తిరుమలలో మహాశాంతి యాగం

తిరుమలలో మహాశాంతి యాగం
  • లడ్డూ కల్తీ దోషానికి ప్రాయశ్చిత్తంగానే: ఈవోప్రమాణం చేసేందుకు 
  • వచ్చిన టీటీడీ మాజీ చైర్మన్ భూమన అడ్డుకున్న పోలీసులు

హైదరాబాద్, వెలుగు: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ నేపథ్యంలో శ్రీవారి ఆలయంలో సోమవారం ఉదయం మహాశాంతి యాగం నిర్వహించారు.   ఉదయం 6 –10 గంటల వరకు ఆలయంలోని యాగశాలలో ఆగమ పండితులు, అర్చకులు ఈ యాగం చేశారు. 

పంచగవ్యాలతో శ్రీవారి ఆలయంతో పాటు వకుళమాత పోటు, లడ్డు పోటు, బూందీ పోటు, ప్రసాద విక్రయశాలల్లో సంప్రోక్షణ చేశారు. శ్రీవారి లడ్డు విషయంలో జరిగిన దోషాలకు ప్రాయశ్చిత్తంగా హోమం చేసినట్టు ఈవో శ్యామల రావు తెలిపారు. 

లడ్డు ప్రసాద విషయంలో ఎవరికి ఎలాంటి అనుమానాలు వద్దని స్పష్టం చేశారు. నెయ్యి మార్చిన తరువాత ప్రసాదాలు తయారు చేశామని ప్రకటించారు. కాగా, లడ్డు కల్తీ అంశంపై ప్రమాణం చేస్తానని సోమవారం టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తిరుమలకు చేరుకున్నారు. 

పుష్కరిణిలో స్నానం చేసి అఖిలాండం వద్ద కొబ్బరి కాయ కొట్టి హారతి ఇచ్చారు. అనంతరం ప్రమాణం చేస్తుండగా లా అండ్ ఆర్డర్ కు ఇబ్బందులు కలుగుతాయని పోలీసులు అడ్డుకోవడంతో ప్రమాణం చేయకుండానే తిరుమల నుంచి భూమన వెళ్లిపోయారు.