దేవుళ్లలో మహాదేవుడు శివుడు

దేవుళ్లలో  మహాదేవుడు శివుడు

‘తత్పురుషాయ విద్మహే మహా దేవాయ ధీమహి తన్నో  రుద్రః ప్రచోదయాత్‌’ అంటూ శివభక్తులు స్మరించే  పుణ్యదినం మహా శివరాత్రి.   దేవుళ్లలో  మహాదేవుడు అనే పేరు శివుడికి మాత్రమే ఉంది.  అలాంటి శివుడు భోళాశంకరుడు,  అభయంకరుడు,  లయకారుడు,  అమృత స్వరూపుడు,  మృత్యుంజయుడు.  

ఆ దేవదేవుణ్ణి అర్చించే,  ధ్యానించే  గొప్ప పర్వదినం మహా శివరాత్రి. 'యథావ్రతేషు సర్వేషు శివరాత్రి  వ్రతంపరమ్‌’ వ్రతాలన్నింటిలో 'శివరాత్రి వ్రతం' గొప్పది అని శివ పురాణం చెప్తున్నది.  విష్ణువును  పగలు ఉపాసించాలి, శివుణ్ణి రాత్రివేళ ఉపాసించాలి.   'సంస్కృతంలో  'అహోరాత్ర'మనే  పదం ఉంది.   అహః అంటే పగలు,  రాత్రం అంటే రాత్రి కాబట్టి అహోరాత్రమనే  పదానికి పగలు, రాత్రి కలసిన 'ఒకరోజు' అని అర్థం.  

ఈ అహోరాత్రి పదంలో ఉన్న 'అహః' అనే పదానికే మళ్లీ 'ఒకరోజు' అనే అర్థం కూడా ఉంది.  ఏకాహం,  సప్తాహం  అనే  వాటికి  ఒకరోజు,  ఏడు రోజులు అని అర్థం కదా!  ఇలా రెండర్థాలూ ఉంటే  శ్రీహరికున్న వేయినామాల్లో 'అహః' అనే పేరు ఒకటి వేరుగా  కన్పిస్తుంది.  అంటే  శ్రీహరి 'పగటి దైవం' అని దీని అర్థంగా భావించాలి.  ఇదేమిటి?  ఎక్కడా వినలేదే  ఇలాంటి భావాన్ని? అన్పిస్తుంది  మనకి.  శ్రీహరి  స్థితికారకుడు -అంటే -రక్షణ  చేసేవాడు.  ప్రాణి  సమూహం అంతా  మేల్కొని ఉన్నప్పుడు కదా రక్షణ  ఆవశ్యకత  కలిగేది.  ఆ  రక్షణని చేసే  దైవమైన శ్రీహరి పగటి దేవుడు.   పగలు, -రాత్రి కలిసినప్పుడే 'రోజు' అనేది అవుతోంది కాబట్టి  శివ కేశవులు ఉభయులూ ఒక్కటై కన్పించేదే జగత్తు అని అర్థం  చేసుకోవాలన్నమాట. శివభక్తులు భక్తి శ్రద్ధలతో శివోపాసన చేసే రోజు శివరాత్రి.  వైష్ణవులు అనంత చతుర్దశిని, ఏకాదశిని ఎంత పవిత్రంగా భావిస్తారో శైవులు మహాశివరాత్రిని అంతే పవిత్రంగా భావిస్తారు.

మహా శివరాత్రి నిర్ణయం

మాఘమాస 'బహుళ చతుర్దశి' నాడు శివరాత్రి జరుపుకొంటారు. శివరాత్రి పర్వం విషయంలో మన జ్యోతిష శాస్త్రాలు ప్రత్యేక నియమం విధించాయి. బహుళ చతుర్దశి తిథి అర్ధరాత్రి వరకు ఉండాలి. అర్ధరాత్రి సమయంలో బహుళ చతుర్దశి లేకుండా అమావాస్య  వస్తే, అంతకుముందు రోజే  శివరాత్రి జరుపుకోవాలి. రాత్రివేళలో  తప్పక చతుర్దశి ఉండాలి.  రాత్రివ్యాప్తి ఎక్కువ ఉన్న బహుళ చతుర్దశి -శివరాత్రి.   ఇది మాస శివరాత్రి.  సంవత్సరంలో మాఘమాస బహుళ చతుర్దశి నాడు జరిపేది మహా శివరాత్రి.  అన్ని పర్వాల్లో సాధారణంగా పగటివేళ జరుపుకుంటే ఇది రాత్రివేళ జరుపుకుంటారు. రాత్రివేళ సాధనచేసే  ప్రధాన పండుగ. కాబట్టి దానికి శివరాత్రి అనిపేరు. శివుని రాత్రి అని దీని అర్థం.

