ముక్కంటి.. నినుగంటి.. అంగరంగ వైభవంగా మహాశివరాత్రి ఉత్సవాలు

 ముక్కంటి.. నినుగంటి..  అంగరంగ వైభవంగా మహాశివరాత్రి ఉత్సవాలు
  • శివనామస్మరణతో మార్మోగిన శైవక్షేత్రాలు
  • ఆలయాలకు పోటెత్తిన భక్తజనం

కామారెడ్డి/నిజామాబాద్​/వెలుగు నెట్​వర్క్​ : ఉమ్మడి జిల్లాలో మహాశివరాత్రి వేడుకలు అంగరంగ వైభంగా జరిగాయి. బుధవారం తెల్లవారు జాము నుంచే భక్తులు శైవక్షేత్రాలకు పోటెత్తారు. హరహర మహాదేవ.. శంభో శంకర అన్న నినాదాలతో ఆలయాల ప్రాంగణాలు మార్మోగాయి. పార్వతిపరమేశ్వరుల కల్యాణం కనుల పండువగా జరిగింది. భక్తులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలు చేయడంతో పాటు కానుకలు, కోడె దూడలను ఇచ్చి మొక్కులు చెల్లించుకున్నారు.

భిక్కనూరులోని సిద్ధిరామేశ్వర ఆలయం,  రామారెడ్డి మండలం మద్దికుంట బుగ్గరామేశ్వర ఆలయం, తాడ్వాయి మండలం సంతాయిపేట భీమేశ్వర ఆలయం,  కృష్ణాజీవాడిలోని రాజరాజేశ్వర టెంపుల్, ఎల్లారెడ్డిలోని శివాలయం, బాన్సువాడ, బీర్కుర్​, దోమకొండ మండల కేంద్రంలోని మహాదేవుని ఆలయం, కామారెడ్డిలోని శివాలయం, హౌసింగ్​బోర్డు కాలనీలోని సంకష్ట హర గణపతి ఆలయం, అశోక్​నగర్ కాలనీలోని చండీ మంత్రాలయంలో భక్తులు అభిషేకాలు, అర్చనలు చేశారు.   రామారెడ్డి మండలం మద్దికుంటలోని బుగ్గరామేశ్వర ఆలయంలో  ప్రభుత్వ సలహాదారు షబ్బీర్​అలీ స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి  ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు.  నస్రుల్లాబాద్ మండలం దుర్కి శివారులోని  సోమలింగేశ్వర  దేవాలయంలో  బాన్సువాడ  ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్​ రెడ్డి   ప్రత్యేక పూజలు చేశారు. 

నిజామాబాద్​ జిల్లాలో.. 

జిల్లాలో మహా శివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరిగాయి.  తెల్లవారు జాము నుంచే ఆలయాలకు భక్తులు పోటెత్తారు. అభిషేకం, అర్చనలు, ప్రత్యేక పూజలు చేశారు. శివానామస్మరణతో ఆలయాల పరిసరాలను మార్మోగాయి. ఇందూర్ లోని నీలకంఠేశ్వర ఆలయం, ఉమామహేశ్వరాలయం, నందిగుట్ట శివాలయం భక్తులతో కిటకిటలాడాయి. శంభునిగుడి, నగరేశ్వర ఆలయాల్లో నిర్వహించిన  ప్రత్యేక పూజల్లో అర్బన్​ ఎమ్మెల్యే ధన్​పాల్​ సూర్యనారాయణ పాల్గొన్నారు. 

ఆర్మూర్ టౌన్​లోని సిద్ధులగుట్టపై ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్​రెడ్డి, సతీమణి రేవతిరెడ్డిలు ప్రత్యేక పూజలు చేశారు. బోధన్​లోని ఏకచక్రేశ్వరాలయం, డిచ్ పల్లి మల్లికార్జునస్వామి, ఎస్సారెస్పీ రామలింగేశ్వర ఆలయం, సిర్పూర్ శివాలయాన్ని విద్యుత్​ దీపాలతో సర్వాంగ సుందరంగా  ముస్తాబు చేశారు.  శివరాత్రి సందర్భంగా జిల్లాలో పండ్లు, పూల బిజినెస్​ జరిగే ప్రాంతాల్లో జనం రద్దీ కనిపించింది.

పండ్లు పంపిణీ చేసిన ముస్లిం యువకుడు

సదాశివనగర్​, వెలుగు :  రామారెడ్డి మండలంలోని రంగంపేట్​ గ్రామానికి చెందిన  షేక్​ పైజొద్దీన్​ ప్రతి ఇంటికి పండ్లు పంపిణీ చేసి ఆదర్శంగా నిలిచాడు.  గురువారం అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.  పలువురు పైజొద్దీన్​ను  అభినందించారు.