పుణె: మహారాష్ట్రలోని సతారా జిల్లాలో గల కొలెవాడి గ్రామసభ.. భవిష్యత్తులో జరగబోయే ఎన్నికలను బ్యాలెట్ పేపర్లతోనే నిర్వహించాలని తీర్మానించింది. దీంతో మహారాష్ట్రలో ఈవీఎంలకు వ్యతిరేకంగా తీర్మానాన్ని ఆమోదించిన రెండో గ్రామంగా కొలెవాడి నిలిచింది. ఈ గ్రామం గతంలో సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, మాజీ సీఎం పృథ్వీరాజ్ చవాన్ ప్రాతినిధ్యం వహించిన కరద్(దక్షిణ) అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది.
నవంబర్‌లో జరిగిన ఎన్నికల్లో ఆయన బీజేపీ అభ్యర్థి అతుల్ భోసలేపై 39,355 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ల ద్వారా పోలైన ఓట్లపై కొలెవాడి వాసులు అనుమానాలు వ్యక్తంచేయడంతో ఈ తీర్మానాన్ని ఆమోదించారు. మల్షిరాస్ నియోజకవర్గంలోని మర్కడ్‌వాడి గ్రామస్తులు ఈవీఎంల విశ్వసనీయతపై అనుమానం వ్యక్తంచేస్తూ బ్యాలెట్ పేపర్లను ఉపయోగించి మాక్ ‘రీ-పోలింగ్’ నిర్వహించడానికి ప్రయత్నించిన కొద్దిరోజుల తర్వాత ఈ తీర్మానాన్ని ఆమోదించారు.
ALSO READ : EVMలు మాకొద్దు .. గ్రామస్తుల తీర్మానం.. రాష్ట్రంలో రెండో గ్రామం
వచ్చే ఎన్నికలను ఈవీఎంలతో కాకుండా బ్యాలెట్ పేపర్లతో నిర్వహించాలని డిమాండ్ చేసిన గ్రామస్తుల మనోభావాలను గౌరవిస్తూ ఈ నెల 2న గ్రామసభలో తీర్మానం చేశామని సర్పంచ్ రత్నమాల పాటిల్ భర్త శంకర్‌రావు పాటిల్ తెలిపారు.