Mahasakthi Review: అమ్మవారిగా నయనతార.. విలన్‌గా రెజీనా.. భారీ అంచనాలతో వచ్చిన 'మహాశక్తి' ఎలా ఉందంటే?

Mahasakthi Review: అమ్మవారిగా నయనతార.. విలన్‌గా రెజీనా.. భారీ అంచనాలతో వచ్చిన 'మహాశక్తి' ఎలా ఉందంటే?

లేడీ సూపర్ స్టార్ నయనతార మరోసారి అమ్మవారి అవతారంలో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆమెతో పాటు రెజీనా కసాండ్రా కూడా పవర్‌ఫుల్ పాత్రలో కనిపించడంతో 'మహాశక్తి' సినిమాపై మొదటి నుంచే ఆసక్తి నెలకొంది. 2020లో విడుదలై మంచి ఆదరణ పొందిన 'మూకుతి అమ్మన్'కు సీక్వెల్‌గా ఈ చిత్రాన్ని రూపొందించారు. అయితే ఈసారి దర్శకుడి బాధ్యతలను సుందర్ సి చేపట్టారు. భారీ బడ్జెట్, స్టార్ క్యాస్టింగ్, ఆసక్తికరమైన కథాంశంతో దీపావళి కానుకగా ఈ రోజు( నవంబర్ 6, 2026 ) థియేటర్లలోకి ముందుకు వచ్చింది . మరిఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకుందా? నయనతార, రెజీనా మధ్య పోరు ఎలా సాగింది? తెలుసుకుందాం...

కథేంటంటే?

శక్తి (నయనతార) ఓ సాధారణ మహిళా పోలీస్ కానిస్టేబుల్. బాలమ్మ (ఊర్వశి) దగ్గర పెరిగిన ఆమెను మైలాంచి అనే గ్రామానికి సంబంధించిన ఓ వింత కల నిరంతరం వెంటాడుతుంటుంది. ఆ కలలో కనిపించే వ్యక్తులు తనను ఆ గ్రామానికి రమ్మని పిలుస్తుంటారు. ఈ క్రమంలో ప్రమోషన్‌తో పాటు మైలాంచి గ్రామానికి బదిలీ కావడంతో శక్తి అక్కడికి వెళుతుంది. అక్కడ ఆమెకు భైరై (రెజీనా కసాండ్రా) రూపంలో ఓ ప్రమాదకరమైన శక్తి ఎదురవుతుంది. అసలు శక్తికి ఆ గ్రామంతో ఉన్న సంబంధం ఏమిటి? భైరై ఎవరు? దాదాపు రెండు వేల సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనలకు ఇప్పటి కథకు ఉన్న లింకేంటి? ఈ ఇద్దరి మధ్య జరిగే పోరాటంలో చివరకు ఎవరు గెలిచారన్నదే మిగతా కథ.

సినిమా ఎలా ఉందంటే?

అమ్మవారి నేపథ్యంలో సాగే కథలకు ప్రేక్షకుల్లో ఎప్పుడూ ప్రత్యేకమైన ఆదరణ ఉంటుంది. ముఖ్యంగా గత జన్మలు, పగలు, ప్రతీకారాలు, దుష్టశక్తుల నేపథ్యంలో కథను నడిపించడం ఆసక్తికరమైన అంశమే. ఈ సినిమాలోనూ అలాంటి పాయింట్‌ను తీసుకున్నారు. మొదటి భాగంలో శక్తికి వచ్చే కలలు, మైలాంచి గ్రామానికి ఆమె ప్రయాణం, అక్కడ ఎదురయ్యే పరిస్థితులతో కథపై ఆసక్తి పెరుగుతుంది. గత కాలానికి, ప్రస్తుతానికి మధ్య సంబంధాన్ని చూపించే ప్రయత్నం బాగుంది. కొన్ని సన్నివేశాలు 'మగధీర'ను గుర్తు చేస్తాయి.

