మహారాష్ట్ర సీఎంపై డిసెంబర్ 4న క్లారిటీ

మహారాష్ట్ర సీఎంపై డిసెంబర్ 4న  క్లారిటీ
  • 4న బీజేపీ శాసనసభాపక్ష సమావేశం 
  • అబ్జర్వర్లుగా నిర్మలా సీతారామన్, విజయ్ రూపానీ 

ముంబై: మహారాష్ట్ర సీఎం ఎవరో బుధవారం తేలిపోనుంది. అదేరోజు బీజేపీ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. మీటింగ్ తర్వాత పార్టీ శాసనసభాపక్ష నేతను బీజేపీ ప్రకటించనుంది. ‘‘బుధవారం ముంబైలో బీజేపీ శాసనసభాపక్ష సమావేశం జరుగుతుంది. దీనికి అబ్జర్వర్లుగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీని పార్టీ హైకమాండ్ నియమించింది. సమావేశంలో పార్టీ ఎమ్మెల్యేలందరూ కలిసి శాసనసభాపక్ష నేతను ఎన్నుకుంటారు. ఆ తర్వాత ఆయన పేరును అబ్జర్వర్లు ప్రకటిస్తారు. గురువారం అతను ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారు” అని బీజేపీ వర్గాలు సోమవారం తెలిపాయి. సీఎం ప్రమాణస్వీకారం ఈ నెల 5న ముంబైలోని ఆజాద్ మైదాన్ లో ఉంటుందని బీజేపీ ఇప్పటికే ప్రకటించింది. కాగా, ప్రభుత్వ ఏర్పాటుపై బీజేపీ హైకమాండ్ తో చర్చించేందుకు ఎన్సీపీ లీడర్ అజిత్ పవార్ ఢిల్లీకి వెళ్లారు. మరోవైపు శివసేన చీఫ్, ఆపద్ధర్మ సీఎం ఏక్ నాథ్ షిండే థానేలో ఉన్నారు. ఆయన ఇంకా ముంబైకి రాలేదు. కేబినెట్ పదవులపై చర్చించేందుకు సోమవారం మహాయుతి కూటమి మీటింగ్ ఉండగా, అనారోగ్యంతో షిండే హాజరుకాలేదని వార్తలు వచ్చాయి. అయితే అలాంటి మీటింగ్ ఏమీ లేదని, దానికోసం తామే వేచి చూస్తున్నామని శివసేన లీడర్లు పేర్కొన్నారు. 

డిప్యూటీ సీఎం రేసులో లేను: శ్రీకాంత్ షిండే 

డిప్యూటీ సీఎం పదవి రేసులో తాను లేనని శివసేన చీఫ్ ఏక్ నాథ్ షిండే కొడుకు, ఎంపీ శ్రీకాంత్ షిండే స్పష్టం చేశారు. ‘‘నేను డిప్యూటీ సీఎం అవుతానంటూ వార్తలు వస్తున్నాయి. కానీ అది నిజం కాదు. లోక్ సభ ఎన్నికల తర్వాతే కేంద్రమంత్రి అయ్యే అవకాశం నాకు వచ్చింది. కానీ నేను తిరస్కరించాను. పార్టీ బలోపేతంపైనే దృష్టి పెట్టాను. నాకు పదవులపై నాకు ఆశ లేదు” అని ఆయన ట్వీట్​ చేశారు.