- ఇప్పటికే వేలాదిగా చేరుకున్న భక్తులు
- ఏర్పాట్లు చేసిన అధికారులు
వేములవాడ, వెలుగు: వేములవాడలో మహాశివరాత్రి జాతర నేడు ప్రారంభంకానుంది. జాతరకు రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది భక్తులు తరలివస్తున్నారు. ఇప్పటికే రాజన్న ఆలయంతో పాటు రాజన్న ఆలయ పరిసరాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. 3 లక్షల మంది తరలివస్తారన్న అంచనాతో గుడి చెరువు ప్రదేశంలో చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. తాగునీరు, టాయిలెట్స్, బస్సులు, దర్శనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
తిప్పాపూర్ బస్టాండ్ నుంచి గుడిచెరువు వరకు భక్తులను తరలించేందుకు దేవస్థానం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 14 ఉచిత బస్సులను విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ప్రారంభించారు. భక్తుల కోసం గుడి చెరువు మైదానంలో ఉచిత అన్నదానం, ఉచిత అల్పాహారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ మూడు రోజుల పాటు ఉచిత అన్నదానం అందుబాటులో ఉంటుందన్నారు. జాతర ఏర్పాట్లను రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్అనిల్ కుమార్, కలెక్టర్ అనురాగ్ జయంతి, అడిషనల్ కలెక్టర్ పూజరి గౌతమి, ఎస్పీ అఖిల్మహాజన్, ఈవో కృష్ణ ప్రసాద్ పర్యవేక్షించారు. కాగా మహాశివరాత్రి సందర్భంగా శివ స్వాములు దీక్ష విరమించనున్నారు.
6 గంటలకు మహాలింగార్చన..
శివరాత్రి రోజు సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు అనువంశిక బ్రాహ్మణులచే మహా లింగార్చన, దర్శనం, రాత్రి 11.35 లింగోద్భవ కాలం నందు స్వామికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించనున్నారు. ప్రత్యేక పూజల్లో పాల్గొనాలనుకునే భక్తులు శ్రీభీమేశ్వరాలయంలో అభిషేకాలు చేసేందుకు అధికారులు అవకాశం కల్పించారు.