శివరాత్రి కథలు

లింగపురాణం ప్రకారం ఓరోజు శివపార్వతులు కైలాసంలో ముచ్చటిస్తూ ఉండగా, పార్వతి మహాదేవుణ్ణి ఇలా ప్రార్థించింది ''మహాదేవా! లోకంలో సర్వవ్రతాలలో ఉత్తమమైన వ్రతం ఏది? భక్తి ముక్తి ప్రదాయకమైన ఆ వ్రతాన్ని గురించి నాకు సవివరంగా తెలపమని కోరింది.  ''పార్వతీ! పరమ పవిత్రమైన, రహస్యమైన ఆ వ్రతాన్ని గురించి విను. భక్తి, ముక్తిదాయకమైన వ్రతాన్ని 'శివరాత్రి వ్రతం' అంటారు. దానిని మాఘకృష్ణ చతుర్దశి తిథినాడు ఆచరించాలి. తెలిసీ, తెలియనివారైనా సరే! ఈ వ్రతాచరణవల్ల శివసాయుజ్యం పొందుతారు. 

శివరాత్రి వ్రతం ఆచరించి శివసాయుజ్యం పొందిన ఓ నిషాదుని వృత్తాంతం నీకు చెప్తాను విను అని చెప్పడం మొదలుపెట్టాడు శివుడు. వేటతో జీవనం కొనసాగించే ఓ నిషాదుడు ఋణగ్రస్తుడై శివాలయ సమీపంలో బంధింపబడ్డాడు. అక్కడ జరిగిన శివ నామార్చనలు, వింటూ రాత్రి కాలం గడిపాడు. 

ప్రాతఃకాలంలో కొందరు శివభక్తులు అతని ఋణం చెల్లించి విడుదల చేయించారు. ఆ వేటగాడు శివరాత్రి రోజు మృగాలను సంహరించడానికి అరణ్యానికి వెళ్లగా ఒక్కప్రాణీ దొరకలేదు. దానితో అలసిపోగా సాయంత్రం అయ్యింది. అతను సింహ, శార్దూలాల భయానికి బిల్వవృక్షం పైకి ఎక్కాడు. తన దగ్గరున్న 'సొరకాయ' పాత్రలోని నీరు మాత్రమే పైకి తీసుకెళ్లాడు. మృగాలు దొరకనందున శివనింద చేస్తున్నాడు- అది శివనామోచ్చారణ అయ్యింది. ఆ సొరకాయలోని నీరు ఒలికిపోగా ఆచెట్టు కింద గుప్తంగా ఉన్న శివలింగంపై పడ్డాయి. అది అభిషేకం అయ్యింది. తెల్లవార్లు క్రూర జంతువుల భయానికి నిద్రపోలేదు. అది జాగరణ అయ్యింది. ఊరికే కూర్చోకుండా ఆ చెట్టు బిల్వపత్రాలను త్రుంచి కిందకు వేస్తున్నాడు అది బిల్వార్చనైంది.  ఇలా తెల్లవార్లు 'నిందార్చన' చేస్తూనే ఉన్నాడు. ఇలా మొదటి మూడు యామములు  గడిచేవరకు అతని పాపరాశి నాల్గవభాగం నశించింది.  ఆరోజు నుంచి అతడు అహింసావ్రతుడు, శివభక్తుడు అయ్యాడు. తెలియకుండా చేసిన శివభక్తితో వ్యాధుడిలో మార్పువస్తే, మరి తెలిసిచేసే మనలో తప్పక  మార్పువస్తుంది.

శివరాత్రి ఆచరణమహా శివరాత్రి రోజు ఉదయమే భక్తులంతా    స్నానాదులొనర్చి  ఇంట్లో  శివపూజలు చేసుకొని దేవాలయ సందర్శనం -చేస్తారు.  వీలైతే జ్యోతిర్లింగాన్ని,  ప్రసిద్ధ దేవాలయాన్నిగాని దర్శిస్తారు. సాయంత్రం ప్రదోషకాలం నుంచి రాత్రంతా  పూజలు,  శివనామ స్తోత్ర పారాయణం, అర్చనలు,  అర్ధరాత్రి  అభిషేకాలు, శివలీలా పారాయణం చేస్తూ జాగారం  చేస్తారు. ఉపవాసం ఉండడం  ఈ  పండుగ ప్రధాన నియమం. శివరాత్రి నాడు భస్మం  తయారుచేయడం,  ధారణ చేయడం ఆనవాయితీ,  శివరాత్రి నాడు జరిపే ఈ ఉపాసన..పాప విముక్తి కలిగించి శివసాయుజ్యం కలిగిస్తుందని శాస్త్రం తెలుపుతోంది. 

- డా. పి. భాస్కర యోగి,
ఆధ్యాత్మిక వేత్త