
హనుమకొండ సిటీ, వెలుగు: హనుమకొండ రుద్రేశ్వర స్వామి వేయిస్థంభాల ఆలయంలో ఈనెల 25 నుంచి మార్చి 1 వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ కార్యనిర్వాహణాధికారి అనిల్ కుమార్, ప్రధాన అర్చకులు గంగు ఉపేంద్రశర్మ తెలిపారు. సోమవారం ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో వారు మాట్లాడారు. ఈనెల 25న చండీహోమం, సుప్రభాత సేవలతో మొదలై గణపతి పూజ, పుణ్యాహావచనం, అంకురార్పణ, రక్షాబంధనం, రుత్వికరణం, స్వామివారికి రుద్రాభిషేకాలు, 26న మహాశివరాత్రి సందర్భంగా శివకల్యాణం, రుద్రాభిషేకాలు, నిత్యవిధి హావనం, సాయంత్రం రుద్రేశ్వరీ,రుద్రేశ్వరస్వామి వారి కల్యాణం ఉంటుందన్నారు.
27న నాగవెల్లి, 28న అన్నపూజ, ప్రసాద వితరణ, మార్చి 1న స్వామి వారికి మహాన్యాస రుద్రాభిషేకాలు, ఆంజనేయస్వామి వారికి చందనోత్సవం, ఆకుపూజ, పూర్ణాహుతి, మహాపుష్పార్చనలు జరుగుతాయని తెలిపారు. శ్రీవారి కల్యాణంలో పాల్గొనే భక్తులు రూ.1,116, చండీహోమం పాల్గొనేవారు రూ.3,116, అన్నపూజకు రూ.5,116, లింగోద్భవకాల పూజకు రూ.12,116 చెల్లించి పూజల్లో పాల్గొనవచ్చునని చెప్పారు. ప్రెస్మీట్లో వ్యాపార వేత్త గట్టు మహేశ్‌బాబు, ఆలయ కమిటీ సభ్యులు కృష్ణమాచారి, అర్చకుడు ప్రణవ్ తదితరులు పాల్గొన్నారు.