ఆసిఫాబాద్, వెలుగు: తెలంగాణ– మహారాష్ట్ర వివాదాస్పద గ్రామాల ప్రజలు బుధవారం మహారాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో మరోసారి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలంలోని 12 గ్రామాల ప్రజలు అన్ని ఎన్నికల్లో ఇరు రాష్ట్రాల్లో ప్రతిసారి ఓటు వేస్తుంటారు. మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లా రాజూరా నియోజకవర్గ పరిధిలో ఆయా గ్రామాల ఓటర్లు పరందోళి, నోకేవాడ, బోలపటర్, అంతపూర్ ల్లోని పోలింగ్ బూత్ ల్లో ఓటు వేశారు.
తెలంగాణ –- మహారాష్ట్ర సరిహద్దుల్లోని పరందోళి, కోట, లెండిజాల, శంకర్ లోద్ది, ముక్కుద్దాంగూడ, అంతపూర్, ఇంద్రనగర్, ఇసాపూర్, నారాయణ గూడ, బోలపటర్, గౌరి, లెండిగూడ, మహారాజ్ గూడ గ్రామాల్లో 3,597 మంది ఓటర్లున్నారు. ఎంపీ ఎన్నికల్లో ఇక్కడి ఓటర్లు రెండుగా చీలిపోయి కొంతమంది తెలంగాణ, మరికొంత మంది మహారాష్ట్రకు ఓటు వేశారు. తెలంగాణలో గతేడాది నవంబర్ 30న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయా గ్రామాల ప్రజలు ఆసిఫాబాద్ అసెంబ్లీ స్థానంలో ఓటు వేశారు. ఇలా ఆయా గ్రామాల ప్రజలు రెండు రాష్ట్రాల ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకుంటూ రెండు రాష్ట్రాల నుంచి లబ్ధి పొందుతున్నారు.