చరిత్ర చెప్పని ఫ్రీడం ఫైటర్ అరవింద్ ఘోష్

చరిత్ర చెప్పని ఫ్రీడం ఫైటర్ అరవింద్ ఘోష్

బానిస సంకెళ్లు తెంచుకొని, దేశ ప్రజలు స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్న ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవంతోపాటు మరో ప్రత్యేకత ఉంది. ఇయ్యాల మహర్షి అరవింద ఘోష్​జన్మదినం కూడా. జాతీయ మహాపురుషులంటే గాంధీ, నెహ్రూల గురించే చెప్పిన మన చరిత్ర పుటలు. ఎంతో మందికి స్ఫూర్తిదాయకుడు, దార్శనికుడైన అరవింద ఘోష్​జీవితం ఎక్కడా పెద్దగ కనిపించనియ్యలేదు. స్వాతంత్య్రోద్యమంలో మొదట ఆయన అతివాది. తరువాత విప్లవకారుడు. ఆపై భారతీయ తత్వశాస్త్రంలోని పలు ప్రాపంచిక దృక్పథాలను పునర్నిర్వచించడంపై తన శక్తియుక్తులను మళ్లించి, చివరకు మహర్షిగా నిర్యాణం పొందారు.  
అరవింద్​ఘోష్​15 ఆగస్టు1872లో బెంగాల్​ప్రాంతంలోని ఒక సంపన్న కుటుంబంలో జన్మించారు. తల్లి స్వర్ణలతాదేవి, తండ్రి కృష్ణధన్​ఘోష్​ ప్రముఖ డాక్టర్. తన పిల్లలకు భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలు, భాషా సాహిత్యాలు, ఇతిహాస గ్రంథాల వాసన కూడా తగలవద్దని ఏడేండ్ల  అరవింద ఘోష్​సహా తన ముగ్గురు కొడుకులను ఇంగ్లాండు పంపించి, ఇంగ్లిష్​ విద్యాభ్యాసం చేయించారు. కొంత కాలం మాంచెస్టర్లో మరికొంత కాలం లండన్​లో ఉంచి ఉన్నత చదువులు చెప్పించి ఇండియన్​ సివిల్​సర్వీస్​ కోర్సులో చేర్పించాడు. ఐసీఎస్​పరీక్షల్లో ఉన్నత శ్రేణిలో పాసైన అరవింద ఘోష్​ సర్వీస్​లో చేరడం ఇష్టం లేక గుర్రపు స్వారీకి ఆలస్యంగా వెళ్లి పోటీ నుంచి తప్పుకున్నాడు. ఇంగ్లిష్, లాటిన్​, ఫ్రెంచ్, ఇటాలియన్​ భాషల్లో గొప్ప పాండిత్యం సంపాదించాడు. వివిధ భాషా గ్రంథాలు స్టడీ చేస్తున్నప్పుడు భారతీయ తత్వశాస్త్రం, సాహిత్యం, సంస్కృతికి సంబంధించిన కొంత సమాచారం ఆయన దృష్టిని ఆకర్షించింది. బ్రిటీష్​ వలస పాలన నుంచి విముక్తి కోసం జరుగుతున్న స్వాతంత్ర్య పోరాట వార్తలు వస్తుండటంతో భారత దేశానికి చేరుకోవాలనే ఆకాంక్ష ఆయనలో చెలరేగింది.

బెంగాల్​ విభజన..

