మహాశివరాత్రి..చెర్వుగట్టు ఆలయానికి పోటెత్తిన భక్తులు

మహాశివరాత్రి..చెర్వుగట్టు ఆలయానికి పోటెత్తిన భక్తులు

నల్లగొండ: మహాశివరాత్రి సందర్భంగా నల్లగొండ జిల్లాలో అన్ని ఆలయాలు భక్తులతో కిక్కిరిపోయాయి. దేవాలయాల ప్రాంగణాలు శివనామస్మరణలతో మార్మోగాయి. ముఖ్యంగా శైవక్షేత్రాలైన చెర్వుగట్టు రామలింగేశ్వర స్వామి ఆలయం, పానగల్లు ఛాయసోమేశ్వర ఆలయం, వాడేపల్లి మీనాక్షి ఆగష్టేశ్వర స్వామి దేవాలయానికి భక్తులు పోటెత్తారు. తెల్లవారు జామునుంచే ఇష్ట దైవం మహాశివున్ని దర్శించుకునేందుకు ఆలయాల్లో క్యూగట్టారు. 

బుధవారం (ఫిబ్రవరి 26) న మహాశివరాత్రి సందర్భంగా నార్కట్పల్లి మండలం చెర్వుగట్టు దేవస్థానం శ్రీ పార్వతీ సమేత జడల రామలింగేశ్వర స్వామి ఆలయ ప్రాంగణం భక్తులతో  కోలాహలంగా మారింది. స్వామివారి దర్శనానికి భక్తులు బారులు తీరి నిలుచున్నారు. అర్చనలు, అభిషేకాలతో మొక్కులు తీర్చుకుం టున్నారు. 

మహాశివరాత్రి సందర్భంగా నార్కట్ పల్లి మండలం చెర్వుగట్టు దేవస్థానం శ్రీ పార్వతి సమేత జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం దంపతులు. అనంతరం ఎమ్మెల్యే వీరేశం దంపతులకు స్వామివారి తీర్ధ ప్రసాదాలను ఆలయ అర్చకులు అందజేశారు. 

రద్దీ దృష్ట్యా గుట్టపైకి వాహనాల రాకపోకలు నిలిపివేశారు పోలీసులు. మరోవైపు మహాశివరాత్రి సందర్భంగా దర్శనానికి వచ్చే భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశారు నిర్వాహకులు.  చలువ పందిళ్లు, త్రాగు నీటి సదుపాయాలను కల్పించిన దేవస్థానం అధికారులు.

జిల్లాలో మరో శైవక్షేత్రం వాడేపల్లిలో కూడా వాడేపల్లి మీనాక్షి ఆగష్టేశ్వర స్వామి దేవాలయానికి భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుండే కృష్ణ మూసి సంగం వద్ద పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకున్నారు భక్తులు. ఇక నల్లగొండ పట్ణణానికి సమీపంలో  ఉన్న పానగల్ల ఛాయ సోమేశ్వర ఆలయం భక్తులతో కిక్కిరిపోయింది.   అర్చనలు, అభిషేకాలతో మొక్కులు తీర్చుకుంటున్నారు.