
- మహాశివరాత్రి సందర్భంగా శివాలయాలకు పోటెత్తిన భక్తులు
మహాశివరాత్రి సందర్భంగా బుధవారం ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా శివాలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. ‘ఓం నమో: శివాయ:.. హర హర మహాదేవ.. శంభో శంకర..’ అంటూ ఆలయ పరిసరాలు శివనామస్మరణతో మారుమోగాయి. భక్తులు తెల్లవారుజాము నుంచే శివుడికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. పలు ప్రాంతాల్లో జాతర్లు ప్రారంభమయ్యాయి. ఆలయాల వద్ద అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ఖమ్మం రూరల్ మండలం తీర్థాల జాతరకు భద్రాది కొత్తగూడెం, వరంగల్, మహబూబాబాద్ జిల్లాల నుంచి సుమారు లక్ష మంది భక్తులు వచ్చారు.
తన స్వగ్రామమైన వైరా మండలం స్నానాలలక్ష్మీపురంలోని పురాతన శివాలయంలో, మధిరలోని మృత్యుంజయ స్వామి ఆలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దంపతులతోపాటు ఆయా చోట్ల ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, పలువురు అధికారులు, వారివారి నియోజకవర్గాల్లోని పలు ఆలయాల్లో ఎమ్మెల్యేలు, జిల్లా నాయకులు పాల్గొని ప్రత్యేకపూజలు చేశారు. కాగా, ఎర్రుపాలెం మండల పరిధిలోని భీమవరం గ్రామానికి చెందిన వేమిరెడ్డి వెంకటరెడ్డి శివరాత్రి సందర్భంగా భీమవరం నుంచి ఆంధ్రలోని వెల్వడం గ్రామమంలో గల శివాలయానికి పుంగునూరు ఎద్దుల(2.5అడుగులు) బండిపై గల ప్రభను కట్టి ప్రత్యేక ఆర్షణగా నిలిచారు. – నెట్వర్క్, వెలుగు