జాతీయ కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని మితవాదులకు కూడా బ్రిటిష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రభుత్వం మీద నమ్మకం పోగొట్టిన ఘటన బెంగాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విభజన. దేశంలోని యువతరం తీవ్ర జాతీయవాదం వైపు చూసేటట్టు చేసిన సంఘటన కూడా అదే. 1906లో బరోడా నుంచి బెంగాల్​వెళ్లిన అరవింద్​ఘోష్​ నేషనల్​కాలేజ్​ఆఫ్​కలకత్తాలో ప్రిన్సిపల్​గా చేరారు. బ్రిటన్​వలసవాద సామ్రాజ్యానికి వ్యతిరేకంగా ఇంగ్లాండు, ఫ్రెంచ్, ఇటలీ, అమెరికాల్లో జరిగిన తిరుగుబాట్లు విప్లవ చరిత్రల అధ్యయనంతో ప్రభావితుడై బెంగాల్​ప్రెసిడెన్సీలో రహస్య విప్లవకారులను ప్రేరేపించారు. ‘వందేమాతరం’ పత్రికా సంపాదకిడిగా సర్క్యులేషన్​ దేశ నలుమూలలకు విస్తరింపజేశారు. వందేమాతరం పత్రిక దేశ వ్యాప్తంగా స్వాతంత్ర్య సమరయోధులను తట్టి లేపింది. అరవింద్​ ఘోష్​  తమ్ముడు వీరేంద్ర ఘోష్​ తిరుగుబాటు విప్లవ గ్రూపుల్లో కీలక బాధ్యతలు నిర్వహిస్తూ రహస్య సమావేశాలు జరుపుతూ ఆయుధ సామగ్రిని సమకూర్చేవారు. పైకి మాత్రం ‘అనుశీలన సమితి’ పేరుతో యువజన క్లబ్​లు ఏర్పాటు చేశారు. ‘అనుశీలన సమితి’ తిరుగుబాటు విప్లవ సంస్థలకు ముసుగు సంస్థ అని బ్రిటీష్ పాలకులకు అనుమానం వచ్చింది. దీంతో అలీపూర్​ కుట్ర కేసుకు ఇది ప్రాతిపదిక అయింది. 1915 డిఫెన్స్​యాక్ట్​ కింద మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో అనుశీలన సమితితో పాటుగా పంజాబ్​లో తిరుగుబాటు విప్లవకారుల సంస్థ అయిన గదర్​పార్టీపై ప్రభుత్వం ఆంక్షలు పెట్టింది. మొదటి ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత కూడా 1915 డిఫెన్స్​చట్టాన్ని మరింత కఠినంగా కొనసాగించింది. ఇదే ‘రౌలత్’ చట్టంగా ప్రసిద్ధి చెందింది. దీనిని ధిక్కరించి, మద్రాస్​లో జరిగి న భారీ ఊరేగింపును అడ్డుకున్న బ్రిటీష్ ​సైనికుల తుపాకులకు తన చాతిని ఎదురొడ్డిన ప్రకాశం పంతులుకు ఆంధ్రకేసరి అనే బిరుదు వచ్చింది. అరవింద్​ఘోష్​ ఓవైపు విప్లవ కారులతో సంబంధాలు కొనసాగిస్తూనే 1906లో దాదాబాయి నౌరోజీ అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్​ మహాసభలో పాల్గొన్నారు. భవిష్యత్ ​కార్యాచరణ ఉపసంఘం సభ్యుడి కార్యప్రణాళిక రూపొందించారు. 1.స్వరాజ్యం, 2.స్వదేశీ, 3.బహిష్కరణ, 4.జాతీయ విద్య కార్యాచరణ ద్వారా ప్రజలను సమీకరించి సామ దాన దండోపాయాలతో బ్రిటీష్​ పాలకులను తరిమికొట్టాలని తీర్మానించారు.1905లో లార్డ్​కర్జన్​ బెంగాల్ ​విభజనకు అధికారికంగా ప్రకటన విడుదలచేసిన తక్షణం ప్రజలు తిరుగుబాటు చేసి ప్రభుత్వాన్ని స్తంభింపజేశారు. అరవింద ఘోష్​ ఆ ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్నారు.1907–08 సంవత్సరాల్లో ఆయన పర్యటించి పుణె, -బొంబాయి, -బరోడాలో మద్దతు కూడగట్టారు. 

మాతృభూమిపై మమకారంతో..

