
ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా శుక్రవారం మహాశివరాత్రి వేడుకలు వైభవంగా జరిగాయి. ఆలయాలన్ని శివనామస్మరణతో మార్మోగాయి. ఉదయం నుంచే భక్తులు ఆ పరమశివుడికి అర్చనలు, అభిషేకాలు నిర్వహిస్తూ ఉపవాసం ఉండి జాగారం చేశారు. రాత్రి వివిధ ఆలయాల్లో నిర్వహించిన భజనలు, సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి. సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలోని పలు ఆలయాల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక పూజలు చేశారు.
మెదక్ జిల్లాలోని కొప్పోల్ ఉమాసంగమేశ్వర ఆలయంలో ఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి, జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ శివరాత్రి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లాలోని బీరంగూడ శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏడుపాయల వనదుర్గామాత, కొమురవెల్లి మల్లికార్జున స్వామి, ఝరాసంగం కేతకీ సంగమేశ్వర ఆలయాలు పండుగ శోభను సంతరించుకున్నాయి. - వెలుగు న్యూస్‌నెట్‌వర్క్