అయితే అసలు సమస్య ద్వితీయార్థంలోనే మొదలవుతుంది. మొదటి భాగంలో ఏర్పడిన ఆసక్తిని రెండో భాగంలో కొనసాగించడంలో దర్శకుడు పూర్తిగా తడబడ్డారు. కథనం నెమ్మదించడం, పాతకాలపు స్క్రీన్‌ప్లే, అవసరానికి మించిన కామెడీ ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తాయి. ముఖ్యంగా యోగిబాబుతో వచ్చే సుదీర్ఘ కామెడీ ట్రాక్ ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. యుద్ధ సన్నివేశాలు కూడా ఆశించిన స్థాయిలో లేవు. భారీ బడ్జెట్‌తో రూపొందించినట్లు చెప్పుకున్నప్పటికీ విజువల్ ఎఫెక్ట్స్ నాణ్యత ప్రేక్షకులను నిరాశపరుస్తుంది. కొన్ని సన్నివేశాల్లో గ్రాఫిక్స్, ఏఐ ఆధారిత విజువల్స్ కృత్రిమంగా కనిపిస్తాయి.

 ఎవరెవరు ఎలా చేశారంటే?

నయనతార శక్తి పాత్రలో తనదైన నటనతో ఆకట్టుకున్నారు. సాధారణ కానిస్టేబుల్‌గా, అమ్మవారి శక్తివంతమైన అవతారంలో కనిపిస్తూ మెప్పించారు. అయితే ఆమె పాత్రకు మరింత బలమైన సన్నివేశాలు ఉంటే బాగుండేది. రెజీనా కసాండ్రా విలన్‌గా మంచి నటన కనబరిచారు. ఈ ఇద్దరి మధ్య వచ్చే పోరాట సన్నివేశాలు సినిమాకు ప్రధాన ఆకర్షణ. దునియా విజయ్, సునీల్, రామచంద్ర రాజు వంటి నటులకు సరైన ప్రాధాన్యత దక్కలేదు. ఊర్వశి, కుష్బూ, స్నేహ తమ పాత్రల పరిధిలో నటించారు. యోగిబాబు కామెడీ మాత్రం పెద్దగా వర్కవుట్ కాలేదు.

టెక్నికల్‌గా ఎలా ఉందంటే?

హిప్‌హాప్ తమిజా అందించిన పాటలు, నేపథ్య సంగీతం ఆశించిన స్థాయిలో లేవు. కొన్ని చోట్ల బీజీఎం మరీ ఎక్కువగా అనిపిస్తుంది. గోపీ అమర్నాథ్ సినిమాటోగ్రఫీ కూడా కథకు అవసరమైన స్థాయిలో ప్రభావం చూపలేకపోయింది. ముఖ్యంగా గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ సినిమాకు పెద్ద మైనస్‌గా నిలిచాయి. ఎడిటింగ్ విషయంలోనూ మరింత శ్రద్ధ తీసుకోవాల్సింది. రెండున్నర గంటల లోపు నిడివి ఉన్నప్పటికీ సినిమా చాలా సుదీర్ఘంగా సాగుతున్న అనుభూతి కలుగుతుంది.

మొత్తంగా చూస్తే 'మహాశక్తి'లో నయనతార, రెజీనా కసాండ్రాల నటన, ఆసక్తికరమైన కథా నేపథ్యం కొంతవరకు మెప్పిస్తాయి. కానీ బలహీనమైన స్క్రీన్‌ప్లే, పేలవమైన గ్రాఫిక్స్, బోరింగ్ సెకండాఫ్ సినిమాను దెబ్బతీశాయి. భారీ అంచనాలతో వెళ్లిన ప్రేక్షకులకు నిరాశ తప్పదు. అమ్మవారి కథలు, భక్తి నేపథ్యంలో వచ్చే సినిమాలను ఇష్టపడేవారు కూడా పెద్దగా ఆశలు పెట్టుకోకుండా చూడొచ్చు. ఆసక్తికరమైన పాయింట్‌ను సరైన విధంగా తెరపైకి తీసుకురావడంలో 'మహాశక్తి' కాస్త విఫలమైందని చెప్పొచ్చు..