ఆ సమయంలో లండన్​కు వచ్చిన బరోడా మహరాజ్​గ్వైకాడ్​ను కలువడం, బరోడా సంస్థానంలో ఉన్నత అధికారిగా చేరమని మహారాజు కోరడంతో అరవింద్​ ఘోష్​1893 నుంచి బరోడా సంస్థాన పరిపాలన అధికారిగా 1906 వరకు పనిచేశారు. బరోడాలో ఉన్నప్పుడే సంస్కృత భాషను ఇతర భారతీయ భాషలను నేర్చుకొని ఇతిహాస గ్రంథాలను, దేశ సాంస్కృతిక మూలాలను, చరిత్రను, తత్వశాస్త్రాన్ని అధ్యయనం చేయడం ప్రారంభించారు. బాలగంగాధర తిలక్, సిస్టర్ నివేదిత లాంటి ఫ్రీడం ఫైటర్స్​తో, విప్లవ గ్రూపులతో సంబం ధాలు కొనసాగించారు. తన చెల్లెలు, సోదరుడిని చూసి వస్తాననే నెపంతో బెంగాల్​కు వెళ్తూ తిరుగుబాటు విప్లవ గ్రూపులను ప్రోత్సహించి, సహాయ సహకారాలు అందించారు. 1901లో భూపాల్​ చంద్ర బోస్​ కుమార్తె మృనాళిని దేవీని పెండ్లి చేసుకున్నాడు.

అలీపూర్​ జైలు జీవితం..

కింగ్స్​ఫోర్డు అనే జడ్జి స్వాతంత్ర్య పోరాట యోధులపై కక్షగట్టి క్రూరమైన శిక్షలు విధిస్తున్నందున విప్లవ వీరులు కుదీరాం బోస్​– ప్రఫుల్ల చాకీలు 1908లో ఆ జడ్జిని చంపాలనుకున్నారు. అతను వెళ్లే గుర్రపు బండిపై బాంబు వేయాలనుకొని విసిరిన బాంబు పొరపాటున వేరే బండిపై పడింది. అందులో ప్రయాణిస్తున్న ఇద్దరు బ్రిటీష్​మహిళలు మరణించారు. ఆ కేసులో అరవింద్ ​ఘోష్​ను అరెస్ట్​ చేసి జైలులో నిర్భందించారు. అయితే ప్రధాన సాక్షి హత్యకు గురికావడంతో ఘోష్​ను విడుదల చేశారు. అలీపూర్​ కుట్ర కేసు గా ఇది ప్రసిద్ధికెక్కింది. జైలులో ఉన్న కాలంలో ఆయన ఆలోచనల్లో మార్పు వచ్చింది. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి పడింది. విడుదలైన తర్వాత ‘కర్మయోగి’ ఇంగ్లిషులో, ‘ధర్మ’ బెంగాలీలో రెండు రచనలు ప్రచురించారు. ఆ తర్వాత ధ్యాన యోగం దిశగా ప్రయాణం మొదలైంది. ఆధ్యాత్మిక అనుభూతి ధ్యాన యోగం వైపు సాగింది.

పాండిచ్చేరిలో..

1910లో అరవింద ఘోష్​ యోగ సాధనకు పాండిచ్చేరికి వెళ్లారు. అక్కడికి యోగసాధకుల సంఖ్య క్రమంగా పెరిగింది. 1926లో అరవింద ఆశ్రమాన్ని స్థాపించాడు. కర్మయోగీ-, సావిత్రి-, ధర్మ లాంటి అనేక గ్రంథాలు రాసి ప్రచురించారు. ఇంగ్లిష్​ పద్యకావ్య రచనలో అగ్రగణ్యులు ఆయన.1950 డిసెంబర్​5న ఆయన నిర్యాణం చెందారు. 1947లో జరిగిన దేశవిభజన ప్రతిపాదనను ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. భవిష్యత్​లో భారత్–పాకిస్తాన్(ఇప్పుటి బంగ్లాదేశ్) కలి సి అఖండ భారత్​ ఏర్పడుతుందని యోగ దృష్టితో చెప్పారు. ఏడేండ్ల పసితనంలో అరవింద ఘోష్​ను ఇంగ్లాండు పంపించి 14 ఏండ్లు ఇంగ్లిష్​ చదువులు చదివి తెల్లదొర వలె తన కొడుకు ఉండాలని తండ్రి భావిస్తే ఆయన చివరకు విద్యావేత్తగా, స్వాతంత్ర్య సమరయోధుడిగా, రచయితగా, కవిగా, ఆధ్యాత్మికవేత్తగా, యోగీశ్వరుడిగా మారిపోవడం దైవనిర్ణయమే.