గ్రేటర్ పరిధిలోని శివాలయాలు మహా శివరాత్రికి ముస్తాబయ్యాయి. ప్రత్యేక లైటింగ్‌లో జిగేల్మంటున్నాయి. పండుగ షాపింగ్‌తో సోమవారం పూలు, పండ్ల మార్కెట్లు కిక్కిరిశాయి. ఉపవాస దీక్షలు చేపట్టేవారు ప్రత్యేకంగా పండ్లు కొనుక్కెళ్లారు.
జాతరకు కీసర రెడీ
కీసర, వెలుగు: కీసర గుట్ట జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని, అధికారులు సమన్వయంతో పని చేయాలని మేడ్చల్ కలెక్టర్ హరీశ్ సూచించారు. సోమవారం అన్ని శాఖల అధికారులు, పోలీసులతో సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఈఏడాది భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని, ప్రత్యేకంగా 350 ఆర్టీసీ బస్సులను నడుపుతున్నట్టు చెప్పారు. 1,500 మంది పోలీసులతో మూడు షిఫ్టుల్లో, మూడు సెక్టార్లలో 24 గంటల సెక్యూరిటీ ఉంటుందని పేర్కొన్నారు. గుట్టపై 101 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు, డ్రోన్లను కూడా వినియోగించుకోవాలని సూచించారు. ట్రాఫిక్ కంట్రోల్ కు 478 మంది సిబ్బందితో 13 చోట్ల పికెటింగ్ పెట్టినట్టు చెప్పారు.