సగటున ప్రతిరోజు 50 వేల మందికిపైగా దర్శనం...
ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి తరలివస్తున్న భక్తులు
కరీంనగర్, వెలుగు: కరీంనగర్‌లోని మహాశక్తి ఆలయానికి గతేడాదితో పోలిస్తే భక్తుల తాకిడి భారీగా పెరిగింది. ఒకవైపు సామాన్య జనం, మరోవైపు భవానీ దీక్షాపరుల కోలాహలం, ఇంకోవైపు దాండియా కార్యక్రమాలతో కరీంనగర్ మహాశక్తి ఆలయం కన్నులపండువగా మారింది. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ప్రతిరోజు సగటున 50 వేల మందికిపైగా భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నట్లు ఆలయ నిర్వాహకులు వెల్లడించారు. శ్రీదేవి శరన్నవరాత్రుల్లో భాగంగా రెండోరోజైన శుక్రవారం శ్రీగాయత్రీ దేవి(బ్రహ్మచారిణి)గా భక్తులకు దర్శనమిచ్చారు.
ఆలయానికి విచ్చేసే వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. మహాశక్తి అమ్మవారి ఆలయ ప్రదాత కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ స్వయంగా ఎప్పటికప్పుడు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. భవానీ దీక్ష చేపట్టిన బండి సంజయ్ ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు ఆలయంలోనే గడుపుతున్నారు.
భవానీ దీక్షలో 20 వేల మంది..
గతేడాదితో పోలిస్తే కనీవినీ ఎరగని రీతిలో వేలాది మంది భక్తులు భవానీ దీక్ష చేపట్టారు. మహాశక్తి ఆలయ సన్నిధిలోనే దాదాపు 20 వేల మంది భక్తులు భవానీ దీక్ష చేపట్టినట్లు ఆలయ పూజారులు వెల్లడించారు. ఆలయ నిర్వాహకులు వీరందరికీ మధ్యాహ్నం భోజనం, సాయంత్రం అల్పాహారం అందిస్తున్నారు. రాత్రి 9 గంటల నుండి అర్ధరాత్రి వరకు అమ్మవారి సన్నిధిలో దాండియా ఆడుతూ సందడి చేస్తున్నారు.