
- శివ నామస్మరణతో మార్మోగిన ఆలయాలు
- శైవక్షేత్రాలకు పోటెత్తిన భక్తులు
ఓం నమ: శివాయ.. హరహర మహాదేవ శంభో శంకర..” అంటూ ఆలయాలు మార్మోగాయి. బుధవారం మహాశివరాత్రి సందర్భంగా ఉమ్మడి ఓరుగల్లు జిల్లా వ్యాప్తంగా శైవక్షేత్రాలకు భక్తులు పోటెత్తారు. హనుమకొండ వేయిస్తంభాల గుడి, సిద్దేశ్వరాలయం, మడికొండ మెట్టు రామలింగేశ్వరాలయం, వరంగల్ కాశీవిశ్వేశ్వర, భద్రకాళి ఆలయం, శంభులింగేశ్వర, కోటిలింగాల శివాలయం, వేలేరు గట్టు మల్లికార్జున స్వామి, కొత్తకొండ వీరభద్రస్వామి, ఐనవోలు మల్లికార్జున స్వామి ఆలయం, మహబూబాబాద్ జిల్లా కురవి వీరభద్రస్వామి ఆలయం, భక్తులతో కిటకిటలాడాయి.
జయశంకర్భూపాల్లపల్లి జిల్లా కాళేశ్వరంలో కాళేశ్వర ముక్తీశ్వర స్వామికి భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామి వారికి కలెక్టర్ రాహుల్ శర్మ దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించారు. యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప టెంపుల్లో భక్తులు ఉదయం నుంచే బారులు తీరి రామలింగేశ్వర స్వామికి అభిషేకాలు చేశారు. ఆయా ఆలయాల్లో రాత్రి శివపార్వతుల కల్యాణం కనుల పండువగా నిర్వహించారు. స్వామివారి పూజల్లో ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు, భక్తులు పాల్గొన్నారు. వెలుగు, నెట్వర్క్