గా పోటీకి దిగినా… ఎవరికీ మెజారిటీ రాలేదు. దీంతో నెల రోజులపాటు పొలిటికల్​ హైడ్రామా నడిచింది. చివరకు ఉద్ధవ్​ థాక్రేని సీఎం చేయడానికి కాంగ్రెస్​, ఎన్సీపీ ఒప్పుకున్నాయి. తెల్లారితే ఉద్ధవ్​ ప్రభుత్వం ఏర్పడుతుందనగా రాత్రికి రాత్రే ఈక్వేషన్లు మారిపోయాయి. ఎన్సీపీ లెజిస్లేచర్​ పార్టీ నాయకుడు అజిత్​ పవార్​ ఫిరాయించడంతో… ఈ నెల 23వ తేదీ శనివారం ఉదయం దేవేంద్ర ఫడ్నవీస్​ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. అజిత్​ డిప్యూటీ సీఎం అయ్యారు. మూడు రోజుల తర్వాత మళ్లీ అజిత్​ ఫిరాయించడంతో ఫడ్నవీస్​ రిజైన్​ చేసేశారు.

కర్ణాటక

కర్ణాటక రాష్ట్రం 1956లో ఏర్పడగా, ఇప్పటివరకు 19 ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. ఒక్కొక్కరు రెండు మూడు సార్లు ముఖ్యమంత్రులైన సందర్భాలుకూడా ఉన్నాయి. అయితే, ఈ 19 ప్రభుత్వాల్లో రెండు మూడు మినహాయిస్తే… మిగతావేవీ అయిదేళ్ల పదవీ కాలం పూర్తి చేసుకోలేదు. దీనిని బట్టి, కర్ణాటకలో పాలిటిక్స్​ ఎంత స్పీడ్​గా ఉంటాయో అర్ధం చేసుకోవచ్చు.

కుమారస్వామి : 2006లో బీజేపీతో ఒప్పందం చేసుకుని దేవెగౌడ కొడుకు కుమారస్వామి ముఖ్యమంత్రి అయ్యారు. ఏడాదిన్నర తర్వాత అధికారాన్ని అప్పగించాలన్నది బీజేపీతో చేసుకున్న ఒప్పందం. అయితే గడువు సమీపించగానే బీజేపీకి పవర్​ బదలాయించడానికి జేడీ(ఎస్​) ఓ పట్టాన ఒప్పుకోలేదు. బీజేపీ మద్దతు వెనక్కి తీసుకోవడంతో కుమారస్వామి రిజైన్​ చేయాల్సి వచ్చింది. యడ్యూరప్ప సీఎం అయినా, అసెంబ్లీలో బల నిరూపణ చేసుకోలేక ఎనిమిది రోజులకే దిగిపోయారు.

యడ్యూరప్ప, కుమారస్వామి (2) : 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 104, కాంగ్రెస్​ 80, జేడీ(ఎస్​) 37 సీట్లు గెలుచుకున్నాయి.  ఎవరికీ మేజిక్​ ఫిగర్​ 113 రాకపోవడంతో, పెద్ద పార్టీ అయిన బీజేపీని గవర్నర్​ ఆహ్వానించారు. యడ్యూరప్ప సీఎంగా ప్రమాణం చేసినా, అసెంబ్లీలో బలనిరూపణ కష్టమని తేలిపోవడంతో ఆరు రోజులకే రిజైన్​ చేశారు.  ఇదే అవకాశంగా జనతాదళ్​ (ఎస్​) మరోసారి కాంగ్రెస్​తో పవర్​ గేమ్​ ఆడింది. రెండో పెద్ద పార్టీ అయిన కాంగ్రెస్​ సపోర్ట్​ తీసుకుని, కుమారస్వామి సీఎం అయ్యారు. ఈ పొత్తు కొద్దికాలమే సాగింది. 14 నెలల తర్వాత కాంగ్రెస్ నుంచి 17మంది ఫిరాయించడంతో కుమారస్వామి తప్పుకున్నారు. మెజారిటీకి సరిపడా బలం బీజేపీ దగ్గర ఉండడంతో యడ్యూరప్ప ప్రభుత్వం ఏర్పాటు చేశారు. ఎన్నికల్లో థర్డ్​ ప్లేస్​లో నిలుచున్నా… రెండు సార్లు ప్రభుత్వాన్ని ఏర్పరచిన రికార్డు జనతా దళ్​ (ఎస్​)కి ఉంది. రెండుసార్లు పవర్​ షేరింగ్​ అగ్రిమెంట్​ని పట్టించుకోని రికార్డుకూడా ఆ పార్టీదే!